Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఆహా.. ఏమి రుచి.. తినరా మైమరచి..'' అంటూ వంకాయ కూరపైన ఓ సినీ గేయం ఎంతో హిట్ అయింది. నిజంగానే వంకాయకు మించిన రుచికరమైన వంటకం లేదంటారు.పెండిండ్లల్లో, శుభ కార్యాల్లో వంకాయకు ప్రత్యేక స్థానం ఉంది. పైగా నిమిషాల్లోనే వంకాయతో ఎన్నో రకాల వంటాకాలు చేసుకోవచ్చు. అలాంటి వంకాయతో ఈ రోజున సింపిల్‌గా చేసుకునే వంటకాలు కొన్ని మీ కోసం...
వంకాయ పచ్చి పులుసు
కావాల్సిన పదార్ధాలు: పెద్ద వంకాయ - ఒకటి, చింతపండు గుజ్జు - ఒక కప్పు, సన్నగా తరిగిన ఉల్లిగడ్డ - ఒక చిన్న కప్పు, పచ్చి మిర్చి - నాలుగు (సన్నగా తరిగిన ముక్కలు), ఉప్పు - తగినంత, మెంతి పిండి - ఒర స్పూను, పసుపు - ఒక స్పూను, బెల్లం తురుము - ఒక చిన్న కప్పు, కొత్తిమీర - కొంచెం, నూనె - సరిపడా, ఇంగువ - చిటికెడు, తాలింపుకోసం - పోపు దినుసులు.
చేయువిధానం: ముందుగా వంకాయని కాల్చుకోవాలి. చల్లారిన తర్వాత తొక్కు తీసేసి దాంట్లో ఉప్పు, పసుపు, మెంతిపిండి వేసి కలుపుకోవాలి. తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకుని దాంట్లో చింతపండు గుజ్జు వేసి అందులోనే వంకాయ గుజ్జు కూడా వేయాలి. ఈ రెండింటిని బాగా కలిపి బెల్లం తురుము వేసి అన్ని బాగా కలిసేట్టుగా గరిటతో బాగా కలియపెట్టాలి. తర్వాత ఒక మూకుడులో నూనె పోసి అది వేడెక్కక అందులో పోపుదినుసులు వేయాలి. అవి కొంచెం వేడెక్కాక అందులో తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఇంగువ వేసి అన్ని కలిపి ఉంచుకున్న మిశ్రమంలో వేసి బాగా కలియబెట్టాలి. పైన కొత్తిమీర చల్లు కోవాలి. ఇది వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది.
వంకాయ ఉల్లికారం
కావల్సిన పదార్ధాలు: చిన్న గుండ్రటి వంకాయలు - పావుకిలో , ఉల్లిగడ్డలు - మూడు (కొంచెం పెద్దవి), ఉప్పు, పసుపు, కారం, కొత్తిమీర, నూనె - సరిపడా.
చేయువిధానం: ముందుగా ఉల్లిగడ్డల్ని ముక్కలుగా చేసుకుని వాటిని మిక్సీలో కచ్చా పచ్చగా రుబ్బుకోవాలి. తర్వాత ఒక మందపాటి బాండీలో నూనె ఎక్కువగా పోసుకుని వంకాయలకు నాలుగు గాట్లు పెట్టి నూనెలో వేయాలి. సన్నని సెగ మీద మగ్గించాలి. అవి కొంచెం మగ్గాకా రుబ్బి ఉంచుకున్న ఉల్లిగడ్డ ముద్ద వేయాలి. దానితో పాటుగా ఉప్పు, కారం, పసుపు కూడా వేసి బాగా కలియబెట్టి మూత పెట్టాలి. ఇవి అన్ని బాగా వేగి మంచి కమ్మటి వాసన వస్తుండగా సన్నగా తరిగి న కొత్తిమీర వేసి దించేయాలి.
వంకాయ మిక్స్డ్ పచ్చడి
కావాల్సిన పదార్ధాలు: వంకాయలు మీడియం సైజువి - నాలుగు, దొండకాయలు - రెండు, సొరకాయ - చిన్న ముక్క, పచ్చి టొమాటో - ఒకటి, బీరకాయ - చిన్న ముక్క, దోసకాయ - చిన్న ముక్క, పచ్చిమిర్చి - 6 లేదా 7, ఉప్పు, పసుపు, నూనె - తగినంత, చింతపండు - చిన్న గోళికాయంత,-వెల్లుల్లి రెబ్బలు - రెండు(ఇష్టమైతే వేసుకోవచ్చు), పోపు దినుసులు, ఇంగువ. చేయువిధానం: ఒక మంద పాటి బాండీలో నూనె ఎక్కువగా పోసుకుని అన్ని కూరగాయలు చిన్న చిన్న ముక్కలుగా చేసి వేయాలి. అందులోనే పచ్చి మిర్చి, చింతపండు, వెల్లుల్లి కూడా వేసి మూత పెట్టి మగ్గించాలి. అన్ని ముక్కలు బాగా మెత్తగా అయ్యాక పొయ్యి మీద నుంచి దించేసి చల్లారాక మిక్సీలో వేసి అందులోనే తగినంత ఉప్పు, పసుపు వేసి గ్రైండ్ చేయాలి. మరీ మెత్తగా చేయకూడదు. తర్వాత కరివేపాకు వేసి పోపు వేయాలి. ఇది వేడి వేడి అన్నం లోకి చాలా బావుంటుంది. చపాతిలోకి కూడా బావుంటుంది.
వంకాయ పెరుగుపచ్చడి
కావలసిన పదార్ధాలు: పెద్ద లావు వంకాయ - ఒకటి, తీయటి పెరుగు - రెండు కప్పులు, అల్లం, పచ్చిమిర్చి ముద్ద - రెండు స్పూన్లు, పసుపు, ఉప్పు, కొత్తిమీర, పోపుదినుసులు, నూనె -సరిపడా, ఇంగువ - చిటికెడు.
చేయువిధానం: వంకాయని కాల్చి తొక్కుతీసి పెట్టు కోవాలి. ఒక గిన్నెలో పెరుగు వేసి అందులో ఈ వంకాయని వేసి వాటితో పాటుగా అల్లం, పచ్చిమిర్చి ముద్ద, పసుపు, ఉప్పు తగినంత వేసి అన్ని బాగా కలపాలి. తర్వాత ఒక చిన్న బాండీలో నూనె పోసి వేడెక్కాక పోపుదినుసులు వేసి అవి వేగాక ఇంగువ వేసి కలిపి ఉంచుకున్న మిశ్రమంలో వేయాలి. కొత్తిమీర సన్నగా తరిగి చల్లుకోవాలి.
- పాలపర్తి సంధ్యారాణి