Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డయాబెటీస్‌తో బాధపడే వ్యక్తుల్లో కరోనా వైరస్ సమస్యల కారణంగా ఏర్పడే ముప్పులు ఎక్కువగా ఉన్నట్టు అధ్యయనాలు సూచిస్తున్నాయి. కాని కొవిడ్-19 ఇన్ఫెక్షన్ బారినపడిన కొందరు వ్యక్తుల కణజాలం సేకరించి వాటిని పరీక్షించినప్పుడు కరోనా వైరస్ కారణంగా వారిలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు డ్యామేజ్ అయినట్టు రుజువులు కనిపిస్తున్నాయి.
కొవిడ్-19 నుంచి ఇటీవల కోలుకున్న వ్యక్తుల్లో డయాబెటీస్ ఎందుకు ఏర్పడుతోంది?
కొవిడ్-19 నుంచి ఇటీవల కోలుకున్న వ్యక్తుల్లో డయాబెటీస్ పెరుగుతున్నట్టు ఈ మధ్యకాలంలో డాక్టర్లు గుర్తించారు. ఈ పెరుగుదలకు ఇవి కారణాలు కావచ్చని డాక్టర్లు భావిస్తున్నారు.
గుర్తించని డయాబెటీస్: కొన్ని కేసుల్లో రోగి తనకు డయాబెటీస్ ఉన్న విషయం గుర్తించకపోవచ్చు, కొవిడ్-19 ఇన్ఫెక్షన్ తర్వాత డయాబెటీస్‌ను గుర్తించడం జరిగి ఉంటుంది.
స్టెరాయిడ్ల వాడకం: కొవిడ్-19 చికిత్సలో భాగంగా వారి లక్షణాలు చక్కదిద్దేందుకు కొంత మంది రోగులకు స్టెరాయిడ్స్ సూచించబడి ఉంటుంది. స్టెరాయిడ్స్ వాడకం వలన బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతాయి.
వంశపారంపర్య లక్షణాలు: కొవిడ్-19 వంటి వైరల్ పరిస్థితుల కారణంగా వంశపారంపార్య డయాబెటీస్ చరిత్ర కలిగిన వ్యక్తుల్లో డయాబెటీస్ ఏర్పడవచ్చు. ప్యాంక్రియాస్‌లో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే బేటా కణాల్లోకి కరోనా వైరస్ చొచ్చుకువచ్చి ఇన్సులిన్ లోపం కలిగించవచ్చు తద్వారా బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ పెరుగుతాయి.
డయాబెటీస్ ముందస్తు లక్షణాలు ఏంటి?
డయాబెటీస్ ముందస్తు లక్షణాల్లో ఇవి కూడా ఉంటాయి
తరచు మూత్రానికి వెళ్లాలని అనిపించడం.
దాహం, ఆకలి పెరగడం.
అలసట.
చంకలు, మెడ, మోచేతి భాగాల్లో చర్మం రంగుమారి నల్లగా కావడం.
అది ఎందుకు ఆందోళనకరం?
కొవిడ్-19 కారణంగా ఏర్పడే డయాబెటీస్ ఆందోళనకరం, ఎందుకంటే సార్స్‌కొవ్ 2 శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలను లక్ష్యంగా చేసుకొని వాటిని దెబ్బతీస్తాయి. తద్వారా బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ పెరుగుతాయి. బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ కారణంగా శరీరంలోని అవయవాలు ముఖ్యంగా రక్తకణాలు, నాడులు తీవ్రంగా ప్రభావితమవుతాయి. కొవిడ్-19 బారిన పడి కోలుకుంటున్న వ్యక్తుల్లో కొత్తగా వచ్చే డయాబెటీస్ కారణంగా కీటోయాసిడోసిస్ సహ అనేక జీవక్రియ సమస్యలు తలెత్తుతాయి. వీటికి చాలా అధిక మోతాదులో ఇన్సులిన్ డోసులు అవసరమవుతాయి.
ఏం చేయవచ్చు?
కొవిడ్-19 నుంచి బయటపడిన తర్వాత కొత్తగా వచ్చే డయాబెటీస్ ప్రమాదకరం కావచ్చు. కొవిడ్-19 ఇన్ఫెక్షన్ బారిన పడిన వారిలో డయాబెటీస్ ఏర్పడినట్టు అయితే వారు క్రమం తప్పకుండా తమ బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ పరీక్షించుకోవాలి. బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ నియంత్రణలో ఉంచుకునేందుకు డాక్టర్లు సూచించిన మందులు వాడాలి. మందులతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులు చేసుకోవాలి.
- డా.దీప్తి కొండగారి
ఎండీ, డీఎన్బీ, ఎండోక్రైనాలజీ
కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్,
ఎండోహ్యుమా కేర్,
దిల్సుఖ్నగర్,ఈసీఐఎల్