Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తులసి భర్త వాసు. అతను ప్రభుత్వ స్కూల్ వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు. స్కూల్లో పని కావడంతో అక్కడే వారికి ఓ గది ఇచ్చారు. తులసి మిషన్ కుడుతుంది. వాసు సాయంత్రం పూట ఆటో నడుపుతాడు. అతనికి డబ్బు సంపాదించాలనే కోరిక ఎక్కువ. చాలామందితో స్నేహం చేస్తుంటాడు. కొన్ని చెడ్డ అలవాట్లు కూడా ఉన్నాయి. విచ్చలవిడిగా అప్పులు చేస్తాడు. ఇంట్లో అస్సలు పట్టించుకోడు.భర్త ప్రవర్తన తెలిసిన తులసికి అతనిపై అనుమానం.
పెండ్లికి ముందు వాసుకు అతని మరదలితో సంబంధం ఉంది. ఆమెకు పెండ్లి కావడంతో ఇద్దరూ కొంత కాలం మర్చిపోయారు. తర్వాత వాసు, తులసిని పెండ్లి చేసుకున్నాడు. అయితే ఓ బాబు పుట్టిన తర్వాత మరదలి భర్త చనిపోయాడు. దాంతో మళ్ళీ ఆమెతో వాసూ సంబంధం పెట్టుకున్నాడు.
విషయం తెలుసుకున్న తులసి, వాసుతో గొడవ పెట్టుకుంది. దాంతో 'ఇకపై ఆమెతో ఎలాంటి సంబంధం పెట్టుకోను' అని భార్యకు మాట ఇచ్చాడు. కానీ పరిచయమున్న ఆడవాళ్ళతో వాసు చనువుగా ఉంటాడు. స్కూల్ పిల్లల్లో తల్లులు ఎవరైనా ఒంటరి వాళ్ళని తెలిస్తే వాళ్ళతో పరిచయం పెట్టుకునేవాడు. కొంతమంది దగ్గర ఫోన్ నెంబర్లు తీసుకుని గంటలు గంటలు మాట్లాడతాడు. ఈ విషయంపై ప్రతిసారి తులసికీ, వాసుకు గొడవలు జరుగుతూనే ఉండేవి.
మూడు నెలల నుంచి ఓ కొత్త వ్యక్తితో వాసూ గంటలు గంటలు ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఫోన్లో ఆ నెంబర్‌కి మగ మనిషి పేరు పెట్టాడు. ఆ ఫోన్ వచ్చినప్పుడు ఎప్పుడైనా తులసి చూస్తే మగవ్యక్తి పేరు చూసి ఫోన్ వాసూకు ఇచ్చేది. వాసూ మాత్రం ఆ ఫోన్ వస్తే భార్య ముందు మాట్లాడేవాడు కాదు.తర్వాత చేస్తానని పెట్టేసేవాడు. ఒక రోజు ఆ నెంబర్ నుంచి ఫోన్ వస్తే తులసి తీసింది. అటువైపు నుంచి ఆడగొంతు. తులసి గొంతు విని వెంటనే ఫోన్ పెట్టేశారు. దాంతో తులసి వాసూని నిలదీసింది. విషయం తెలుసుకుంటే ఆమె మూడు నెలల కిందట వాసు ఆటో ఎక్కింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య పరిచయం. ఆమె మిస్డ్‌కాల్ ఇస్తే వాసూ ఫోన్ చేస్తాడు. ఇద్దరూ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు.
మరోపక్క వాసు స్నేహితులతో కలిసి పేకాడుతూ, మందు తాగుతూ డబ్బులన్నీ ఖర్చు చేస్తున్నాడు. వీటి కోసమే సుమారు పది లక్షల వరకు అప్పులు చేశాడు. భర్త ఎప్పటికైనా మారతాడనుకున్న తులసికి ఇక అతనిపై నమ్మకం పోయింది. అత్తామామలకు చెబితే అస్సలు పట్టించుకోరు. పైగా 'నీ వల్లనే నా కొడుకు ఇలా తయారయ్యాడు. నువ్వు ప్రతి విషయానికీ వాడిపై గొడవపెట్టుకుంటావు, అనుమానం ఎక్కువ. అందుకే ఇలా చేస్తున్నాడు. నువ్వు చేసిన తప్పుకి మావాడిని ఎందుకు మాటలంటావు' అంటది అత్త. ఇక ఇంట్లో ఎప్పుడూ గొడవలే. వాసూ తాగొచ్చి తులసిని కొడతాడు. ఆమె కోపంతో అతన్ని ఇష్టం వచ్చినట్టు తిడుతుంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఎలాగైనా తన భర్తను మార్చుకోవాలని తులసి ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చి తన కష్టాన్ని చెప్పుకుంది. సభ్యులు వాసుకు లెటర్ పంపారు. తర్వాతి వారం తులసి భర్తతో కలిసి వచ్చాడు. అతను మాట్లాడుతూ ''మేడమ్, తులసి నన్ను బాగా తిడుతుంది. పిల్లల ముందే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. వాడూ, వీడూ అంటూ మర్యాద లేకుండా అంటుంది. మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు కూడా అంతే... వాళ్ళను మంచిగా చూసుకోదు. మా అమ్మతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. అందుకే నేను కొడతాను. పైగా నన్ను తాగుబోతు అంటుంది. నేను రోజూ తాగాను. ఎప్పుడైనా స్నేహితులతో కలిసి తాగుతాను. పగలంతా స్కూల్ మొత్తం ఊడ్చి, పనులన్నీ చేసుకుని రాత్రి ఆటోకి వెళతాను. ఈమె పెట్టే టెన్షన్స్‌తో ఆటో నడపలేకపోతున్నాను. ఎప్పుడో పెండ్లికి ముందు చేసిన తప్పుకు ఇప్పటికీ నన్ను అనుమానిస్తుంది. నాకు ఎవరితో సంబంధాలు లేవు. ఆటోలో పరిచయం అయిన ఆమె కూడా హాస్పిటల్లో అవసరం ఉంటుందని నా నెంబర్ తీసుకుంది అంతే. దానికే అనుమానించి గోల చేస్తుంది. సగం ఈమె వల్లనే నాకు ప్రశాంతత లేకుండా పోయింది. అందుకే తాగుతున్నాను' అంటూ చెప్పుకొచ్చాడు.
''ఏమీ లేకపోతే నీ భార్య నిన్ను ఎందుకు అనుమానిస్తుంది. అమ్మాయిల స్కూల్లో పని చేస్తున్నావు. నీ ప్రవర్తన ఇంత దారుణంగా ఉంటే ఎలా. పదేండ్ల నుంచి తులసి నువ్వు మారతావని ఎదురు చూస్తుంది. ఆ ఆశతోనే నీపై పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టకుండా మౌనంగా ఉంటుంది. కానీ మేము అలాకాదు. నీ ప్రవర్తన మార్చుకోకపోతే స్కూలో నీ గురించి కంప్లెయింట్ ఇస్తాం. పోలీస్‌స్టేషన్‌లో కేసుపెడతాం.అప్పుడు ఉన్న ఉద్యోగ ఊడి పోతుంది' అని సభ్యులు హెచ్చరించారు.
దాంతో అతను ''మేడమ్ అంత పని చేయొద్దు. ప్రస్తుతం నాది కాంట్రాక్ట్ ఉద్యోగం. ఈ మధ్యనే మా ఉద్యోగం పర్మినెంట్ చేయాలని లెటర్ వచ్చింది. ఇప్పుడు మీరు ఇలా చేస్తే నా ఉద్యోగం పోతుంది. మీరు ఎలా చెబితే ఆలా చేస్తాను. అయితే నాకు కొన్ని కండీషన్స్ ఉన్నాయి. వాటి ప్రకారం తులసి నడుచుకోవాలి' అంటూ బతిమలాడుకున్నాడు.
ఏంటో చెప్పమంటే ''తులసి నన్ను బూతులు తిడుతుంది. ఇకపై తిట్టకూడదు. పిల్లల ముందు నన్ను ఎలా పడితే అలా మాట్లాడకూడదు. అలాగే మా అమ్మానాన్న ఎప్పుడో ఒక్కసారి మా ఇంటికి వస్తారు. వాళ్ళను మంచిగా చూసుకోవాలి. ఇవి చేస్తే చాలు. నేను తులసితో మంచిగా ఉంటాను. నాకు వచ్చే జీతం, ఆటో డబ్బులు అన్నీ ఆమెకే ఇస్తాను. తులసి డబ్బులను చాలా జాగ్రత్తగా పొదుపు చేస్తుంది' అన్నాడు.
అప్పుడు తులసి కూడా కొన్ని కండీషన్స్ పెట్టింది. వాసు తన పాత ఫోన్ నెంబర్ తులసి దగ్గర పెట్టాలి. అతను కొత్త నెంబర్ వాడాలి. చెడు స్నేహితులతో తిరగడం, తాగడం మానుకోవాలి.
తను చెప్పినట్టు తులసి ఉంటే, ఆమె చెప్పినట్టు చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని వాసు రాసి ఇచ్చాడు. ఇద్దరూ ఒకరి కండీషన్స్‌కు ఒకరు ఒప్పుకున్నారు. ఇకపై ఒకరితో ఒకరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా లీగల్‌సెల్‌కు వస్తామన్నారు. వాసు మాత్రం తన ప్రవర్తన మార్చుకోకపోతే సభ్యులు స్కూల్లో తన గురించి కంప్లెయింట్ ఇస్తామని చెప్పి పంపించారు.
మళ్ళీ వారం తర్వాత తులసి ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చి ''మేడమ్ ప్రస్తుతం మా ఆయన కొద్దిగా మారాడు. గతంలో మాదిరిగా ఫోన్లో గంటలు గంటలు మాట్లాడడం లేదు. ఆటో నడిపిన డబ్బులు కూడా రోజూ తెచ్చిస్తున్నాడు. కానీ నాకు ఇష్టం లేని స్నేహితులను మాత్రం కలుస్తూనే ఉన్నాడు' అని చెప్పింది.
'మెల్లగా అతనే మారతాడు. మెల్లమెల్లగా అన్నీ అతనే తెలుసుకుంటాడు. మేము కూడా వారం వారం అతనికి ఫోన్ చేస్తుంటాం. మేము కూడా ఓ రోజు స్కూల్‌కి వచ్చి కలుస్తాం' అని చెప్పి తులసిని పంపించారు.
అన్న ప్రకారమే లీగల్‌సెల్ సభ్యులు వాసు పని చేసే స్కూల్‌కి వెళ్ళారు. దాంతో లీగల్‌సెల్ సభ్యులు అనుకున్నంత పని చేస్తారని వాసూకి భయం పట్టుకుంది. అప్పటి నుంచి మరింత జాగ్రత్తగా ఉంటున్నాడు. తులసితో మంచిగా ఉంటున్నాడు.
- సలీమ