Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మతం పిచ్చోడి చేతిలో రాయి అయితే అది మొదటగా వచ్చి తగిలేది మహిళకే. ఏ విపత్తు వచ్చినా ముందు బలయ్యేది మహిళే. ఈ వాస్తవాన్ని ప్రపంచాన్ని కుదిపేసిన మహమ్మారితో కండ్లారా చూశాం. ఆఫ్ఘానిస్థాన్‌లో జరుగుతున్న హింసతో మతం రేపు మారణహౌమం కనబడుతుంది. తాలిబన్ల ఆదీనంలో ఆ దేశం ఇప్పుడు అల్లాడిపోతుంది. అప్పటి వరకు ఉన్న హక్కులను మహిళలు పూర్తిగా కోల్పోతున్నారు. 'ఇంట్లో లేదా సమాధిలో మాత్రమే మేం ఆడవాళ్ళను చూడదలిచాం' అని మహిళలను పరదాల చాటున నాలుగ్గోడలకే పరిమితం చేసే దుర్మార్గమైన నిబంధనను బహిరంగంగా ప్రకటించే తాలిబన్లు... 'మా పాలనలో మహిళలకు చోటు కల్పిస్తాం... స్వేచ్ఛగా బతికే హక్కు కల్పిస్తాం' అంటే ఎలా నమ్ముతారు. నిరంకుశత్వం రాజ్యమేలుతున్న చోట ఆమెకు స్వేచ్ఛ ఎలా సాధ్యం...
2000లో తాలిబాన్ ప్రభుత్వం క్రికెట్‌ను ప్రోత్సహించడానికి ప్రణాళిక రూపొందించింది. అప్పటి వరకు ఆట గురించి ఎలాంటి అవగాహన లేని అఫ్ఘానిస్థాన్‌లో క్రికెట్‌ని ఎలా ప్రవేశపెడుతుందో చాలా మంది అర్థం చేసుకోలేకపోయారు. తాలిబాన్లు సంగీతం నుండి సినిమాల వరకు ప్రతి వినోదాన్ని మహిళలకు నిషేధించారు. అలాంటిది అందరూ ఆశ్చర్య పోయేవిధంగా ఆఫ్ఘనిస్తాన్‌లో క్రికెట్ ఆడవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. పాకిస్థాన్ మద్దతుతో అసోసియేట్ మెంబర్షిప్ కోసం తాలిబాన్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కు దరఖాస్తు చేసింది. అయితే తాలిబాన్లను తరిమికొట్టే వరకు అంటే 2001 వరకు కౌన్సిల్ దానిపై స్పందించలేదు.
తిరుగుబాటుకు మంచి అవకాశం
నేను నిరంకుశత్వం గురించి, అది ప్రజలకు ఏమి చేస్తుందో, ప్రజలు దానికి వ్యతిరేకంగా ఎలా తిరుగుబాటు చేస్తారో రాయాలనుకున్నాను. ఆఫ్ఘానిస్తాన్‌లో క్రికెట్ గురించి తెలియదు కాబట్టి ఆటలో గెలవడానికి ఈ అనుభవం లేని వారికి శిక్షణ ఎవరు ఇస్తారు. నాకు క్రికెట్ అంటే ఇష్టం. నేను నా అక్కచెల్లెళ్ళతో పాటు ఆటపై ఆసక్తి పెంచుకున్నాను. తాలిబాన్ పాలనకు వ్యతిరేకంగా ఈ ఆట ద్వారా తిరుగుబాటు చేయడానికి, ఆట ఆడగల బంధువులను, తిరుగుబాటు చేసే ఓ మహిళను సృష్టించడానికి మంచి అవకాశం లభించిందని నేను అనుకున్నాను. అయితే ఒక మహిళగా ఆమె జట్టులో సభ్యురాలు కాలేదు.
క్రికెట్ కోచ్‌గా ఆమె
ఆమెకు ఆట ఎలా తెలుస్తుంది? శతాబ్దాలుగా ఆఫ్ఘన్ మహిళలు అన్ని రకాల క్రీడల నుండి వెలివేయబడ్డారు. దేశంలో ఉన్న ఏకైక ప్రసిద్ధ క్రీడ బుజ్కాషి. ఆ ఆటలో క్రీడాకారులు గుర్రాలపై ఎక్కి తల లేని మేకను బంతిలా కొడతారు. కాబట్టి క్రికెట్ కోచ్‌గా ఓ మహిళను తయారు చేయాలని నిర్ణయించుకున్న తర్వాత, నేను ఆమెను వేరే దేశం వెళ్ళి ఆట నేర్చుకునేలా చేయాల్సి వచ్చింది. ఆమె తండి భారతదేశ దౌత్యవేత్తగా ఉండటంతో అక్కడే ఆమె పాఠశాల, కళాశాలలో చదువుతూ క్రికెట్ నేర్చుకుంటుంది.
మహిళలపైనే ప్రభావం
ఎక్కడ ఏ దౌర్జన్యం జరిగినా మొదటగా అక్కడ మహిళలే ఎక్కువగా ప్రభావితమవుతారు. బానిసలుగా మారి అత్యాచారాలకు, బలవంతపు వివాహాలకు గురౌతారు. అక్రమ రవాణా చేయబడి వారికి స్వాతంత్య్రం ఇచ్చే ఆర్థిక అవకాశాలను కోల్పోతారు. పురుషులు వారిపై విపరీతమైన హింసకు పాల్పడతారు. తాలిబాన్ పాలనలో మహిళలు అవమానించబడ్డారు. అది నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. వారు వారి అమ్మమ్మలు, తల్లులు, సోదరీమణులు భార్యలను అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇల్లు లేదా సమాధి
దేశంలో అణచివేతను ప్రోత్సహించడానికి పాలనలో ఓ విచిత్రమైన మంత్రిత్వ శాఖ ఉంది. ఇది మహిళలు ఇంటిలోపల లేదా సమాధిలో మాత్రమే చూడాలని తీర్పునిచ్చింది. ఇప్పటికీ మహిళలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఒకవేళ బయటకు వెళ్ళాలంటే బంధువు అయిన మహ్రమ్(రక్తసంబంధీకులు)తో మాత్రమే బయలుదేరవచ్చు. అప్పటికి నా ప్రయత్నం నేను మొదలుపెట్టాను. కానీ 2001లో తాలిబాన్ అధికారం కోల్పోయిన తర్వాత నా ఆలోచనను పక్కన పెట్టాను. ఏదేమైనా గత కొన్ని సంవత్సరాలుగా తాలిబాన్లు మళ్లీ అధిక శక్తితో కనిపించినప్పుడు నేను నా ప్రారంభ రోజులను గుర్తు చేసుకున్నాను. క్రికెట్‌ని ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్న ఆ సమయం గురించి ఇప్పుడు రాయాలని నిర్ణయించుకున్నాను.
అందరికీ ఒకే గౌరవం
నేను కాబూల్‌ను సందర్శించాను. శిక్షణ పొందిన డ్రైవర్, గైడ్, అంగరక్షకుడు విమానాశ్రయంలో కలుసుకున్నారు. ముగ్గురు గన్మెన్ల సహకారంతో 10 అడుగుల పేలుడు గోడల ద్వారా మూడు అడ్డంకుల గుండా నేనుండబోయే హౌటల్‌లోకి ప్రవేశించాను. అక్కడి పురుషులు, స్త్రీలను కలవడానికి పరిచయాలు పెట్టుకున్నాను. టెలివిజన్ కెమెరా దుమ్ము దులిపి దాని ద్వారా ఆఫ్ఘన్లను చూస్తున్నాము. అత్యంత ఆతిథ్యమిచ్చే, స్నేహపూర్వక, ఉదారమైన వ్యక్తులుగా వారిని నేను గుర్తించాను. పని నుండి ఓ రోజు సెలవు తీసుకున్న ఓ అధికారి నన్ను నగరం చుట్టూ, దూరంగా ఉన్న సరస్సుకి తీసుకెళ్లాడు. మేము కాబూల్ ఫుట్‌బాల్ స్టేడియ వద్ద ఆగిపోయాము. ఈ స్టేడియం ఇప్పుడు శిక్షలు విధించే స్థలంగా మారిపోయింది. నన్ను అతను తన ఇంట్లో భోజనం చేయమని పట్టుడితే చేశాను. అతని డ్రైవర్ కూడా మాతో పాటు భోజనానికి కూర్చున్నాడు. ఆఫ్ఘన్ ప్రజలు అందరినీ ఒకే గౌరవంతో చూస్తారని అప్పుడే నేను తెలుసుకున్నాను. అయితే అతని కుమారుడు మాకు సేవ చేస్తునపుడు నా హోస్ట్ భార్య ఎవరికీ కనిపించకుండా దాక్కొని ఉంది.
దారి కనిపించేది కాదు
నా నవల కోసం తాలిబాన్ పాలనలో జీవించి, బయటపడిన మహిళల జీవితాల గురించి నేను తెలుసుకున్నాను. అదేం పెద్ద సమస్య కాలేదు. నేను వారి ఆఫీసుల్లో, ఇళ్లలో వారిని కలిశాను. వారి గత అనుభవాలను విన్నాను. వారు ఇప్పుడు స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఉన్నారు. కానీ ఇప్పటికీ అజ్ఞాతాన్ని కోరుకున్నారు. అయితే తాలిబాన్ల కింద రోజుకు ఐదుసార్లు గడ్డం పెంచుకుని ప్రార్థనలు చేయాల్సిన తమ పురుషుల పట్ల వారందరూ జాలిపడ్డారు. వారు మొదటి సారి బుర్ఖా ధరించి దాని వల్ల జారిపడిపోవడం వంటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని నవ్వుకున్నారు. రహదారిపై వారు ప్రమాదాలకు గురయ్యేవారు. ఎందుకంటే వారికి తలలను ఎడమ, కుడి వైపుకు ఎలా తిప్పుకోవాలో తెలిసేది కాదు. వారు ధరించే ముసుగు వల్ల దారిని సరిగా చూడగలిగే వారు కాదు.
ధైర్యంగా ఉన్నారు
వీధుల్లోకి, స్కూలుకు వెళ్లేటప్పుడు యూనిఫామ్లతో ఉన్న పాఠశాల విద్యార్థులను నేను చూశాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లలలాగే మహిళలు ఒంటరిగా, జంటగా, ఫ్యాషన్‌గా దుస్తులు ధరించి, మేకప్‌తో ధైర్యంగా ఉన్నారు. బుర్ఖాలలో ఉన్నవారు కూడా హైహీల్స్ ధరించారు. చిరునవ్వుతో ఓ యువ, చురుకైన మహిళ నా ఊహలను ఆకర్షించింది. ఆమె నా రుక్షణ. తాలిబాన్ల దురాగతాలపై మారుపేరుతో రిపోర్టింగ్ చేస్తున్న ఓ జర్నలిస్ట్ ఆమె.
కూతురే వారికి కొడుకు
ఒక మహిళగా ఆమె నా అక్కచెల్లెళ్ళకు ఈ గొప్ప ఆటను ఎలా నేర్పించగలదు? బుర్ఖాలో ఆమె ఎలా బౌలింగ్ చేస్తుంది. అబ్బాయిలు నేర్చుకునేటపుడు బంతిని పట్టుకోవడానికి పరిగెత్తవచ్చు. మరి మహిళలు ఎలా పరిగెడతారు. అఫ్ఘాన్ వారు వారికి కొడుకు లేనట్టయితే తమ చిన్న కుమార్తెలను అబ్బాయిలుగా పెంచుతారని తెలుసుకున్నాను. బచా పోష్ అబ్బాయి వేషం) ధరించేవారు. నిర్జనమైన కాబూల్ యూనివర్సిటీ క్యాంపస్‌లో గేమ్ నేర్పించడానికి నా రుక్షణను యువకుడిగా మార్చివేశాను.
హింసాత్మక మలుపు
ఇప్పుడు గత కొన్ని రోజులుగా చాలా మంది తాలిబాన్ పాలనలో ఉన్న మహిళలు, పిల్లల కోసం ఆందోళన చెందుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుండి అమెరికా అకస్మాత్తుగా వైదొలగడాన్ని విమర్శించారు. ఓ ఆఫ్ఘన్ మహిళ ''ఇప్పుడు నేను సాధించిన ప్రతిదాన్ని తగలబెట్టాలి'' అని చెప్పింది. మహిళల హక్కుల గురించి చర్చించకూడదనేది తాలిబాన్ల ఓ కీలక నిబంధన. యుగయుగాలుగా మహిళలను అణచివేసిన మత పెద్దల వరుసలో తాలిబాన్లు ఒకరు మాత్రమే. వారు తమ నమ్మకాలను ఇతరులపై రుద్దడానికి హింసను ఉపయోగిస్తారు. టెర్రర్‌పై జరిగిన ఈ యుద్ధంలో మనపై వాటి ప్రభావం ఎంతో ఉంది.
అనేక మంది నిరంకుశులు ఉన్నారు
నిరంకుశత్వం ఓ అంటు వ్యాధి. 21వ శతాబ్దపు ప్రపంచాన్ని పరిశీలిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థలను నాశనం చేసే అనేక మంది నిరంకుశులు ఉన్నారు. తాలిబాన్ రక్తపాత శక్తి తిరిగి వచ్చినప్పుడు నా రుక్షణ, నేను సంవత్సరాల కిందట కలిసిన మహిళలు, వారి ఆడ పిల్లలు, ఇంట్లో లేదా సమాధి అనే నిరంకుశ పరిస్థితులు మళ్ళీ తిరిగి రావడం గురించి ఆలోచిస్తాను.
మలాలై సాహసం
నేను 2000లో నవల రాయడం మొదలుపెట్టాను. దానికోసం ఆఫ్ఘనిస్తాన్ గురించి, సుదీర్ఘమైన అల్లకల్లోల చరిత్రను పరిశోధించాను. మొదటి ఆంగ్లో-ఆఫ్ఘన్ యుద్ధంలో జనవరి 9, 1842న 16,500 మంది బ్రిటిష్ సైనికులు, పౌరులు కాబూల్ నుండి వెనక్కి తగ్గారు. విలియం బ్రైడెన్ మాత్రమే ఈ మారణకాండ నుండి బయటపడ్డాడు. రెండవ ఆంగ్లో-ఆఫ్ఘన్ యుద్ధంలో ఆఫ్ఘన్ పోరాటయోధులను సమీకరించిన ఓ చిన్న గ్రామానికి చెందిన మలాలై గురించి కూడా నేను చదివాను. ఆఫ్ఘన్ జెండా-బేరర్ మరణించినప్పుడు, మలాలై తన ముసుగును ఆఫ్ఘన్ సైనికులను నడిపించడానికి ఓ బ్యానర్‌గా ఉపయోగించింది. ఆమె ఆ యుద్ధంలో మరణించింది. కానీ ఆమెను ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేదు. అనేక పాఠశాలలు, ఆసుపత్రులకు ఆమె పేరు పెట్టారు. ఆమె ఆఫ్ఘనిస్తాన్‌లో గొప్ప కథానాయికగా కీర్తించబడింది.
రచయిత: ఎన్.మురారి, హిందూ సౌజన్యంతో
స్వేచ్ఛానువాదం : సలీమ