Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వానాకాలం సందళ్ళతో పాటు ఈగలు, దోమలు పిల్లల్ని పెట్టి రెడీగా ఉన్నాయి. పండుగల సీజన్‌తో పాటు జ్వరాల సీజనూ మొదలైంది. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, మెదడు వాపు వ్యాధులు మొదలైన వాటితో ఆస్పత్రులలో రోగులు చేరుతున్నారు. పిల్లలూ వర్షాకాలంలో వచ్చే సాధారణ రోగులతో ఇబ్బంది పడుతున్నారు. నులి పురుగుల మందులూ పంపిణీ చేస్తున్నారు. ఇదంతా కరోనా వైరస్ విశ్రాంతి వేళ జరుగుతున్నది. కరోనా వైరస్ రాలేదనే ధీమాతో స్కూళ్ళు తెరిచేస్తున్నారు. హాస్టళ్ళూ తెరిచేస్తారట. పెద్దవాళ్ళే జాగ్రత్తలను పాటించలేక పోలీసులు ఉండవలసిన పరిస్థితి ఉంటే, స్కూల్లో పిల్లల జాగ్రత్త ఎవరు తీసుకుంటారు. ఇన్ని రోజులు ఇళ్ళలో జాగ్రత్తగా ఉన్న పిల్లలు, ఒక్కసారిగా రెక్కలొచ్చినట్లై, స్కూళ్ళలో ఇష్టానుసారం ప్రవర్తించరా? స్కూళ్ళలో మంచినీటి సౌకర్యం, వాష్రూముల పరిస్థితి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం కరోనా వైరస్ మాటువేసి దాడి చేయడానికి రెడీగా ఉందని శాస్త్రవేత్తలు చెపుతున్న సమయంలో స్కూళ్ళు, హాస్టళ్ళు తెరిచి దానికి ఆహారంగా పంపాలనుకుంటున్నారా? తల్లిదండ్రులూ కొద్దిగా ఆలోచించండి. అందుకే స్కూల్‌కి వెళుతున్న పిల్లల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. మనమైతే వీలైనంత వరకు ఇంట్లోనే ఉండి విజ్ఞానాన్ని పెంచుకుందాం! కళాత్మకంగా గడుపుదాం!
మేడిపండుతో...
మా అపార్టుమెంటులో పారిజాతాలు, కాగితం పూల చెట్లతో పాటు మేడి పండ్ల చెట్టు కూడా ఉన్నది. ఈ చెట్టు మా బాల్కానీకి ఆనుకుని ఉంటుంది. కాయలు బాల్కనీలోకి తొంగి చూస్తుంటాయి. ఈ కాయలు ఆకుల మధ్యలో కాయవు. కాండానికి అతుక్కుని కాస్తాయి. ఉసిరి చెట్లు కూడా ఇలాగే కాయలు కాస్తాయి. ''మేడి పండు చూడ మేలిమై యుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు'' అన్న పద్యం చిన్నప్పుడు ప్రతివాళ్ళమూ చదువుకున్నాం గదా! ఇందులో ఎలా పురుగులు ఉంటాయో చూద్దామని మేడి కాయలు కోశాను. కోశాను కదా వెరైటీగా దీంతో బొమ్మ చేస్తే బాగుంటుందనుకున్నాను. మేడి కాయను మధ్యకు కోసి ప్లేట్లో పెట్టాను. ఇది చాలా చిన్నకాయ. మొసాంబిరాలు తిన్నాక పడేసే విత్తనాల ఆకారం గమనించినపుడు తాబేలు తలలా అన్పించింది. వెంటనే ఆ విత్తనాలను తలగా అమర్చాడు. కాళ్ళకు కూడా మోసాంబిరాల విత్తనాలే పెట్టాను. రెండు తాబేళ్ళు ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకుంటున్నా యనిపించింది. మేడిపండ్లతో ఇంత వరకు ఎవరూ వెజిటబుల్ కార్వింగ్ చేయలేదు. ఈ తాబేళ్ళు ఎక్కువ కాలం బతకగలిగే జీవులు. ఇవి ట్రయాసిక్ యుగం నుంచి ఎటువంటి మార్పులు లేకుండా జీవించి నట్టి సరీసృపాలు. ఈ తాబేళ్ళలో 'సిలిండ్రాప్సిస్' అనే రకం గల తాబేళ్ళు ప్రస్తుతం లేవు. విలుప్తమైనవి. ప్రపంచవ్యాప్తంగా తాబేళ్ళ మనుగడ తెలుసుకోవడం కోసం ఒక రోజును కేటాయించారు. మే నెల 23వ తేదీన తాబేళ్ళ దినోత్సవం జరుపుకుంటారు. ఎన్నో జాతులు విలుప్తమై పోతుండడంతో, వీటిని సంరక్షించాల్సిన అవసరం ఉంది. అందుకే తాబేళ్ళకు ఒక రోజును కేటాయించడం జరిగింది.
ఆకులు, కొబ్బరి పిందెలతో...
తెల్లటిపూలు పూసే ఒక చెట్టు మా అపార్ట్మెంటులో ఉన్నది. చాలా పెద్దగా ఉంటుంది. ఆకులు చూడడానికి బెండకాయ ఆకుల్లా ఉంటాయి. దాదాపు విస్తరాలకు అంత ఉంటాయి ఆకులు. ఈ చెట్టు, నేను బయటికి వెళ్ళేటప్పుడూ, కొమ్మలు రెమ్మలు ఊపుతూ నన్ను పలకరిస్తుంటుంది. ''నాతో ఏమీ బొమ్మలు చేయవా?'' అని అడుగుతున్నట్లు అనిపిస్తుంది. నాకేమో దీని పేరు తెలియదు. అందుకే ఇన్ని రోజులు చేయలేదు. ఇప్పుడు మాత్రం తాబేలును చేసేశాను. చిన్ని చిన్ని ఆకుల్ని కోసుకొచ్చి అమర్చాను. కొబ్బరి చెట్ల కింద రోజూ కొబ్బరి పిందెలు రాలిపడి ఉంటాయి. నేను వాకింగుకు వెళ్ళి వచ్చేటపుడు అన్నీ ఏరుకొచ్చుకుంటాను. అవి బొమ్మ చేశాక పడేయకుండా వాడాను. అవి ఎండిపోయి కూడా బొమ్మలకు పనికొస్తున్నాయి. కొన్ని కొబ్బరి పిందెలకు రంగులు వేశాను. వీటిని మరోసారి వివరిస్తాను. కొబ్బరి పిందెలలోని రక్షక దళాలకు ఆకుపచ్చరంగునూ, మధ్యలోని బోండాంకు ఎరుపు రంగులు వేశాను. ఇలాంటి కొబ్బరి పిందెను తీసుకొని తాబేలు తలలాగా అమర్చాను. ఇంకా ఎండిన నాలుగు కొబ్బరి పిందెలను కాళ్ళ వలె అమర్చాను. ఆకులేమో తాబేలు శరీరం కాగా, కొబ్బరి పిందెల కాళ్ళతో తాబేలు అమరింది. తాబేళ్ళను కూర్మాలు అని కూడా అంటారు. దశావతారాలలో కూర్మావతారం రెండవది. మొదటిదైన మత్స్యావతారం కేవలం నీళ్ళలోనే నివసించగలిగేది. అలాగే జీవ పరిణామ క్రమాన్ని చూసినప్పుడు కూడా మొదటగా జీవం నీళ్ళలోనే పుట్టింది. రెండవది నీళ్ళలోనూ, నేల మీదా జీవించగలిగేవి. అలాగే జీవ పరిణామ క్రమాన్ని చూసినప్పుడు కూడా మొదటగా జీవం నీళ్ళలోనే పుట్టింది. రెండవది నీళ్ళలోనూ, నేల మీదా జీవించగలిగేవి. పాకే జీవులను సరీసృపాలు అంటారు. మొసళ్ళు, తాబేళ్ళు వంటి పాకే జీవులు సరీసృపాలకు చెందిన జీవులు.
వడియాలు, చెకోడీలతో...
వీల్స్ అనే వేయించిన వడియాలను ఉప్పు కారం చల్లి పాకెట్లు చేసి అమ్ముతారు. అలాంటి వడియాలను తెచ్చి తాబేలను చేశాను. తెల్లని వడియాల వీల్స్‌తో తాబేలు శరీరంను తయారు చేశాను. తాబేలు శరీరం, తల మొత్తం పెంకు లాంటి డిప్పలో దాచుకుంటుంది. తల కోసం బందరు లడ్డూలను పెట్టాను. తలలో కన్నును పెట్టాను. 'కోకోజల్' అనే కొబ్బరి నీళ్ళ బాటిల్స్ బజార్లో దొరుకుతాయి. మా ఇంట్లో మా పిల్లలు తాగుతారు ఈ కోకోజల్స్ను. వీటి మూతలో సీల్ వేసినట్టుగా ఒక రబ్బరు మూత గుండ్రంగా ఉంటుంది. దీని మీద నల్లని కంటి పాపను దిద్ది, దీనిని కన్నులాగా అమర్చాను. కాళ్ళకు, తోకకు చెకోడీలను అమర్చాను. తినే పదార్థాలతో తాబేలు తయారయింది. తాబేళ్ళలో 'నక్షత్రాల తాబేలు' అరుదైన తాబేలు. అతి మెల్లగా నడిచే తాబేలు, పరుగులు తీసే కుందేలు ఒకసారి పరుగు పందెం పెట్టుకున్నాయట. అతి విశ్వాసంతో కుందేలు దారిలో నిద్రపోతూ, నిదానంగా తన లక్ష్యాన్ని మరవకుండా వెళ్ళిన తాబేలు పందెం గెలిగిందట. మనందరమూ చిన్నప్పుడు చదువుకున్న కథే ఇది. తాబేళ్ళను గుర్తు చేసుకున్నపుడు ఈ కథ గుర్తురాక మానదు.
దానిమ్మ కాయతో...
పల్లీ కాయలు, బాదం కాయలు, మేడికాయలు వంటి కాయలతో చాలా తాబేళ్ళను సృష్టించాను. సరే ఈ రోజు దానిమ్మకాయతో తాబేలును చేస్తున్నాను. లేత ఎరుపు రంగుతో ఉండే దానిమ్మ గింజల్ని ప్రాచీన కవులు ''దానిమ్మ గింజల్లాంటి పళ్ళున్న అస్సరస'' అంటూ అమ్మాయి అందాలను వర్ణించేవారు. గింజల్ని చిదిమితే ఎర్రని రసం కారే దానిమ్మ గింజల్ని రక్త హీనత కలిగిన వాళ్ళు తింటే రక్తం పడుతుంది. ''అందాల భరిణెలో రత్నాల రాసులు'' అంటూ దానిమ్మను గురించి పొడుపు కథ ఉన్నది. ఎర్రటి ఎరుపు రంగులో ఉండే తొక్కను గలిగిన దానిమ్మకాయ చివర పువ్వులా ఉంటుంది. ప్రతి కాయకు చివర ఉండే పువ్వు రాలిపోతుంది. దానిమ్మకు పండు చివర ఉండే పువ్వును తాబేలు తలలా సరిపోతుందని అమర్చాను. కమలాకాయ తొక్కల్ని తాబేలు కాళ్ళ వలె అమర్చాను. అలా దానిమ్మ తాబేలు తయారయింది. అండాకారంలో ఉండే తాబేళ్ళు ఉప్పు నీళ్ళలోనూ, మంచి నీళ్ళలోనూ జీవిస్తాయి.
గాజులతో...
నేను పెండిండ్ల వంటి శుభకార్యాలకు ఎక్కువగా మట్టి గాజుల్నే వేసుకుంటాను. అలా ఎన్నో కొనుక్కుంటాం కదా. ఓల్డ్ ఫ్యాషన్ అని పారెయ్యకుండా దాచిపెట్టి బొమ్మలు చేస్తున్నాను. మీరు కూడా ఇలా చేసుకోవచ్చు. నేను ఈ గాజులతో ఈరోజు తాబేలును రూపొందించాను. అవి ట్రయాసిక్ యుగం నుంచి కూడా ఎక్కువగా రూపాంతరం చెయలేదట. అందుకే నేనీరోజు దానిమ్మతో, మేడిపండుతో, గాజులతో, ఆకులతో, చెకోడీలతో ఇలా ఎన్నో రూపాలు మార్చాను. తాబేళ్ళలో ఎన్నో ప్రజాతులు, జాతులు ఉన్నాయి. ఇవి 'టెస్టుడినియే' కుటుంబానికి చెందిన జీవులు. డిప్సోకెలిస్, జియోకెలోస్, గోఫెరస్, హౌమోపస్, కినిక్సిస్ వంటి ప్రజాతులు మనుగడలో ఉన్నాయి. 'స్టైలెమిస్' ప్రజాతిలో ఉన్న స్టైలెమిస్ కాపాక్స్, స్టైలెమిసÊ కాన్స్పెక్టా, స్టైలెమిస్ నెబ్రాసెన్సిస్, స్టైలెమిస్ యాంఫీధొరాక్స్ అనే జాతులు పూర్తిగా అంతరించిపోయాయి. నేనందుకే వీటికి జీవం పోస్తున్నాను.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్