Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుతం ఈ నెలలో అతి తక్కువ కేసులు రికార్డవుతున్నాయి. ఆగస్టులో థర్డ్‌వేవ్ అన్నప్పటికీ ఆ సూచనలు కన్పించలేదు. అలాగని మనం నిర్భయంగా ఉండటానికి వీలులేదు. అన్ని జాగ్రత్తలూ పాటిస్తేనే మంచిది. కరోనా వైరస్ యుద్ధం చేసి చేసి అలసిపోయిందేమో. గత ఏడాదిన్నరగా అలుపులేని పోరాటం చేస్తున్నది కదా! కొద్దిగా విశ్రాంతి తీసుకుంటున్నట్టుంది. మనం ఈ సమయంలో వేసుకోవాల్సిన టీకాలు వేయించేసుకుంటే మంచిది కదా! దానితో యుద్ధానికి మనమూ శిరస్త్రాణాలూ, అన్నీ తొడుక్కుని రెడీగా ఉండాలి కదా! ఎక్కువగా పిల్లలను భయపెట్టాలని చూస్తున్నది. ఈ వారమయితే మా హాస్పిటల్‌కు కోవిడ్ చిన్నారులు ఎవరూ రాలేదు. కొద్దిగా కరోనా వైరస్ రిలాక్స్ అయ్యిందని మిగతా వైరస్లు, బాక్టీరియాలు ఊపందుకున్నాయి. ప్రజలు మాపేర్లు మర్చిపోతున్నారేమో అని డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియాలు ముందుకు దూకుతున్నాయి. ఏ జ్వరం వచ్చినా ఈ కాలంలో ముందు హాస్పిటల్‌కు వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలి. శానిటైజర్లు దగ్గర ఉంచుకోవాలి. మాస్కులు పెట్టుకోవాలి. పెండిండ్లకు వెళ్ళకపోవడమే మంచిది. ఇంట్లో ఉండి కళాత్మకంగ గడుపుదాం!
ప్లాస్టిక్ మూతలతో
చిన్న చిన్న ఇంజక్షన్ సీసాల మీద రక్షణగా ప్లాస్టిక్ మూతలుంటాయని చెప్పాను కదా! నేను ఎక్కువగా ఆసుపత్రి వ్యర్థ పదార్థాలనే బొమ్మల్లో వినియోగిస్తాను. మీరు మంచినీళ్ళ సీసాల మూతల్ని ఉపయోగించవచ్చు. బయటికెళితే మంచినీళ్ళ బాటిల్‌ను కొంటాము కదా! అలాంటి బాటిల్స్‌లో చెట్లు పెంచుకోవచ్చు. మూతలతో బొమ్మలు చేయవచ్చు. సరే నేనీ మూతలతో ఏం బొమ్మ చేస్తానో చూడండి. గుండె బొమ్మను చేస్తున్నాను. ఈ మధ్య చాలా చిన్న వయసు వాళ్ళకు కూడా నాళాలు మూసుకుపోయాయి అంటున్నారు. రక్తనాళాలు కొవ్వుతో పేరుకుపోవడం వల్ల రక్తప్రసారం జరగక గుండె జబ్బులు వస్తున్నాయి. ఆ కొవ్వులు పేరుకుపోవడం తక్కువగా ఉంటే స్టంట్లు వేయడంతో సరిపెడతారు. ఒకవేళ ఎక్కువ నాళాలు ఎక్కువ శాతం మూసుకుపోతే బైపాస్ సర్జరీ చేయవలసి ఉంటుంది. కొంతమందికి ఈరెండూ చేసే అవకాశం లభించక ప్రాణాల మీదకు వస్తుంది. ఆసుపత్రికి వెళ్ళే సమయం కూడా ఉండకపోవచ్చు. ఇవన్నీ కూడా మారిన మన జీవన సమయం కూడా ఉండకపోవచ్చు. ఇవన్నీ కూడా మారిన మన జీవన విధానం వల్ల ఎక్కువగా జరుగుతున్నాయి. అందుకే నేనీరోజు ఈ అంశాన్ని తీసుకున్నాను. ఒక కార్డియాలజిస్ట్‌కు పద్మశ్రీ వచ్చినపుడు నేనొక గుండె బొమ్మను తయారు చేశాను. అవే మికిప్పుడు చూపిస్తున్నాను. ఇంజక్షన్ సీసా మూతలు రంగుల్లో ఉన్నప్పటికీ నేను కేవలం ఎరుపురంగు మూతల్నే వాడాను. రక్తంలో ముంచినట్టున్న ఈ గుండెను చూడండి.
ఆకులతో...
హరితహారంలో భాగంగా రోడ్ల పక్కన చెట్లు నాటారు కదా! మా ఇంటి వెనక గేటుకు ఆనుకొని ఒక చెట్టు నాటారు. అది పెద్దదైంది. అప్పుడు దాన్ని గమనిస్తే ఆకులు మందంగా హృదయాకారంలో ఉన్నాయి. కొద్దిగా అటూఇటూగా హృదయాకారం కాదు చక్కగా గీతగీసి కత్తిరించినట్టుగా ఉన్నాయి. నాకా చెట్టును చూస్తే పచ్చటి హృదయాలను వేలాడదీసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఈ ఆకులు కోసుకొచ్చి నేనేదో బొమ్మను చేశాను. ఒకరోజు ఏమన్పించిందంటే హృదయాకారపు ఆకులతో హృదయాన్ని చేస్తే ఎలా ఉంటుంది అనుకున్నాను. అలా ఆ ఆకులతో గుండెను చేశాను. చుట్టూ ఆకులు పెట్టి మధ్యలో పట్టుకుచ్చుల పూలను అమర్చాను. దీని చుట్టూ మరో హృదయాన్ని అమర్చాను. ఇలా హృదయాకారపు ఆకులతో హృదయం తయారయింది. గుండె జబ్బులు పెద్ద వాళ్ళకే కాదు పుట్టిన పిల్లలక్కూడా వస్తాయి. పుట్టేటప్పటికి గుండెలో కవాటాలు, గదులు సరిగా ఏర్పడక పోవడం, లేదా గుండెకు చిల్లులతో పుట్టడం ఎక్కువగా చూస్తాము. ప్రధానంగా మేనరికాలు పెండిండ్ల వల్ల గుండె సమస్యలతో పుడుతుంటారు. మేనరికాల పెండిండ్లు చేసుకోకుండా ఉండటం క్షేమకరం. అప్పుడే పుట్టిన పసికందులకు గుండె సమస్యలుండటం చూస్తుంటే ఎంతో బాధ కలుగుతుంది. ''టెట్రాలజీ ఆఫ్ ఫాలో'' అనే గుండెజబ్బును మామూలుగా 'టిఓఎఫ్' అని పిలుస్తారు. బంధువుల్లో జరిగే పెండిండ్ల వల్ల ఇలాంటి జబ్బులు ఎక్కువగా వస్తాయి.
చాక్లెట్లతో...
స్వాతంత్య్ర దినోత్సవం రోజు పిల్లలకు పంచటానికి బోలెడు చాక్లెట్లు తెచ్చాము. వాటిలో కిస్మీ, ఫలీరో రెండు రకాల చాక్లెట్లు చాలా మిగిలాయి. వాటితో ఏదైనా బొమ్మ చేయాలనుకున్నాను. ఈ రోజు గుండె అంశాన్ని తీసుకున్నాం కాబట్టి గుండెను చేశాను. ఈ 'ఫలీరో' చాక్లెట్లలో హార్ట్ చాక్లెట్టే ఉంటుంది. హార్ట్ చాక్లెట్లతో హార్ట్ బొమ్మ చేయడం బాగుంది. గుండె పదిలంగా ఉండాలంటే ఉదయపు నడక చాలా ముఖ్యం. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కొవ్వు పేరుకునే పదార్థాలు తక్కువగా తీసుకోవాలి. ఎక్స్ర్సైజులు రోజూ కాకపోయినా వారానికి రెండు రోజులైనా కనీసం చేయాలి. ఆఫీసులకు వెళ్ళేవారు బండ్లమీద కాకుండా సైకిల్ మీద వెళితే మంచిది. ఈ మధ్య నగరాలలో కొంతమంది ఆఫీసులకు దగ్గరగా ఇళ్ళున్నవారు సైకిల్ మీదనే ఆఫీసులకు వెళుతున్నారు. నూనె వాడకం, వేపుళ్ళు తగ్గిస్తే మంచిది. ఒకసారి డీఫై చేసిన నూనెను మరల వాడక పోవడం మంచిది. నూనె తక్కువ పట్టే ఆహారపదార్థాలు అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది.
పాలపీకలతో...
పాలపీకలు రంగు రంగుల్లో ఉండే ప్లాస్టిక్ వస్తువులు. పిల్లలను ఆకర్షించడానికి గాను పాలసీసాల కంపెనీలు అలా నిండు రంగుల్లో తయారు చేస్తారు. ఇవి ప్లాస్టిక్ వ్యర్థాలు కాబట్టి పర్యావరణానికి చేటు చేస్తాయి. పర్యావరణానికి కాలుష్యానికి అంటగట్టే ప్లాస్టిక్ వస్తువులను నేల మీద పారేయకూడదు. నేను వీటితో ఎన్నో బొమ్మలు చేశాను. ఈరోజు గుండె బొమ్మను తయారు చేస్తున్నాను. గుండె వ్యాధులలో ఎన్నో రకాలున్నాయి. ఈనాటి స్పీడ్ యుగంలో మానవ జీవన విధానంలో మార్పుల వలన గుండె జబ్బులు ఎక్కువయ్యాయి. కరోనరీ ఆర్టరీ డిసీజ్, హార్ట్ వాల్ప్డిసీజ్, హార్ట్ ఎరిత్మియా, పెరి కార్టియల్ డిసీజ్ అంటూ ఎన్నో రకాలున్నాయి. సాధారణంగా గుండె లయబద్ధంగా కొట్టుకోవాలి కదా! క్రమబద్ధంగా కాక అసమంగా కొట్టుకోవడాన్ని ''హార్ట్ ఎరిత్మియా'' అంటారు.
పుదీనా, పచ్చిమిర్చితో...
ఈరోజు పుదీనా రైస్ చేద్దామని పుదీనా కట్టలు ఎక్కువగా తెచ్చాను. ఈ ఆకులతో ఒక హృదయాన్ని ఆవిష్కరించాలనుకున్నాను. మమకారం, ఉపకారం మనసులో ఉంటేనే బయటకు వస్తుంది అంటారు కదా! మనమిప్పుడు పచ్చిమిర్చి కారంతో గుండెను చేస్తున్నాం. మరి ద్వేషం, ప్రతికారం అనేవి కూడా మనసులో నుంచి వచ్చేవే కదా! పచ్చిమిర్చి, పుదీనా ఆకులు కలగలిపి ఆకుపచ్చని హృదయాన్ని ఆవిష్కరించాం. ఆకు కూరలు తింటే గుండె జబ్బులకు దూరంగా ఉంటామని తెలుసుకోవాలి. గుండె జబ్బుల గురించి జాగ్రత్తగా ఉండాలని తపాలా శాఖ ఎన్నో స్టాంపులను విడుదల చేసింది. నేను ఈ స్టాంపులను సేకరించి ఒక ఛార్ట్ తయారు చేశాను. గుండె శరీరానికి కావలసినంత రక్తాన్ని సరఫరా చేస్తుందని చిన్ననాటి పుస్తకాల్లో చదువుకున్నాం కదా! ఎప్పుడైతే గుండె తగినంత రక్తాన్ని సరఫరా చేయలేకపోతుందో అప్పుడు హార్ట్ ఫెల్యూర్ అంటారు. 'కార్డియో మయోపతి' కూడా ఒకరకమైన హార్ట్ మజిల్ డిసీజ్.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్