Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓ అనిబిసెంట్.. ఓ సిస్టర్ నివేదిత... ఓ మదర్ థెరిస్సా... వీరిని ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. దేశం కాని దేశంలో పుట్టి భారతదేశంలో స్వేచ్ఛ, సమానత్వం, పేదరిక నిర్మూలన, దళితుల అభ్యున్నతి కోసం జీవితాంతం విశేష కృషి చేసి ఇక్కడే తనువు చాలించిన వారిగా వీరంతా మనకు తెలుసు. పేరుకు మాత్రమే వీరు విదేశీయులు. భారతీయ లక్షణాలను పుణికి పుచ్చుకున్న మహనీయులు. వీరి రుణాన్ని మనం ఎన్నటికీ తీర్చుకోలేము. అలాంటి వారి కోవకే చెందిన మరో గొప్ప వనిత డాక్టర్ గెయిల్ ఓంవేద్. అమెరికాలో పుట్టి మన దేశానికి వచ్చి వివిధ సామాజిక ఉద్యమాల్లో పాలు పంచుకొని, మహిళా హక్కుల కోసం విశేష కృషి చేసిన గొప్ప వ్యక్తి. తన 81 ఏండ్ల వయసులో ఆగస్టు 25న మరణించిన ఆమె గురించి మరిన్ని విశేషాలు మానవి పాఠకుల కోసం...
ఓంవేద్ 1941 ఆగస్టు 2వ తేదీన అమెరికాలోని మిన్నసోటా రాష్ట్రంలోని మినియాపోలిస్‌లో పుట్టారు. 1963లో ఆమె మొదటిసారి భారతదేశంలో అడుగుపెట్టారు. ఆమె వచ్చిన సమయంలో కులతత్వ వ్యతిరేక ఉద్యమాలు జరుగుతున్నాయి. వాటిని చూసి ఆకర్షితురాలయ్యారు. అలా పీహెచ్‌డి చేయడం కోసం 1970లో మళ్ళీ మన దేశానికి వచ్చారు. వర్ణ వ్యవస్థపై మహారాష్ట్రలో మహాత్మ ఫూలే సాగించిన ఉద్యమం గురించి పీహెచ్డీ చేశారు.
శ్రామిక్ ముక్తి దళ్
అలా వచ్చిన ఆమె భతర్ పటాంకర్‌ను వివాహం చేసుకుని ఇక్కడే స్థిరపడిపోయారు. 1983లో భారతీయ పౌరసత్వం పొందారు. అప్పటి నుంచి మహారాష్ట్ర సతారా జిల్లా కాసేగావ్‌లో నివసించేవారు. భర్త పటాంకర్‌తో కలిసి శ్రామిక్ ముక్తి దళ్‌ను ఏర్పాటు చేశారు. సతారా జిల్లాలోని మహిళల అభ్యున్నతి కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించేవారు. వారు అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేశారు. మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతాల ప్రజల అభివృద్ధి, కొంకణ్ ప్రాంతంలో నీటి హక్కుల కోసం సాగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.
వివిధ సమస్యలపై
సావిత్రిబాయి ఫూలే విశ్వవిద్యాలయం, నార్డిక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏషియన్ స్టడీస్, ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ బోర్డ్‌లో సభ్యురాలిగా కూడా ఉన్నారు. ఇంకా యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌తో వివిధ సమస్యలపై సలహాదారుగా కూడా ఆమె పని చేశారు.
సాహిత్య కారిణిగా
ఆమె ఉద్యమకారిణి మాత్రమే కాదు గొప్ప సాహితీ వేత్త కూడా. దళిత రాజకీయాలు, మహిళల పోరాటాలపై అనేక పుస్తకాలను ప్రచురించారు. మపర్యావరణంపై కూడా ఎంతో కృషి చేశారు. భారతదేశంలో వేళ్ళునికొని ఉన్న పురుషాధిక్యతపై, అసమాతలపై తన గొంతు విప్పారు. ఎంతో మంది సామాజిక ఉద్యమ కారుల పోరాటాలను సమాజానికి పరిచయం చేశారు. ''దళిత అండ్ డెమొక్రటిక్ రెవల్యూషన్'', ''బ్రిటిషర్ల కాలంలో అంబేద్కర్ - దళిత ఉద్యమాలు'', ''భారతదేశంలో ముద్ధిజం'', ''పోరాటంలో భారతీయ మహిళలు'', ''మేము ఈ బంధనాలను విచ్ఛిన్నం చేస్తాం'' వంటి ఎన్నో పుస్తకాలను సమాజానికి అందించారు.
స్ఫూర్తిదాయక జీవితం
ఎమర్జెన్సీ కాలంలోనూ ఎన్నో సామాజిక ఉద్యమాలు నడిపారు. మహత్మా పూలే స్థాపించిన సత్యశోధక ఉద్యమం గురించి ప్రపంచానికి తెలిసిందంటే అది ఆమె పరిశోధనా ఫలితమే అని గర్వంగా చెప్పుకోవచ్చు. అంతే కాకుండా ఆమె అనేక పరిశోధనా ప్రాజెక్టులను కూడా చేపట్టారు. ఈ విధంగా స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని గడిపి నేటి యువతకు ఆదర్శంగా నిలిచారు. ఇన్ని ఉద్యమాలు చేసినా ఆమె గురించి చాలా మందికి తెలియకపోవడం బాధాకరం. సరైన గుర్తింపు లేకపోవడం శోచనీయం.