Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొందరు ఆఫీస్‌లో ఉన్నంతసేపూ ఉత్సాహంగానే ఉంటారు. ఇంటికి వచ్చిన తర్వాత తీవ్రమైన ఒత్తిడికి లోనవుతారు. అప్పటివరకు ఉన్న చురుకుదనం ఒంటరిగా అయ్యేసరికి ఒక్కసారిగా మటుమాయం అవుతుంది. ఇటువంటి సమయంలో ఒత్తిడిని జయించకపోతే అది పలు రకాల ప్రతికూల ఆలోచనలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు మానసిక నిపుణులు.
ఏయే సమయాల్లో మనసు ఒత్తిడికి లోనవుతుందో కనిపెట్టాలి. ఏదైనా అంశం గురించి ఆలోచించేటప్పుడు లేదా ఆయా సందర్భానికి ఆందోళన మనల్ని దరిచేరుతోందా అనేది ఎవరికి వారు గుర్తించగలగాలి. కొందరికి ఒంటరిగా ఉన్నామనే భావనే తీవ్ర ఒత్తిడికి దారితీసేలా చేస్తుంది. వీటిలో ఏది మనసును ఆందోళనలోకి నెడుతుందో తెలుసుకోవాలి.
ఒత్తిడికి గురయ్యే సందర్భాలను తెలుసుకున్న తర్వాత వాటికి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఏయే ఆలోచనలు మనసును ఆందోళనపరుస్తున్నాయో అవి దరికి చేరకుండా సాధన చేయాలి. ఆ సమయాన్ని మరొక దిశగా మార్చడానికి కృషి చేయాలి. మనసుకు నచ్చిన పుస్తకం చదవడం, తోట పెంపకం, చెస్ వంటి మైండ్‌గేమ్స్ ఆడటం ద్వారా మనసు మరోవైపు మళ్లు తుంది. యోగా, వ్యాయామం శరీరాన్ని మాత్రమే కాక మనసునూ ప్రశాంతంగా ఉంచుతాయి. వీటిని ప్రయత్నించండి.
మనసుకు దగ్గరైన, నచ్చిన స్నేహితులతో వీడియో కాల్ మాట్లాడటం వల్ల కొంత ప్రశాంతత దక్కుతుంది. వీలైనంత వరకూ ఒంటరిగా కాకుండా నలుగురితో కలిసి అవుట్డోర్ గేమ్స్ ఆడటం లేదా ట్రెక్కింగ్ చేసి ప్రకృతిని ఆస్వాదించడం వంటివి కూడా ఒత్తిడిని దూరం చేస్తాయి. నచ్చిన వంటకాన్ని తయారు చేయడం, చిత్రకళను నేర్చుకోవడం వంటివీ ప్రశాంతతను అందిస్తాయి.
నిత్యం చేసే పనులు కాకుండా కొత్తగా ఆలోచించడం, అప్పటి వరకు చేయని ఏదైనా పనిని ఎంచుకోవడం ద్వారా ఒత్తిడి నుంచి బయటపడొచ్చు. సౌందర్య పరిరక్షణకు కొంత సమయాన్ని ఉపయోగించడం, ఉన్న దుస్తులతో కొత్తగా మ్యాచింగ్ ప్రయత్నించడం, వినూత్నంగా హెయిర్‌స్టైల్ మార్చుకోవడం వంటివి చేస్తే మనసు మళ్లుతుంది.
అనాథ ఆశ్రమం, వృద్ధాశ్రమాలకు వెళ్లి వారి అవసరాలను తెలుసుకోవాలి. వారికి చేతనైనంత సాయం చేయడానికి ముందడుగు వేయాలి. మొదట కొత్తగా అనిపించినా, దీనిద్వారా మనసు సంతోషంతో నిండుతుంది. అనాథల కష్టాలను చూసినప్పుడు వారి కన్నా మన పరిస్థితి ఎంతో మెరుగు అనే భావం మనల్ని మానసిక అనారోగ్యాల నుంచి దూరం చేస్తుంది. లేనివారికి చేయూత నందించామనే తృప్తినీ అందిస్తుంది.