Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పిల్లలతో కాలం ఎంత సరదాగా గడుస్తుందో... ఒక్కోసారి అంత ఇబ్బందికరంగానూ ఉంటుంది. ఎంతో సహనంతో ఉంటే తప్ప పిల్లల అల్లరిని తట్టుకోలేరు తల్లిదండ్రులు. అయితే కోపంలో చిన్న మాట అన్నా పిల్లలు భరించలేరు. లోలోపలే కుమిలిపోతారు. ఎందుకంటే వారికి మనమే లోకం. మనతోనే ప్రపంచం. ఏది చెప్పాలన్నా, ఏ బాధను పంచుకోవాలన్నా మనతోనే. కాబట్టి పిల్లల్లో మానసిక ఆరోగ్యాన్ని ఎలా పెంపొందించాలో తెలుసుకుందాం.
పిల్లల్లో శారీరక ఎదుగుదలతోపాటూ మానసిక ఎదుగుదల కూడా అంతే ముఖ్యం. ఈ రోజుల్లో మనందరికీ ఒత్తిడి సాధారణం. పిల్లలు పెద్దవాళ్లయ్యాక... వాళ్లకు ఒత్తిడి మరింత పెరుగుతుంది. కాబట్టి టెన్షన్, ఒత్తిడి, డిప్రెషన్ వంటివి తట్టుకోవడం నేర్పాలి. చదువులో ఎప్పుడైనా వెనకబడితే ధైర్యం చెప్పాలి. ఏదైనా పొరపాటు జరిగితే 'ఏం కాదు డోంట్ వర్రీ' అని సరైన పద్ధతిలో నడిపిస్తే వారిలో ధైర్యం పెరుగుతుంది.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదుగురు పిల్లల్లో ఒకరికి మానసిక సమస్యలు ఉంటున్నాయి. అదే పనిగా ఏడవడం, మౌనంగా ఉండిపోవడం, చురుకుదనం లేకపోవడం, భయపడటం, ఏమాత్రం అల్లరే చెయ్యకుండా ఉండిపోవడం ఇలాంటి ఎన్నో మానసిక సమస్యలు ఉంటున్నాయి.
పిల్లలకు ఉండే అన్ని రకాల మానసిక రుగ్మతలనూ మనం నయం చేయలేకపోవచ్చు. కానీ వీలైనంతవరకూ ప్రయత్నిస్తే వారు కూడా మిగతా పిల్లల లాగా ఎదగగలరు. ఈ విషయంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులూ ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ వారికి అన్నీ తామే అయి ముందుకు నడిపించాలి.
పిల్లలకు సరైన అలవాట్లు నేర్చించండి. మంచి ఆహారం తినేలా చేయండి. స్వీట్లు, చిరుతిళ్లకు దూరం పెట్టండి. రోజూ 8 గంటలు నిద్రపోయేలా అలవాటుచెయ్యండి. రోజూ ఎక్సర్సైజ్, నడక, రన్నింగ్ చేసేలా నేర్పించండి.
పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉండండి. ప్రవర్తనలో మార్పు వస్తే ఏదో జరిగినట్టే. అది మీకు చెప్పాలంటే వారితో మీరు సుతిమెత్తగా మాట్లాడుతూ దగ్గరకు తీసుకోవాలి. ఏదైనా తప్పు చేస్తే మీరు దాన్ని సున్నితంగా మందలిస్తూ సరిదిద్దాలి. కొట్టినా, తిట్టినా వాళ్లలో భయం మరింత పెరిగి అది మానసికంగా విపరీత పరిణామాలకు దారితీస్తుంది.
పిల్లలు ఏడుస్తున్నప్పుడో, బాధ పడుతున్నప్పుడో మీరు పక్కనే ఉండి వారితో గడపండి. వారు చెప్పేది సహనంతో వినండి. దాంతో వారిలో భారం దిగిపోతుంది. మీ ప్రేమను వారిపై చూపండి.
పిల్లలు ప్రతీదీ తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటారు. కాబట్టి పేరెంట్స్ సరిగా ఉంటేనే పిల్లలు కూడా సరిగా ఉంటారు. పిల్లల ముందు గొడవలు పడటం, అరుచుకోవడం వంటివి చేయకూడదు. పిల్లల ముందు ఇతరులపై మండిపడకూడదు. అది చూసి పిల్లలు భయపడతారు. భయం వారిలో చురుకుదనాన్ని పోగొట్టి మానసికంగా చాలా ఇబ్బందులు తెస్తుంది.
చాలా మానసిక సమస్యల్లో తల్లిదండ్రులు వారికి అండగా నిలవకపోవడం వల్లే వస్తున్నట్టు పరిశోధనలు చెబుతున్నాయి. పిల్లలకు అవసరమైన సమయంలో మీ సాయం అందాలి. మీరు ఎంత చెప్పినా వారిలో ధైర్యం పెరగకపోతే కౌన్సెలింగ్ ఇప్పించాలి. వారి ప్రతి కదలికలో మీ అండదండలు ఉంటే ఓ మంచి సిటిజన్‌ను మీరు ఈ ప్రపంచానికి ఇచ్చినట్టు అవుతుంది. పిల్లల దృష్టిలో కూడా మీరు మంచి పేరెంట్స్‌గా నిలుస్తారు.