Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హౌమ్ చేస్తున్న వారు ఎన్నో పొరపాట్లు చేస్తున్నారు. ఫలితంగా అటు మానసికంగా ఒత్తిడి ఎదురవడంతో పాటు శరీరానికి శ్రమ కరువై లేనిపోని అనారోగ్యాల బారిన పడుతున్నారు. మరి దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.
- పనిలో పడిపోయి రోజంతా కంప్యూటర్‌కే కండ్లప్పగించేస్తే కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ బారిన పడే ప్రమాదం ఉంది. కండ్లు పొడిబారిపోవడం, కండ్లలో వాపు, ఎరుపెక్కడం, దురద, చూపు మందగించడం.. వంటివి ఈ సమస్య లక్షణాలు. ఇదే అలవాటు సుదీర్ఘకాలంగా కొనసాగిస్తే కంటి చూపుపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
- శరీరానికి శ్రమ కలిగించకుండా, మధ్యమధ్యలో కాసేపైనా విరామం తీసుకోకుండా ఎక్కువ సమయం పాటు కంప్యూటర్ ముందు కూర్చోవడం వల్ల మెడ నొప్పి వేధిస్తుంది. అలాగే భుజాలు ముందుకు వంగినట్టుగా తయారై గూనిగా కనిపించే అవకాశం ఉంది. ఇది సుదీర్ఘకాలం పాటు కొనసాగితే మెడలు, భుజాలు, చేతులు, వెన్నెముక.. ఇలా ఒకదాని తర్వాత మరొక దానిపై ప్రతికూల ప్రభావం పడి శరీరాకతి అదుపు తప్పుతుంది.
సుదీర్ఘకాలం పాటు కంప్యూటర్ ముందు కూర్చోవడమే కాదు.. నిరంతరాయంగా టైపింగ్ చేసినా చేతులు, మణికట్టు భాగాల్లోని కండరాలు, నరాలు డ్యామేజ్ అయి విపరీతమైన నొప్పి వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇది శరీరంలోని ఇతర భాగాల ఆకతిని కూడా దెబ్బతీస్తుంది.
'డి' విటమిన్‌ను లేలేత సూర్యకిరణాల నుంచి మన శరీరం గ్రహిస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇంట్లో నుంచి బయటికి కదలకుండా కంప్యూటర్ ముందు కూర్చొని పని చేయడం వల్ల ఈ విటమిన్ లోపించి.. జుట్టు రాలిపోవడంతో కొత్త జుట్టు రావడానికి ఆటంకం ఏర్పడుతుంది. అలాగే విటమిన్ 'డి' లోపం వల్ల అలోపేసియా అనే సమస్య తలెత్తి అక్కడక్కడా జుట్టు పూర్తిగా ఊడిపోవడానికి కారణమవుతుంది.
ఎక్కువ సమయం కంప్యూటర్ స్క్రీన్‌ను తదేకంగా చూడడం వల్ల కండ్లు అలసటకు గురవుతాయి. ఫలితంగా కండ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. మన పనిలో భాగంగా మొబైల్, ల్యాప్‌టాప్ వంటి ఎలక్ట్రానిక్ పరికాలను ఎక్కువ సమయం పాటు వినియోగించడం వల్ల మెడ, భుజాలు, ఇతర శారీరక భాగాలపై ఒత్తిడి పడుతుంది. అలాగే నడుం నొప్పి, కీళ్లు పట్టేయడం.. వంటి సమస్యలు కూడా అధికమవుతాయి.
వయసు పైబడే కొద్దీ చర్మం ముడతలు పడడం సహజం. అయితే మనం చేసే కొన్ని పొరపాట్లు, పాటించే అలవాట్ల వల్ల అవి ముందే వచ్చేస్తాయి. రోజంతా కంప్యూటర్‌పైనే పనిచేయడం, దాన్ని తదేకంగా చూడడం కూడా అందుకు ఓ కారణం. తద్వారా చిన్న వయసులోనే వయసు పైబడిన ఛాయలు మన ముఖంపై కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి.
ఎక్కువ సమయం పాటు ఒకే చోట కూర్చోవడం, స్నాక్స్ ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం.. ఇవన్నీ దీర్ఘకాలం పాటు కొనసాగితే శరీరంలో కొవ్వు స్థాయులు పెరిగిపోతాయి. కాలక్రమేణా ఇది స్థూలకాయానికి దారితీస్తుంది. ఇంటి నుంచి పని చేసే వారిలో ఈ సమస్య అధికంగా ఉంటోంది. ఈ క్రమంలో పొట్ట, తొడలు, పిరుదులు, మడమలు.. తదితర భాగాల్లో దీని ప్రభావం కనిపిస్తుంది.