Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్ష్యసాధన వైపు అడుగులేసేటప్పుడు ముందుగా మీపై మీరు నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. అతిగా ఆలోచించడం లేదా ఎదుటివారు ఏమనుకుంటున్నారో అనే భావాన్ని మనసులోకి రానీయకూడదు. ఆ రోజు ఏం పనులు పూర్తి చేయాలనుకుంటున్నారో డైరీలో పొందుపరచడం అలవాటు చేసుకోవాలి. రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు తిరిగి వాటిని ఎంత వరకు పూర్తి చేయగలిగారో పరిశీలించుకోవాలి. పూర్తి కాలేదనే ఆలోచనకన్నా, మిగిలిన పనులను మరుసటి రోజు ఎలాగైనా పూర్తిచేయాలని అనుకోవాలి.
మీతో మీరు
ఆత్మవిశ్వాసం పెరగడానికి మీకు మీరే ఉత్తరం రాసుకోండి. అది మిమ్మల్ని మీకు మంచి స్నేహితురాలిని పరిచయం చేస్తుంది. ఇదొక మానసిక వ్యాయామంలానూ పని చేస్తుంది. దీనివల్ల ప్రతికూల ఆలోచనలను దూరమవుతాయి. రోజూ ఉదయాన్నే అద్దం ఎదుట నిలబడి మీ మనసులోని సంకోచాలు, భయాలను బయటికి చెప్పడం అలవరుచుకోవాలి. ఇది మీ ఆత్మనూన్యతను పోగొడుతుంది. అనుకున్న లక్ష్యాన్ని సాధించగలనని మీతో మీరు చెప్పుకుంటూ ఉంటే ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది.
పుస్తకాలు చదవండి
గొప్ప లక్ష్యాలను సాధించిన వారి గురించి చదువుతూ ఉండాలి. ఇవి స్ఫూర్తిని కలిగిస్తాయి. కష్టాలెన్నెదురైనా అనుకున్న పని పూర్తి చేసిన వారిని కలిసి వారి అనుభవాలను తెలుసుకోవాలి. ఇవన్నీ మిమ్మల్ని ఉత్సాహవంతంగా మారుస్తాయి.
పరిశీలించుకోండి
మీరు పూర్తిచేసిన పనులను అప్పుడప్పుడు పరిశీలిస్తూ ఉంటే విజయమెంతో దూరం లేదనే భావన కలుగుతుంది. అది మిమ్మల్ని లక్ష్యానికి దగ్గర చేస్తుంది. అంతవరకూ ఎదురైన ఛాలెంజ్లను పాఠాలుగా మార్చుకుంటూ చిన్న చిన్న వాటిని లక్ష్యాలుగా అనుకుని వాటిని చేరుతుంటే, గెలుపు మీదే. ఈ ప్రయాణంలో కలిగే ఒత్తిడిని దూరం చేసుకోవడానికి క్రీడలు, పుస్తక పఠనం, చిత్రకళ వంటి అభిరుచులను అలవరుచుకుంటే మంచిది. ఇవన్నీ మానసికంగా దఢంగా మార్చి, ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తాయి.