Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శోభకు ముగ్గురు అక్కలు. ఇంట్లో చిన్నది కావడంతో గారాబం ఎక్కువ. ఎంత అల్లరి చేసినా ఎవ్వరూ ఏమీ అనరు. దాంతో ఇంట్లో ఆమె ఆడిందా ఆట, పాడిందే పాట. అలాంటి వాతావరణంలో పెరిగిన శోభ పీజీ పూర్తి చేసి ఉద్యోగంలో చేరింది. ఉద్యోగంలో చేరిన ఏడాదిలోపే పెండ్లి చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చదవండి.
శోభ భర్త పేరు కిరణ్. అతను ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తాడు. జీతం తక్కువ. పెండ్లికి అప్పులు బాగా అయ్యాయి. అందుకే అతని సంపాదన ఇంట్లో ఇవ్వకుండా అప్పులు తీర్చుకుంటున్నాడు. శోభ అత్త ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా చేస్తోంది. ఇంటి ఖర్చులు మొత్తం ఆమే చూసుకుంటోంది. శోభ దగ్గర కిరణ్ అప్పుడప్పుడు డబ్బులు తీసుకునేవాడు. తనకు ప్రెగెన్సీ కన్ఫామైన తర్వాత శోభ జాబ్ మానేసింది. ఇక అప్పటి నుండి ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి.
శోభకు బాబు పుట్టాడు. ఖర్చులు పెరిగాయి. అత్తా కోడళ్ళకు అస్సలు పడేది కాదు. చిన్న చిన్న విషయాలకే గొడవలు. ఓపక్క కిరణ్ భార్య కోర్కెలు తీర్చలేకపోతున్నాడు. అందుకే ఆమె బాబుతో పుట్టింటికి వచ్చేసింది.
తెలిసిన వారు చెబితే ఆమె ఐద్వా లీగల్ సెల్‌కు వచ్చి ''మేడమ్, కిరణ్ నా ఆలోచనలకు సరిపోడు. అతనికి ఏదీ చేతకాదు. భార్య కోర్కెలు తీర్చాలిసన బాధ్యత భర్తకు ఉంది. కానీ ఎంత చెప్పినా ఆయన వినడు. ఇంట్లో అంతా అత్త పెత్తనమే. అందుకే విడాకులు తీసుకోవాలకుంటున్నా. అయితే మీతో ఓసారి మాట్లాడిస్తే కిరణ్‌లో మార్పు వస్తుందని తెలిసిన వారు చెబితే మీ దగ్గరకు వచ్చా. మీరు ఎలాగైనా ఆయనతో మాట్లాడి మా సమస్య పరిష్కరించండి' అంటూ శోభ తన మాటలు ముగించింది.
శోభ చెప్పిందంతా విన్న లీగల్‌సెల్ సభ్యులు వచ్చే వారం కిరణ్‌ను, అతని తల్లిని రమ్మని లెటర్ పంపారు. ఆ తర్వాతి వారం కిరణ్ తన తల్లిని తీసుకొచ్చాడు. కిరణ్ మాట్లాడుతూ 'శోభకు ఇంట్లో పని చేయడం రాదు. మా అమ్మ ఉదయం ఏడుగంటలకే స్కూల్‌కి వెళ్ళి సాయంత్రం ఐదు గంటలకు వస్తుంది. అమ్మ వెళ్ళిన తర్వాత కూడా ఆమె నిద్ర లేవదు. బద్దకం ఎక్కువ. ఇక్కడి ప్రతి విషయాన్ని వాళ్ళ అమ్మనాన్నలకు చెబుతుంది. వాళ్ళ నాన్న, బావలు మా ఇంటికి వచ్చి నన్ను
ఎగతాళి చేస్తుంటాడు. 'సంపాదించడం చేతగాని వాడికి పెండ్లెందుకు' అంటూ నానా మాటలు అంటారు. పెండ్లప్పుడు కొన్ని అప్పులయ్యాయి. అంతకు ముందు కూడా కొంత అప్పు ఉంది. అందుకే నా జీతం చిట్టీలు కడుతూ అప్పులు తీరుస్తున్నా. అమ్మ తనకు వచ్చే జీతంలో ఇల్లు గడుపుతుంది. ఈ విషయాలు పెండ్లికి ముందే శోభకు తెలుసు. ఉన్నదాంట్లో సర్దుకుని బతుకుదామంటే అస్సలు వినదు. తన వల్లే మా ఇంట్లో గొడవలు. మీ లీగల్‌సెల్ గురించి విన్నాను. భార్యా, భర్తలకు సర్ది చెప్తారని నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. మీ దగ్గరకు వచ్చినందుకైనా శోభలో మార్పు వస్తే నాకూ సంతోషం. ఈ గొడవల వల్ల బాబు ఇబ్బంది పడుతున్నాడు' అంటూ కిరణ్ చెప్పుకొచ్చాడు.
తర్వాత కిరణ్ తల్లి మాట్లాడుతూ 'అమ్మా, నేను ఉదయం కాలేజీకి వెళితే సాయంత్రం వస్తాను. నేను వచ్చే వరకు ఒక్క పని కూడా చేయదు. వంట చేయమంటే అవసరానికంటే ఎక్కువగా వండుతుంది. తర్వాత రోజు అది పారేయాల్సి వస్తుంది. నేను చెబుదామంటే నా మాట వినదు. చిన్న విషయానికే పెద్దగా అరిచి గోలపెడుతుంది. కనీసం వాళ్ళ అమ్మనాన్నలు కూడా ఆమెకు అర్ధమయ్యేట్టు చెప్పరు. ఏమైనా అంటే మా దగ్గరకే వచ్చి 'మా అమ్మాయికి ఎలాంటి కష్టం లేకుండా చూసుకున్నాం. మీ దగ్గరకు వచ్చి ఎన్ని కష్టాలు పడుతుందో' అంటూ బాధపడింది.
ముగ్గురూ చెప్పింది విన్న సభ్యులు మళ్ళీ రెండు వారాల తర్వాత రమ్మని చెప్పి అందరినీ పంపారు. అప్పుడు ఇరు కుటుంబాల వారిని రమ్మన్నారు. సభ్యులు శోభతో మాట్లాడుతూ 'చూడు శోభ పెండ్లయిన తర్వాత ఆ కుటుంబం నీది. సమస్యలు ఏమైనా ఉంటే అందరూ కలిసి పరిష్కరించుకోవాలి. మనకు తెలియని విషయాలు ఇతరుల దగ్గర తెలుసుకోవడం తప్పేమీ కాదు. ఇంటి పనుల గురించి మీ అత్త చెబుతుంటే నీకు నచ్చడం లేదు. ఓ పక్క నీ భర్తకు వచ్చిన ఆదాయం మొత్తం అప్పులు తీర్చడానికే సరిపోతుంది. నీకు బాబు పుట్టాక ఉద్యోగం మానేశావు. దాంతో డబ్బు నీ చేతిలో లేక ఇబ్బంది పడుతున్నావు. ఇప్పుడు బాబుకు ఏడాది నిండింది. కాబట్టి నువ్వు కూడా ఏదైనా ఉద్యోగం చూసుకో. పదేపదే పుట్టింటికి వెళ్ళడం తప్పు. పైగా మీ నాన్న, బావలు నీ భర్తను తక్కువ చేసి మాట్లాడుతున్నారు. నీ భర్తను ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే అది నీకు కూడా మర్యాద కాదు. ఇవన్నీ నీవైపు నుండి జరిగిన పొరపాట్లు. మరో ముఖ్యమైన విషయం... మీ రిద్దరు ఇలా పోట్లాడుకుంటూ ఉంటే ఇలాంటి వాతావరణంలో పెరిగిన నీ కొడుకు ఎలా తయారవుతాడు. నువ్వు బాబు గురించి ఆలోచించడం లేదు. సమస్యలు ఉన్నప్పుడు కాస్త సర్దుకొని బతకడం నేర్చుకో. వీటికి నువ్వు సరే అంటే నీ భర్తకు చెప్పాల్సిన విషయాలు కూడా చెబుతాం' అన్నారు.
సభ్యులు చెప్పిన దానికి శోభ 'మీరు చెప్పింది నిజమే. నావైపు నుండి తప్పులు ఉన్నాయి. వీటిని నేను కచ్చితంగా మార్చుకుంటా' అంది. దాంతో సభ్యులు కిరణ్‌ని లోపలికి పిలిచి 'చూడు కిరణ్, నువ్వు కూడా సాధ్యమైనంత వరకు నీ ఆదాయాన్ని పెంచుకోవాలి. భార్య అవసరాలు తీర్చడం భర్తగా నీ బాధ్యత. నీకు అవసరమైనపుడు శోభ నీకు డబ్బులిచ్చింది. ఇప్పుడు బాబు అవసరాలు కూడా నువ్వే చూసుకోవాలి. నువ్వు కూడా నీ బాధ్యతలు గుర్తించాలి. ఇద్దరూ కలిసి మీ సమస్యలు పరిష్కరించుకోవాలి' అని చెప్పారు. కిరణ్ కూడా తన తప్పులను ఒప్పుకున్నాడు.
ఇంతలో పక్కనే ఉన్న శోభ తండ్రి మాట్లాడుతూ ఏడాది బాబును వదిలి మా అమ్మాయి ఉద్యోగానికి ఎలా వెళుతుంది. అది జరిగే పని కాదు. మా అమ్మాయి ఉద్యోగం చెయ్యదు' అన్నాడు. దానికి సభ్యులు 'వాళ్ళ కుటుంబంలో కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయి. అప్పులు తీరాలంటే ముగ్గురూ ఉద్యోగం చేయక తప్పదు. బాబును ఎక్కడ పెట్టాలనే విషయాన్ని వాళ్ళు ఆలోచించుకుంటారు. బాబు మీకే కాదు, ఆమెకూ మనవడే. మీరు కంగారు పడకండి. అనవసరంగా వాళ్ళ విషయాల్లో మీరు ఎక్కువగా జోక్యం చేసుకోవద్దు. మీ అమ్మాయి సమస్య ఇంత వరకు రావడానికి కొంత వరకు కారణం మీరు కూడా. ఆడపిల్లను ప్రేమగా పెంచాలి. అలాగే బాధ్యతలు కూడా నేర్పాలి. అత్తగారింట్లో ఏమైనా సమస్య వస్తే అర్ధమయ్యేట్టు చెప్పకుండా, మరింత గొడవలు పెట్టే విధంగా ప్రవర్తించారు. ఇది మీరు కావాలని చేయకపోవచ్చు. మీ అమ్మాయిపై ఉన్న అతి ప్రేమనే దీనికి కారణం. అయితే మీరు ఆమె భవిష్యత్ గురించి ఆలోచించండి. ఆమె కుటుంబ నిర్ణయాలు ఆమెనే తీసుకోనివ్వండి' అన్నారు. దాంతో అతను మౌనంగా ఉండిపోయాడు.
కిరణ్, అతని తల్లిదండ్రులు, శోభ మాత్రం సభ్యులు చెప్పినట్టు చేయడానికి అంగీకరించారు. రెండు వారాల తర్వాత భార్యా, భర్తలు వచ్చి ఇప్పుడు తమ మధ్య ఎలాంటి సమస్యలు లేవని, చిన్న చిన్న సమస్యలు వచ్చినా వాటిని అప్పటికప్పుడు పరిష్కరించుకొని సంతోషంగా ఉంటున్నామని చెప్పారు. ప్రస్తుతం శోభ ఉద్యోగ ప్రయత్నంలో ఉంది.
- సలీమ