Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొంత మంది తమ పని తాము చేసుకునిపోతే చాలు అనుకుంటారు. కానీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగినులు... నాయకత్వ లక్షణాలకు సానపెట్టుకోవాలి. అందుకోసమే ఈ సూచనలు.
అందరికీ అన్ని విషయాలూ తెలియాలని లేదు. నాకేమీ రాదు... ఏమీ తెలియదు అనే మాటలొద్దు. మీకు తెలియకపోతే తెలుసుకోండి. నేర్చుకోండి. నాయకురాలిగా ఎదగాలంటే మీ పరిధిలో ఉన్న అంశాలపై కనీస పరిజ్ఞానం, నేర్చుకోవాలన్న పట్టుదల కావాలి. అవి మీలో ఉంటే... ఎదుగుదల సాధ్యమే.
సంస్థల విధానాలు, వ్యవహారాలు, పని సంస్కృతి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఆ మార్పుకు తగ్గట్టు మనం కూడా ఎదుగుతూ ఉండాలి. కొత్త విషయాలు నేర్చుకుంటూ పోవాలి. అలా నేర్చుకోవడానికి పనివేళల్లో అవకాశం లేకపోతే బయట ప్రత్యేకంగా శిక్షణ తీసుకోండి. అందుకు సంబంధించిన పుస్తకాలు చదవండి.
ఎంత నైపుణ్యం ఉన్నా... అది ప్రదర్శించాల్సిన సమయంలో ప్రదర్శించకపోతే వృథానే. మిమ్మల్ని గుర్తించాలంటే... ప్రజెంటేషన్ స్కిల్స్ కూడా అవసరం. మొహమాటం వృత్తిలో, బాధ్యతలు నిర్వర్తించే క్రమంలో అస్సలు పనికిరాదు. అలా ఉండగలిగితేనే నాయకురాలిగా నిలబడగలరు.
మనతో పనిచేసే వాళ్లందరూ మనకు బెస్ట్‌ఫ్రెండ్స్ కానక్కర్లేదు. కానీ మీరు పైపైకి ఎదుగుతుంటే మీకు మద్దతిచ్చే వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉండాలి. కాబట్టి వివాదాలకు దూరంగా ఉండండి. ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం, ఒకరివైపే మొగ్గు చూపించడం, పక్షపాతంగా వ్యవహరించడం వంటివి చేయకూడదు. చిన్న చిన్న వ్యక్తిత్వ లోపాలను అధిగమించగలిగితే... మీరే నాయకురాలు.