Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహిలలు పురుషులతో సమానంగా ఉద్యోగాలు చేస్తున్నారు. డబ్బు సంపాదిస్తున్నారు. అలాగే పొదుపు చేయడంలో కూడా మహిళలే ముందుంటారు. అయితే డబ్బు పొదుపు చేయడం, ఖర్చుకు సంబంధించిన వ్యవహారాలన్నీ తమ తండ్రులో, భర్తలో చూసుకుంటారు కదా.. మాకెందుకు ఇవన్నీ.. వచ్చిన జీతంతో హాయిగా ఎంజారు చేయోచ్చు కదా... అని ఆలోచించే మహిళలు కూడా కొందరు ఉంటారు. కానీ డబ్బు సంపాదించడమే కాదు.. డబ్బు నిర్వహణ గురించి కూడా మహిళలకు తెలిసుండాలంటున్నారు ఆర్థిక నిపుణులు. అప్పుడే కుటుంబం ఆర్థికంగా దఢంగా ఉంటుందంటున్నారు. అంతేకాదు.. మహిళలు ప్రతి దశలోనూ కొన్ని పొదుపు సూత్రాలు పాటించాలని సూచిస్తున్నారు. మరి అవేంటో మనమూ తెలుసుకుందాం...
ఎవరిపై ఆధారపడకుండా ఆర్థికంగా మన కాళ్ళపై మనం నిలబడాలి అనే ఆలోచనతో ఉంటారు కొంతమంది మహిళలు. మరికొందరు.. తమ కుటుంబ ఆర్థిక అవసరాలకు ఆసరాగా ఉండడానికి ఉద్యోగం చేస్తుంటారు. అయితే ఎవరు దేనికోసం చేసినా ఉద్యోగం చేస్తున్నా, గహిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా.. మహిళలకు ప్రతి దశలోనూ డబ్బు నిర్వహణ, పొదుపు సూత్రాలకు సంబంధించిన పలు విషయాలు తెలిసుండడం అవసరం అంటున్నారు నిపుణులు.
ఇష్టమైనట్టు ఖర్చుపెట్టొద్దు
తొలి ఉద్యోగం, తొలి సంపాదన.. ఎవరికైనా ప్రత్యేకమే! ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు 20ల్లోనే ఉద్యోగం సంపాదించడం, ఐదంకెల జీతం అందుకోవడం సర్వసాధారణమైపోయింది. అయితే ఈ వయసులో తమపై బరువు బాధ్యతలేవీ ఉండవు కాబట్టి సంపాదించిన మొత్తాన్ని తమకు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టచ్చు, తమకు నచ్చిన వస్తువులన్నీ కొనేసుకోవచ్చన్న భావనతో ఉంటారు చాలామంది అమ్మాయిలు. ఇలాంటి పొరపాటే చేయొద్దంటున్నారు నిపుణులు. వయసు చిన్నదే అయినా పరిణతితో ఆలోచించమంటున్నారు. వచ్చిన డబ్బుతో అత్యవసరమైన ఖర్చులకు కొంత డబ్బును వెచ్చించి.. మిగతా సొమ్మును పొదుపు చేయమంటున్నారు. దానికి అవసరమైన స్వల్ప, దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకుని.. వాటిలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపించడం మంచిది. ఇందుకు నష్టభయం లేని మ్యూచువల్ ఫండ్స్, సిప్.. వంటి ఆప్షన్లను ఎంచుకోవచ్చు. అలాగే ఆరోగ్యపరంగా ఎప్పుడు ఏ అవసరం వస్తుందో చెప్పలేం కాబట్టి.. ఓ మంచి ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడమూ ఉత్తమం. రిటైర్మెంట్, ఇల్లు-బంగారం కోసం కూడా కొంత మొత్తం చొప్పున కేటాయించుకుంటే.. భవిష్యత్తుపై పూర్తి భరోసా ఉంటుంది.
ఒకరికి ఒకరు తోడుగా...
పెండ్లయ్యాక పెరిగే కుటుంబ బాధ్యతల వల్ల డబ్బు నిర్వహణ తమ వల్ల కాదనుకుంటారు కొందరు మహిళలు. నిజానికి భర్త సంపాదనకు భార్య ఉద్యోగం కూడా తోడైతే ఆ కుటుంబం ఆర్థికంగా మరింత పటిష్టంగా ఉంటుందంటున్నారు నిపుణులు. అయితే భవిష్యత్తు అవసరాలు, పిల్లల బాధ్యతల్ని దష్టిలో ఉంచుకొని ఖర్చులు, ఆర్థిక అవసరాల్ని కలిసి పంచుకుంటే మెరుగైన ఫలితం ఉంటుందంటున్నారు. ఇప్పటికే నిత్యావసర ఖర్చులు, గహ రుణం చెల్లించడం, పొదుపు పథకాలు.. వంటివి భర్త నిర్వర్తిస్తున్నప్పుడు.. భార్య తన సంపాదనను పిల్లల చదువులు, వారి పెండిండ్లు, బంగారంపై పెట్టుబడులు పెట్టడం, రిటైర్మెంట్ ప్లానింగ్.. వంటి దీర్ఘకాలిక లక్ష్యాలపై వెచ్చించచ్చు. వీటితో పాటు ఎవరికి వీలైనట్టుగా వారు కొంత అత్యవసర నిధిని కూడా ఏర్పాటుచేసుకోవడం మంచిది. పెండ్లయ్యాక ఇలాంటి ప్రణాళిక ఉంటే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆర్థికంగా ఇబ్బంది తలెత్తదు.
సంపాదించకపోయినా...
పెండ్లయ్యాక అందరు మహిళలు ఉద్యోగం చేయాలని లేదు. కుటుంబ బాధ్యతలు, ఇతర కారణాల రీత్యా వివాహం తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి గహిణిగా ఉండాల్సి రావొచ్చు. అలాంటప్పుడు 'మేం సంపాదించట్లేదు.. కాబట్టి పొదుపుతో మాకు సంబంధం లేదు' అంటూ చేతులు దులుపుకోవడానికి వీల్లేదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇంట్లో ఉన్నా డబ్బు నిర్వహణపై దష్టి పెట్టి ప్రతి రూపాయీ వథా కాకుండా బడ్జెట్ వేసుకోవడం ఎంతో ముఖ్యమంటున్నారు. కాబట్టి నెలనెలా ఇంటి అవసరాలు, ఖర్చులకు సంబంధించి భార్యాభర్తలిద్దరూ చర్చించుకొని కొంత బడ్జెట్‌ను నిర్దేశించుకోవాలి. అందులో అత్యవసరమైన వాటికే ఖర్చు పెట్టి మిగిలిన మొత్తాన్ని పోస్టాఫీస్ ఆర్డీ, ఫిక్స్డ్ డిపాజిట్స్, చిట్స్.. వంటి నెలవారీ పొదుపు పథకాల్లో పెడితే నష్టభయం ఉండదు. దీర్ఘకాలంలో వీటిని ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ మీకు బంగారమంటే ఇంష్టం ఉంటే.. సిప్ ద్వారా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఈ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టచ్చు.
ఎప్పుడు ఏం జరుగుతుందో...
అనుకోకుండా భర్తను కోల్పోవడం లేదంటే భర్త నుంచి విడిపోవడం.. ఈ రెండు సందర్భాల్లో సింగిల్ మదర్‌గానే మహిళలు తమ పిల్లల బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు పిల్లల చదువు, పెండ్లి.. వంటి దీర్ఘకాలిక లక్ష్యాల పైనే ఎక్కువ దష్టి పెట్టాలంటున్నారు నిపుణులు. అప్పటికే వీటికి సంబంధించిన పొదుపు పథకాల్లో డబ్బు జమ చేస్తుంటే వాటిని కొనసాగించడం.. కొత్తగా చేయాలనుకుంటే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం చక్కటి మార్గమంటున్నారు. దీనివల్ల పిల్లల భవిష్యత్తు అవసరాలను తీర్చచ్చంటున్నారు. దీంతో పాటు ఆరు నెలలకు సరిపడా అత్యవసర నిధిని జమ చేసుకోవడమూ ముఖ్యమేనంటున్నారు. అలాగే మీ పెట్టుబడులు, వాటిలోని లాభ-నష్టాల గురించి కూడా ఏ నెలకానెల చెక్ చేసుకోవడమూ మర్చిపోవద్దు.
చివరి దశలో
సాధారణంగా చాలామంది విషయంలో రిటైర్మెంట్ వయసొచ్చే నాటికే పిల్లల చదువులు, పెండిండ్లు, ఇంటి రుణం.. వంటి పెద్ద లక్ష్యాలన్నీ తీరిపోయి ఉంటాయి. ఆ సమయంలో ఉద్యోగం లేకపోయినా నెలనెలా పెన్షన్ చేతికందుతుంది. కాబట్టి ఎలాంటి చింతా ఉండదు. అలాగని వచ్చిన పెన్షన్‌ను, అద్దె రూపంలో వచ్చిన డబ్బును వథా చేయకుండా సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్, పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్, ఎఫ్డీ, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టచ్చు. అలాగే పన్ను రహిత బాండ్లలోనూ పెట్టుబడి పెట్టడం వల్ల ఎక్కువ రాబడి పొందడంతో పాటు.. రాబడిపై ఎలాంటి పన్ను ఉండదు. ఇలా మీరు పొదుపు చేసిన డబ్బును ఇటు మీ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. అలాగే అత్యవసర పరిస్థితుల్లో మీ పిల్లలకూ అందించి సాయపడచ్చు.