Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుంది' అంటారు. అదే ఒక మహిళ విజయం సాధించాలంటే ఒక కుటుంబమే తోడవ్వాలి. తల్లీ, తండ్రి, భర్త, పిల్లలు, అత్తామామలు, ఇంకా వారి కుటుంబం... ఒక మహిళ బయటకు వచ్చినా ఈ బంధాలన్నీ ఆమెను వెంటాడుతూనే ఉంటాయి. సమాన హక్కులకై ఎన్ని పోరాటాలు జరిగినా బాధ్యతలు మోపిన పురుష సమాజం వాటిని ఇంకా ఆమోదించే స్థాయికి ఎదగలేదు. అందుకే మహిళ ఊహించని స్థాయిలో విజయం సాధించిందంటే అబ్బురపడే స్థితిలోనే ఉన్నాము. అటువంటిది ముగ్గురు మహిళలు సుప్రీం కోర్టు న్యాయమూర్తుల స్థాయికి ఎదిగారంటే... ఆ విజయం మాటల్లో వ్యక్తపరచలేనిది. ఈ విజయం వెనుక ఎన్ని నిద్రలేని రాత్రుల కఠోర శ్రమ దాగి ఉందో అంచనా వేయడం కష్టం కాదు.
ఈ ఏడాది ఆగస్టు 31వ తేదీని మహిళా విజయాల డైరీలో ప్రత్యేకంగా లిఖించాల్సిన రోజు. ముగ్గురు మహిళా న్యాయమూర్తులు సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు. వారు కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేది.
పిటిషన్ దాఖలు చేసినందుకే
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి సుప్రీంకోర్టుకు అనేకమంది పురుష న్యాయమూర్తులు ఎంపికవుతూ వచ్చారు. మహిళా న్యాయమూర్తుల సంఖ్య వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. 33శాతం మహిళా రిజర్వేషన్ల వలే సుప్రీం కోర్టులోనూ మహిళా న్యాయమూర్తుల కోసం వేచి చూడాల్సి వచ్చింది. ఉన్నత న్యాయవ్యవస్థలో మహిళా న్యాయమూర్తుల సంఖ్య పెంచాలని కోరుతూ సుప్రీం కోర్టు మహిళా న్యాయవాదుల సంఘం పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ముగ్గురు మహిళా న్యాయమూర్తులకు పదోన్నతులు లభించడం గమనార్హం.
పోరాటాల ఫలితం
లింగ సమానత్వం దృష్ట్యా సమాన హక్కులు, సమాన వేతనాలు అనే కాదు సమాన పదవులు అనే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. కేవలం ముగ్గురు మహిళలు ఉన్నత పదవులు అలంకరించినంత మాత్రాన మహిళలందరికీ ఔన్నత్యం పెరిగింది అని అనుకోలేము. సమానత్వం కోసం చేస్తున్న సుదీర్ఘ పోరాటంలో ఒక మెట్టు ఎక్కినట్టు మాత్రమేనని ఎందరో మహిళా న్యాయవాదులు వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని విస్మరించలేము. హైకోర్టు, సుప్రీం కోర్టులలో కేవలం 11శాతం మాత్రమే మహిళా న్యాయమూర్తులు ఉండడం పట్ల సుప్రీం కోర్టు మహిళా న్యాయవాదుల సంఘం విచారం వ్యక్తం చేస్తోంది. 'ఉన్నత న్యాయవ్యవస్థలో మహిళా న్యాయమూర్తుల సంఖ్య ఇప్పటికీ చాలా తక్కువగా ఉండడం విచారకరం. అయితే.. మేము ఈ సమస్య గురించి మాట్లాడడం ఇదే మొదటిసారి కాదు' అని న్యాయవాది, ఈ అంశంపై పిటిషన్ వేసిన వారిలో ఒకరైన స్నేహ ఖలితా ఒక ప్రసారమాధ్యమంలో వెల్లడించారు. తాను 2015లో ధర్మాసనం ముందు వాదించినప్పుడు మహిళా న్యాయమూర్తుల సంఖ్య పెంచాలని ధర్మాసనం సూచించిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు.
మహిళా న్యాయమూర్తుల ప్రస్థానం
భారత దేశంలో 1950లో సుప్రీం కోర్టు ఏర్పాటైంది. అంతకుముందు 1935 నుంచి ఫెడరల్ కోర్టు ఉండేది. దాని స్థానంలో సుప్రీం కోర్టు వచ్చింది. అప్పటి నుంచి 47 మంది సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా వ్యవహరించారు. సుప్రీం కోర్టు ఆవిర్భవించిన తొలినాళ్లలో ఎనిమిది మంది మాత్రమే న్యాయమూర్తులుగా ఉండేవారు. అయితే న్యాయమూర్తుల సంఖ్యను పెంచే అధికారాన్ని రాజ్యాంగానికి, పార్లమెంటుకు ఇచ్చింది సుప్రీంకోర్టు. నానాటికీ పెరుగుతున్న జనాభా వలన కేసుల సంఖ్యా పెరుగుతూనే వస్తోంది. దీనితో 1956లో న్యాయమూర్తుల సంఖ్య ఎనిమిది నుంచి 11కు చేరింది. ఈ సంఖ్య క్రమంగా 1960లో 14, 1978లో 18, 1986లో 26, 2009లో 31, 2019 నాటికి 34కు చేరింది. ఇన్నిసార్లు న్యాయమూర్తుల సంఖ్య పెరుగుతూ వచ్చినప్పటికీ వారిలో కేవలం ఎనిమిది మంది మాత్రమే సుప్రీం కోర్టులో న్యాయమూర్తులుగా వ్యవహరించారు. ప్రస్తుతం 34మంది సుప్రీం కోర్టు న్యాయమూర్తులలో జస్టిస్ ఇందిరా బెనర్జీ ఒక్కరే మహిళా న్యాయమూర్తిగా ఉన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న 25 హైకోర్టులలో కేవలం ఒక్క కోర్టులో మాత్రమే మహిళా ప్రధాన న్యాయమూర్తి ఉన్నారు. ఆమే తెలంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిమా కోహ్లి. ఇక దేశంలో 661మంది హైకోర్టు జడ్జ్‌లు ఉండగా వారిలో 73మంది మాత్రమే మహిళా న్యాయమూర్తులు. ఇప్పటికీ మణిపూర్, మేఘాలయ, పాట్నా, త్రిపుర, ఉత్తరాఖడ్లలో ఒక్క మహిళా న్యాయమూర్తి లేకపోవడం బాధాకరం.
సీజేగా మహిళా జడ్జి?
అన్ని పరిస్థితులు సజావుగా ఉంటే, సీనియారిటీ ప్రాతిపదికన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకాలు జరిగితే జస్టిస్ బి.వి.నాగరత్న సుప్రీం కోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి అవుతారు. 2027లో ఆమె పదవీకాలం ముగియడానికి మూడు నెలల ముందు ఈ అవకాశం రానుంది. ఒకవేళ ఆమె ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి అధిరోహిస్తే తొలి మహిళగా రికార్డు సృష్టిస్తారు.
ఇప్పటి వరకు సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా
వ్యవహరించిన మహిళా న్యాయమూర్తులు
1989లో జస్టిస్ ఎమ్. ఫాతిమా బీవి
1994లో జస్టిస్ సుజాతా వి.మనోహర్
2000లో జస్టిస్ రూమా పాల్
2010లో జస్టిస్ జ్ఞాన సుధామిశ్రా
2011లో జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశారు
2014లో జస్టిస్ ఆర్.భానుమతి
2017లో జస్టిస్ ఇందూ మల్హోత్రా
2018లో జస్టిస్ ఇందిరా బెనర్జీ
2021లో...
జస్టిస్ హిమా కోహ్లీ
జస్టిస్ బేలా త్రివేది
జస్టిస్ బీవీ నాగరత్న
- నస్రీన్ ఖాన్