Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నెలలు నిండకుండానే పుట్టే శిశువుల శరీర భాగాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందవు. దీంతో వారికి వైద్య సహాయం అందించాల్సి ఉంటుంది. ఈ కారణంగా వారి పెరుగుదలపై ప్రభావం పడుతుందని, పిల్లల్లో నొప్పులు, బాధ కూడా అధికంగా ఉంటుందని గత పరిశోధనలు వెల్లడించాయి. అయితే ఇలాంటి సమయంలో తల్లిని పిల్లలకు దగ్గరగా ఉంచి, ఆమె గొంతును వినిపించడం వల్ల ఆ బాధ, నొప్పి కొంతమేర తగ్గుతుందని తాజా అధ్యయనం చెబుతోంది. ఈ పరిశోధనను సైంటిఫిక్ రిపోర్ట్స్ అనే జర్నల్లో ప్రచురించారు. ఆ వివరాలు ఏంటో మనమూ తెలుసుకుందాం.
సాధారణంగా నెలలు నిండకుండానే పుట్టిన పిల్లలను వారి తల్లులకు దూరంగా తీసుకెళ్లి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ప్రత్యేక ఇంక్యుబేటర్లో ఉంచి చికిత్స అందిస్తారు. క్రమం తప్పకుండా మందులు ఇస్తూ రక్షించే ప్రయత్నం చేస్తారు. అయితే కొన్నిసార్లు ఈ వైద్య పరిస్థితులు వారి ఎదుగుదలకు ప్రమాదకరంగా మారుతాయి.
పరిశోధన ఎవరు చేశారు: శిశువు ఆరోగ్యాన్ని మెరుగుపరచాలనే ఉద్దేశంతో జెనీవా వర్సిటీ పరిశోధకులు.. ఇటలీలోని పరిణి హాస్పిటల్, వల్లే డీఓస్టా విశ్వవిద్యాలయంతో కలిసి ఈ పరిశోధన చేపట్టారు. తల్లి శిశువుతో మాట్లాడినప్పుడు పిల్లల్లో ఆక్సిటోసిన్ స్థాయిలను అంచనా వేశారు. దీని ద్వారా నెలలు నిండక ముందే జన్మించిన శిశువుల్లో నొప్పి తగ్గుతుందని గుర్తించారు. ఈ పరిశోధన తల్లితో బిడ్డ సాన్నిహిత్యాన్ని హైలెట్ చేస్తుంది.
పిల్లల నొప్పిపై అధ్యయనం: ఇటలీలోని పరిణి ఆసుపత్రిలోని 20 మంది నెలలు నిండకముందే జన్మించిన శిశువులపై ఈ పరిశోధన చేశారు. వీరి మడమ నుంచి కొన్ని చుక్కల రక్తం సేకరించడం ద్వారా రోజువారీ రక్తపరీక్ష చేశారు. మూడు రోజుల పాటు 3 దశల్లో ఈ ప్రయోగం జరిగింది. తల్లి లేకుండానే మొదటి ఇంజెక్షన్ ఇచ్చారు. రెండోది శిశువుతో తల్లి మాట్లాడుతుండగా ఇచ్చారు. మూడో ఇంజెక్షన్.. శిశువు దగ్గర తల్లి పాడుతుండగా ఇచ్చారు.
శిశువుల పక్కనే తల్లి ఉండాలి: నవజాత శిశువులకు వైద్య ప్రక్రియల సమయంలో తల్లి పక్కనే ఉండాల్సిన అవసరాన్ని ఈ పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా ఇంటెన్సివ్ కేర్ లాంటి సున్నితమైన వాతావరణంలో తల్లిదండ్రులు, పిల్లలను కలిపే ప్రాముఖ్యతను అధ్యయనం గుర్తిస్తోందని అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకులు మాన్యూలా ఫిలిప్పా తెలిపారు. ''తల్లిదండ్రులు ఇక్కడ రక్షణాత్మక పాత్ర పోషిస్తారు. తమ బిడ్డకు సాధ్యమైనంత వరకు దగ్గరగా ఉండటానికి ఈ రిసెర్చ్ సహాయపడుతుంది. ఇది పూర్తిగా తల్లి, బిడ్డల బంధాలను బలపరుస్తుంది'' అని డీడియర్ గ్రాండ్ జీన్ స్పష్టం చేశారు.