Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాపాయికి పాలు ఇస్తే తల్లి ప్రసవం తర్వాత వచ్చిన బరువు తగ్గటానికి దోహదపడుతుంది. గర్భాశయం యధాస్థానంలోకి వస్తుంది. రక్తస్రావం తగ్గుతుంది. రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ లాంటి అనారోగ్యాలు రావు. తల్లి పాపాయికి పాలు ఎంతకాలం ఇస్తే ఇద్దరికీ అంత మంచిది. తల్లి పాలు తాగే పిల్లలకు శ్వాసకోశ వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులు, చర్మ వ్యాధులు, చెవి సమస్యలు మొదలగునవి రావు. పెద్ద వయసులో అధిక రక్తపోటు, మధుమేహ వ్యాధులను రాకుండా కాపాడుతుంది. తల్లి పౌష్టిక ఆహారం తీసుకోవాలి. బాగా నిద్రపోవాలి. పాపాయికి పాలు ఎంత ఎక్కువగా ఇస్తే అంత ఉత్పత్తి జరుగుతుంది. ఎలాంటి ఆహారం తీసుకుంటే తల్లిలో పాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందో తెలుసుకుందాం...
చక్కగా ఉడికిన అన్నం, తేలిగ్గా జీర్ణమయ్యే ఆకు కూరలు, పళ్ళ రసాలను తీసుకోవాలి. ఆయా కాలాల్లో వచ్చే పండ్లను తీసుకోవాలి.
ఎక్కువ కారం, పులుపు పదార్ధాలు, చల్లగా ఉండే పానీయాలు వంటివి తీసుకోకూడదు. సులువుగా జీర్ణం కాని పదార్ధాలను తీసుకోకూడదు. బాలింతలకు మెంతి కూర పప్పు ఎక్కువగా తినిపిస్తే పాల ఉత్పత్తి పెరుగుతుంది. మెంతులతో చేసిన పదార్ధాలను తినిపించాలి.
వెల్లుల్లిని పచ్చివిగా తినడం కంటే పొడులలో చేర్చి ఇవ్వడం మంచిది. కాకర కాయను ప్రసవం తర్వాత తీసుకోవడం వలన పాలు బాగా పడతాయి.
బొప్పాయి కల్ప తరువు. దోరగా ఉన్న బొప్పాయిని కోరులా చేసి కూర వండుకొని తిన్నట్టయితే పాల వృద్ధి బాగుంటుంది. బిడ్డకు వికారం, విరేచనాలు కల్గిస్తున్నపుడు బొప్పాయి పండుని తీసుకోవడం మంచిది.
తులసి ఆకులతో తేనె కలిపి తినడం వలన కూడా తల్లి పాలు బాగా ఉత్పత్తి అవుతాయి.
గ్రీన్ వెజిటబుల్స్, రెడ్ వెజిటేబుల్స్లలో ఎక్కువ ఫైబర్ వుంటాయి. ఇవి తల్లి పాలను పెంచడంలో సహకరిస్తాయి. ఆకు కూరలు, బీన్స్, స్వీట్ పొటాటొ, దుంపలు పాలను పెంచడంలో చాలా ఉపయోగపడతాయి. నల్ల ద్రాక్ష, కర్బూజ పండ్లు కూడా మంచివి. పాలకూర, జీలకర్ర, బార్లీ జావ, బొబ్బర్లు, మునగాకు మొదలగునవి చాలా మేలు చేస్తాయి. పాలు పడని బాలింతలు రాగిజావ తాగితే క్రమంగా పాల ఉత్పత్తి పెరుగుతుంది.