Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈరోజుల్లో చాలామంది ఉద్యోగులు, గృహిణులు శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు. అయితే తరచూ పని ఒత్తిడిని ఎదుర్కొనే మహిళల్లో గుండెపోటు ముప్పు అధికంగా ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. డయాబెటిస్, రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం లాంటి కారణాల వల్ల గుండె జబ్బులు వస్తాయని మొన్నటివరకు అధ్యయనాలు తెలిపాయి. కానీ గుండెజబ్బులకు దారితీసే కారకాల్లో పని ఒత్తిడి సైతం ఉందని మరోసారి రుజువుయింది. పని ఒత్తిడికి ఎక్కువగా మహిళలే గురవుతున్నారని తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయనాన్ని స్విట్జర్లాండ్‌కు చెందిన యూనివర్సిటీ హాస్పిటల్ జ్యూరిచ్ శాస్త్రవేత్తలు చేపట్టారు.
ఈ అధ్యయనం ప్రకారం.. హార్ట్ స్ట్రోక్‌ల ముప్పుకు దారితీసే సాంప్రదాయేతర హానికారకాలైన పని ఒత్తిడి, స్లీప్ డిజార్డర్స్, అలసట వంటివి పురుషులతో పోలిస్తే మహిళల్లోనే ఎక్కువగా ఉంటున్నాయని పరిశోధన బృందం వెల్లడించింది. జ్యూరిచ్ యూనివర్సిటీ హాస్పిటల్ న్యూరాలజిస్ట్ డా.మార్టిన్ హాన్సెల్, ఆమె బృందం మహిళల్లో ఎక్కువగా గుండె వ్యాధులకు దారితీసే కారకాలను బయటపెట్టారు. ఫుల్ టైం వర్క్ చేసేవారు, ఉద్యోగం చేస్తూనే ఇంటిపనులు చేసే మహిళల్లో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువ ఉందని తమ అధ్యయనంలో తేలినట్టు వెల్లడించారు.
అధ్యయనం ఏం చెబుతుంది
ఈ అధ్యయనం కోసం పరిశోధకులు 2007, 2012, 2017 సంవత్సరాలకు సంబంధించిన స్విస్ హెల్త్ సర్వేలోని 22,000 మంది పురుషులు, మహిళల డేటాను పోల్చారు. దీని ద్వారా సాంప్రదాయేతర హానికారకాల వల్ల మహిళల్లో ఆందోళనకర స్థాయిలో గుండె జబ్బులు వచ్చే ముప్పు పెరిగిందని కనుగొన్నారు. 2007లో ఫుల్ టైమ్ పనిచేసే మహిళల సంఖ్య 38 శాతం ఉండగా 2017లో 44 శాతానికి పెరిగింది. దాంతో మహిళల్లో గుండెజబ్బుల ప్రమాదం పెరిగింది.
పురుషులు, మహిళల్లో 2012లో 59 శాతంగా ఉన్న పని ఒత్తిడి 2017లో 66 శాతానికి పెరిగింది. 2012లో అలసటతో బాధపడుతున్నట్టు 23 శాతం మంది చెప్పగా 2017లో 29 శాతం మంది అలసటతో బాధపడుతున్నట్టు సర్వేలో తెలిపారు. అయితే 2017లో ఒత్తిడికి గురవుతున్నట్టు చెప్పిన వారిలో పురుషులతో పోలిస్తే మహిళలే ఎక్కువగా ఉన్నారు. స్లీప్ డిజార్డర్స్ సమస్యలు మహిళల్లో 8 శాతం పెరగగా పురుషుల్లో 5 శాతం పెరిగింది. ఈ సర్వే ప్రకారం పురుషుల కంటే మహిళలే ఎక్కువగా పని ఒత్తిడికి గురవుతున్నారని స్పష్టమవుతోంది.
ఈ పరిశోధనా కాలంలో గుండెపోటుకు దారితీసే ముప్పు యధావిధిగా ఉందని తేలింది. రక్తపోటు ఉన్నవారిలో 27 శాతం మంది, అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారిలో 18 శాతం, మధుమేహం ఉన్నవారిలో 5 శాతం, ఊబకాయంతో బాధపడేవారిలో 11 శాతానికి గుండెపోటు ముప్పు ఉందని తేలింది.