Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనం ఏ పని చేసినా ముందుగా ఓ ప్రణాళిక వేసుకుంటాం.. అదేవిధంగా మనం ప్రారంభించాలనుకుంటోన్న వ్యాపారానికీ ఓ పక్కా ప్రణాళిక అవసరం అంటున్నారు నిపుణులు. అప్పుడే తడబడకుండా అడుగు ముందుకు వేయగలుగుతామంటున్నారు. కాబట్టి మీరు చేయాలనుకుంటోన్న వ్యాపారానికి ఎంత పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో ముందుగా నిర్ణయించుకోవాలి. ఆపై మీ టార్గెట్ గ్రూప్ ఎవరు? మీరు తయారుచేయాలను కుంటోన్న ఉత్పత్తుల్ని ఎలా మార్కెట్లోకి తీసుకెళ్లాలి? తొలి దశలో వాటిని ఎంతమందికి చేరవేయాలనుకుంటున్నారు? ఉత్పత్తుల్ని మీరే స్వయంగా తయారుచేస్తారా? లేదంటే ఎవరినైనా పనిలో పెట్టుకోవాలనుకుంటున్నారా? ఒకవేళ పెట్టుకుంటే మీరు అంచనా వేసే లాభాల్లోంచి వారికి ఎంత చెల్లించగలుగుతారు.. ఇలాంటి విషయాలపై ఓ స్పష్టత తెచ్చుకోవాలి. ఇలా తొలి నాలుగైదుండ్లు సరిపడా ఓ కచ్చితమైన ప్రణాళిక వేసి పెట్టుకోవాలి.
ఏ వ్యాపారమైనా ఇలా మొదలుపెట్టగానే అలా లాభాల్ని ఆశించడం అత్యాశే అవుతుంది. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కూడా మొదట్లో ఎన్నో నష్టాలు, సవాళ్లను ఎదుర్కొన్నాకే ఈ దశకు చేరుకొని ఉంటారు. కాబట్టి వ్యాపారం విజయవంతంగా ముందుకెళ్లకపోయినా, పదే పదే సవాళ్లు ఎదురైనా, నష్టాల బాట పట్టినా పట్టుదల కోల్పోకుండా ఓపిక పట్టాలంటున్నారు నిపుణులు. మీ ఉత్పత్తి అంతలా జనాదరణకు నోచుకోకపోవడానికి కారణాలేంటో కనుక్కోవాల్సి ఉంటుంది.. దాన్ని మరింత ఆకర్షణీయంగా, వినియోగదారులకు ఉపయోగపడేలా ఎలాంటి మార్పులు చేయాలో తెలుసుకోవాలి. అలాగే నిపుణుల సలహాలు తీసుకోవడానికీ వెనకాడకూడదు.
ఏ పనైనా కొత్తగా ప్రారంభించినప్పుడు అందులో మనకు తెలిసో, తెలియకో కొన్ని తప్పులు దొర్లడం సహజం. నిజానికి ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లే మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తాయంటున్నారు నిపుణులు. అయితే స్టార్టప్ ప్రారంభించే సమయంలో మాత్రం కొన్ని పొరపాట్లు చేయకూడదని చెబుతున్నారు.
కొంతమంది తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు రావాలనుకుంటారు. నిజానికి అది సరైనది కాదు. మీ ఉత్పత్తిని వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మలచడానికి కాస్త డబ్బు ఖర్చైనా వెనకాడకూడదంటున్నారు నిపుణులు. అప్పుడు దానికి తగ్గ ప్రతిఫలం రాబట్టగలుగుతామంటున్నారు.
కొంతమంది తమ అభిరుచుల్ని పక్కన పెట్టి మార్కెట్ ట్రెండ్స్‌నే తమ వ్యాపార ఉత్పత్తిగా మలచుకుంటుంటారు. అయితే ఇది అన్ని వేళలా సక్సెస్ కాకపోవచ్చు. ఇలాంటప్పుడు వినూత్నంగా ఉన్న మీ అభిరుచులకే ప్రాధాన్యమివ్వమంటున్నారు నిపుణులు. తద్వారా మీ క్రియేటివ్ స్టార్టప్ మీకు బోలెడన్ని లాభాల్ని అందించచ్చు.
వ్యాపారం మొదలుపెడుతున్నాం కదా అని కొంతమంది ఉన్న ఉద్యోగానికి కూడా రాజీనామా చేస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల లాభాలొస్తే సరే.. ఒకవేళ నష్టాలొస్తే ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాపారంలో నిలదొక్కుకునే దాకా కాస్త కష్టమైనా అటు ఉద్యోగాన్ని, ఇటు వ్యాపారాన్ని బ్యాలన్స్ చేసుకోవడం ఉత్తమం అంటున్నారు.- వినియోగదారుల ఫీడ్‌బ్యాక్‌ని పరిగణనలోకి తీసుకుంటూ.. అవసరమైనప్పుడు నిపుణుల సలహాలు ఆచరిస్తే.. ఇక మీ స్టార్టప్‌కి తిరుగుండదనడంలో సందేహం లేదు.