Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వర్షాకాలంలో ఎటు చూసినా కాలుష్యమే. దాంతో సాధారణ జ్వరాల దగ్గర్నుంచీ కామెర్లు, బ్రోంకైటిస్ వరకూ అనారోగ్యాల బారినుంచి కుటుంబాన్ని రక్షించుకోవడం పెద్ద సవాలే. అందుకోసమే ఈ జాగ్రత్తలు...
వైరస్‌లూ బ్యాక్టీరియా విజంభించే కాలమిది. దాంతో జ్వరాలు, ఇన్ఫెక్షన్లు, ఎలర్జీలు ఇట్టే వచ్చేస్తాయి. వాటిని తిప్పికొట్టాలంటే మొట్టమొదట చేయాల్సింది రోగనిరోధక శక్తిని పెంచుకోవడం. అందుకు ఇంటిల్లిపాదీ విటమిన్ సి విస్తారంగా ఉండే పదార్థాలు తీసుకోవాలి.
ఉదయాన్నే గ్లాసుడు గోరువెచ్చటి నీటిలో నిమ్మరసం, తెనే కలిపి తీసుకుంటే సగం రోగాలను నివారించినట్టే.
మొలకెత్తిన గింజలు, తాజా ఆకుకూరలు కూడా అంతే ఫలితాన్నిస్తాయి.
యాపిల్, నేరేడు, బొప్పాయి, దానిమ్మ లాంటి పండ్లు ఇమ్యూనిటీ పెంచుతాయి.
వర్షం మనకు తెలీకుండానే సోమరితనాన్ని తెచ్చిపెడుతుంది. ఈరోజుకి వ్యాయామాన్ని వాయిదా వేద్దాం అనిపిస్తుంది. కానీ అస్సలు నిర్లక్ష్యం చేయడానికి లేదు. బద్ధకాన్ని జయించి కాసేపు ఎక్సర్సైజ్ చేస్తే కండరాలు చురుగ్గా పనిచేస్తాయి, రక్తప్రసరణ బాగుంటుంది.
నీటి కాలుష్యం వల్ల కామెర్లు వచ్చే ప్రమాదముంది. కనుక ఈ కాలంలో కాచి చల్లార్చిన నీళ్లు తాగడం అలవాటుచేయాలి.
పిల్లలు ఇంటి వంటల కంటే బయటి ఆహారాన్నే ఎక్కువగా ఇష్టపడతారు. కానీ దుమ్మూధూళీ చేరి, ఈగలు ముసిరే వాటిని తినడం వల్ల ఎన్ని అనర్థాలో నచ్చచెప్పాలి.
స్నానం నీళ్లలో డిసిన్ఫెక్టెంట్ కలపడం వల్ల కంటికి కనిపించని క్రిముల బారి నుంచి రక్షణ లభిస్తుంది.
మెంతి, కాకర, వెల్లుల్లి తినడంవల్ల వైరల్ ఫీవర్లు రావు.
ఈ కాలంలో పండ్లు, కూరగాయలను ఉప్పునీళ్లతో కడగటం చాలా మంచిది.