Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పండుగ అంటేనే రకరకాల వంటలు చేసుకుని కడుపారా తినడం. ఇక వినాయక చవితి అంటే బొజ్జ గణపతికి ఎన్నో వంటకాలు చేసి పెడుతుంటారు. వాటిని ఇంటిల్లిపాది కడుపునిండా తింటారు. ఈ వంటలన్నీ శరీరానికి శక్తినిచ్చేవిగా ఉంటాయి. అలాంటి కొన్ని వంటకాలు రాబోయే చవితికి మీ కోసం...
ఉండ్రాళ్ల పాయసం
కావల్సిన పదార్థాలు: ఖర్జూరాలు - పది, జీడిపప్పు, ఎండుద్రాక్ష - పావుకప్పు చొప్పున, బియ్యప్పిండి - కప్పు, మొక్కజొన్నపిండి - చెంచా, బియ్యపురవ్వ - కప్పు, పెసరపప్పు - అరకప్పు, పచ్చి కొబ్బరి తురుము - అరకప్పు, కొబ్బరిపాలు - మూడు కప్పులు, పంచదారా - రెండు కప్పులు, నెయ్యి - పావుకప్పు, ఉప్పు - సరిపడా, కేసరి రంగు - చిటికెడు, యాలకుల పొడి - అరచెంచా.
తయారు చేసే విధానం: పెసరపప్పు, ఖర్జూరాలను ఓ గంట ముందు విడివిగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఖర్జూరాలను మిక్సీలో వేసి చిక్కని రసంలా తీసుకోవాలి. ఇది మూడు కప్పులు వచ్చేందుకు నీళ్లు చేర్చుతూ రుబ్బుకోవాలి. బాణలిలో చెంచా నెయ్యి వేడి చేసి బియ్యపు రవ్వ, బియ్యప్పిండిని దోరగా వేయించుకోవాలి. ఖర్జూరారసాన్ని ఓ గిన్నెలోకి తీసుకుని కొద్దిగా ఉప్పు వేసి మరిగించాలి. ఇందులో పెసరపప్పు వేయించి పెట్టుకున్న బియ్యప్పిండి, రవ్వ కలపాలి. కొబ్బరి తురుము కూడా వేసి బాగా కలపాలి. దగ్గరగా అయ్యాక దింపేసి కొద్దిగా చల్లారనిచ్చి చిన్నచిన్న ఉండల్లా చేసుకోవాలి. మరో గిన్నెలో కొబ్బరిపాలు తీసుకుని పంచదార చేర్చాలి. పాలు మరిగేటప్పుడు ఉండ్రారళ్లను వేయాలి. ఐదు నిమిషాలయ్యాక రెండు చెంచాల నీళ్లల్లో మొక్కజొన్న పిండి, కేసరి రంగు కలిపి పాయసానికి చేర్చాలి. దింపేముందు యాలకులపొడి, నెయ్యిని కరిగించి జీడిపప్పు పలుకులు, ఎండుద్రాక్ష వేయించి పాయసంలో వేస్త చాలు. ఘుమఘుమలాడే ఉండ్రాళ్ల పాయసం సిద్ధం.
పాలతాలికలు
కావల్సిన పదార్థాలు: బియ్యప్పిండి - ఒకటిన్నర కప్పు, పాలు - అరలీటరు, పంచదార - రెండు కప్పులు, పచ్చి కొబ్బరి తురుము - కప్పు, జీడిపప్పు, ఎండ్రుద్రాక్ష - రెండూ కలిపి ఆరు చెంచాలు, యాలకుల పొడి - రెండు చెంచాలు, నెయ్యి - ఐదు చెంచాలు.
తయారు చేసే విధానం: ఓ గిన్నెలో కప్పు నీళ్లు మరిగించి అందులో పిండి కలిపి పొయ్యి కట్టేయాలి. చల్లారాక చేతికి కొద్దిగా నూనె రాసుకుని ఈ పిండిని సన్నని నూడుల్స్ మాదిరి చేసుకుని ఇరవై నిమిషాలు ఆరనివ్వాలి. ఇంతలో మరో గిన్నెలో పాలు మరిగించాలి. ఇందులో పిండితో చేసుకున్న తాలికల్ని ఉడికించాలి. ఇప్పుడు బాణలిలో నెయ్యి కరిగించి ఎండుద్రాక్ష, జీడిపప్పు పలుకుల్ని వేయించి పాలల్లో వేయాలి. ఆ తర్వాత కొబ్బరి తురుము, పంచదార, యాలకులపొడి కలిపి దింపేస్తే సరిపోతుంది. వేడి వేడి పాలతాలికలు సిద్ధం.
చిట్టి తాలికలు
కావల్సిన పదార్థాలు: గోధుమపిండి, పేనీరవ్వ, మైదా, బియ్యప్పిండి - ఒక్కో కప్పు చొప్పున, పంచదార - రెండు కప్పులు, బెల్లం - ఇరవై గ్రాములు, జీడిపప్పు - కొద్దిగా, గసగసాలు - రెండు చెంచాలు, నెయ్యి - అరకప్పు.
తయారు చేసే విధానం: గోధుమపిండి, మైదా, పేనీరవ్వను నీళ్లతో పిండిలా కలపాలి. వీటిని చిన్నచిన్న పేనీల్లా చేసుకుని ఆరనివ్వాలి. పొయ్యిమీద గిన్నె పెట్టుకుని ఒకటిన్నర కప్పు నీటిని మరిగించాలి. అందులో ముందుగా చేసుకున్న పేనీల్ని వేసి ఆ తర్వాత పంచదార, బెల్లం చేర్చి బాగా ఉడికాక సన్నని మంటపై ఉంచాలి. ఇప్పుడు ఓ గిన్నెలో బియ్యప్పిండిని తీసుకుని నీళ్లతో దోశపిండిలా చేసుకుని ఉడికిన పాయసంలో వేయాలి. మరికాసేపు ఉడికాక గసగసాలు, నేతితో వేయించిన జీడిపప్పు వేసి దింపేయాలి. కావాలనుకుంటే నీళ్ల బదులు పాలు చేర్చుకోవచ్చు.
రాగి బూరెలు
కావల్సిన పదార్థాలు: రాగులు, బెల్లం తురుము - కప్పు చొప్పున, పచ్చి కొబ్బరి తురుము - పావు కప్పు, యాలకుల పొడి - చెంచా, మినపప్పు - కప్పు, బియ్యం - రెండు కప్పులు, నూనె - వేయించడానికి సరిపడా, నెయ్యి రెండు చెంచాలు.
తయారు చేసే విధానం: బియ్య, మినపప్పును కలపి, రాగుల్ని విడిగా నాలుగ్గంటల ముందు నానబెట్టుకోవాలి. బియ్యం, మినపప్పును కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. నానబెట్టిన రాగుల్ని కడిగి, నీటిని వంపేసి తడిపోయేదాకా ఎండలో ఉంచి ఆ తర్వాత పొడి చేసుకోవాలి. బాణలిలో నెయ్యి కరిగించి రాగిపిండిని దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత యాలకులపొడి, పచ్చికొబ్బరి తురుము కలపాలి. ఓ గిన్నెలో కొద్దిగా నీరు తీసుకుని మరో పొయ్యిమీద మరిగించి బెల్లం తురుము కలపాలి. అది కరిగాక వడకట్టి రాగిపిండికి చేర్చి ఉండల్లా చేసుకోవాలి. వీటిని మినపప్పు మిశ్రమంలో ముంచి కాగుతున్న నూనెలో వేయాలి. బంగారువర్ణంలోకి వచ్చాక తీసేస్తే పోషకాల బూరెలు సిద్ధమైనట్టే.
జొన్న ఉండ్రాళ్లు
కావల్సిన పదార్థాలు: జొన్నలు - కప్పు, పెసరపప్పు - అరకప్పు, అల్లం, పచ్చిమిర్చి ముద్ద - చెంచా, జీలకర్ర - అరచెంచా, నెయ్యి - నాలుగు చెంచాలు, ఉప్పు - సరిపడా.
తయారు చేసే విధానం: జొన్నలు మూడు నాలుగు గంటల ముందు నానబెట్టుకుని తడి ఆరేదాకా ఎండబెట్టి ఆ తర్వాత రవ్వలా పట్టించాలి. పెసరపప్పును అరగంట ముందు నానబెట్టుకోవాలి. దీన్ని మళ్ళీ జల్లించుకుని రవ్వ తీసుకోవాలి. ఇప్పుడు బాణలిలో నెయ్యి కరిగించి అల్లం, పచ్చిమిర్చి ముద్దను వేయించుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర కలుపుతూ వేసుకోవాలి. రవ్వ మూడు వంతులు ఉడికాక నానబెట్టుకున్న పెసరపప్పు చేర్చాలి. అది కూడా ఉడికాక రెండుచెంచాల నెయ్యివేసి కలిపి దింపేయాలి. వేడి కొద్దిగా తగ్గాక చేతికి నెయ్యి రాసుకుని ఉండ్రాళ్లలా చుట్టుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని రెండుమూడు నిమిషాలు ఆవిరిపై ఉడికిస్తే సరిపోతుంది. బలవర్ధకమైన జొన్న ఉండ్రాళ్లు సిద్ధం. వీటిని వేడిగా తింటేనే బాగుంటాయి.