Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గత నెల రోజుల నుంచీ వర్షాలు ఆగకుండా పడుతూనే ఉన్నాయి. వర్షాలు పడుతున్నాయి అని రైతులు ఎంత సంతోష పడుతున్నారో తెలియదు గానీ బాక్టీరియా, వైరస్ మాత్రం ఎగిరి గంతులేస్తున్నాయి. ఇష్టారాజ్యంగా వర్షంలో తడిసి ముద్దౌతూ వర్షాన్ని ఎంజారు చేస్తున్నాయి. తమ పరివారాన్ని లెక్కకు మిక్కిలిగా పెంచుకొని మనుష్యులపై దాడి చేస్తున్నాయి. జ్వరాలు, జలుబులు, దగ్గులు వంటి లక్షణాలతో పిల్లాపెద్దా బాధపడుతున్నారు. బాక్టీరియా, వైరస్లు వీచే గాలిలో సయ్యాటలాడుతూ పారే నీళ్ళలో ఈదులాడుతూ, యమ హుషారుగా ఉన్నాయి. ఈ వర్షాలకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. కరోనా కాస్త విశ్రాంతి తీసుకుంటున్న ఈ సమయంలో మిగిలిన వైరస్లు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. వర్షంలో తడవకుండా, పిల్లలను జాగ్రత్తగా చూడాలి. తాగునీరును కాచి చల్లార్చి వడపోసిన నీటినే తాగాలి. ఇంటి పరిసరాల్లో నీళ్ళు నిలవకుండా చూడాలి. లేఉంటే దోమలు స్వైర విహారం చేస్తాయి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే కొంత వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. మురుగు కాల్వలను ఆగకుండా ప్రవహించేలా చూడాలి. అప్పుడు ఈగల దోమల పుట్టుక తగ్గి రోగాలు తగ్గుతాయి. వర్షంలో తడవకుండా ఇంట్లో ఉండి సృజనాత్మకంగా గడపండి.
వడియాలతో
మార్కెట్లో రంగురంగుల వడియాలు దొరుకుతున్నాయి. పసుపు, నారింజ, ఆకుపచ్చ, ఎరుపు, పింక్ రంగుల్లో ఆకర్షణీయంగా తయారు చేస్తున్నారు. నేనీ వడియాలను తినటం కన్నా ఎక్కువగా బొమ్మలు తయారు చేయటానికే ఉపయోగిస్తున్నాను. ఈ వడియాలను వేయించాక కూడా బొమ్మలు చేసుకోవచ్చు. కానీ నేనే రోజు వేయించని వడియాలతోనే బొమ్మను చేశాను. అదీ ఏం బొమ్మా... ఎలుక బొమ్మ. ఎలుకంటే ఎవరు. వినాయకుని వాహనం. ఈరోజు వినయాక చవితి కదా. అందుకని ఆయన వాహనాన్ని తయారు చేసి సిద్ధంగా ఉంచాలని అనుకున్నాను. ఈ ఎలుకకు అనింద్యుడు అని పేరు పెట్టాను. ఎలుకలు కలుగుల్లో నివసిస్తాయి. వీటికి వాడిగల పళ్ళు ఉండటంతో దేన్నైనా కొరికేయగలుగుతాయి. అందుకే గదా వేటగాడు పన్నిన వలలో పావురాలు చిక్కుకుపోతే ఎలుక ఆ వలను కొరికి రక్షించిందని మనం చిన్నతనంలో కథ చదువుకున్నాం. మామూలుగా ఇళ్ళలో ఎలుకలు ఉన్నాయంటే అంతా ఇంతా భీభత్సం చేయవు. బట్టలు, పుస్తకాలు కొరికి ముక్కలు చేస్తాయి. ఇంట్లో ఏ వస్తువునూ బతకనీయవు. ఈ ఎలుకలు కారర్టేటా వర్గానికీ, రోడెన్షియా క్రమానికీ చెందిన జీవులు. మేము చదువుకునేటపుడు ఎలుకను డిసెక్షన్ చేసేవాళ్ళం. దీని ప్రత్యుత్పత్తి వ్యవస్థను డిసెక్షన్ చేస్తున్నపుడు, దాని కడుపులో చాలా ఎలుక పిల్లలు ఉండటం చూసేవాళ్ళం. జీర్ణవ్యవస్థ, నాడీ వ్యవస్థలు కూడా డిసెక్షన్ చేసేవాళ్ళం. ఇపుడు జీవహింస అని పిల్లల చేత డిసెక్షన్లు చేయించడం లేదు.
చింతకాయలతో
నేను పొలంలో నాట్లు వేస్తున్నారంటే చూడటానికి వెళ్ళాను. అక్కడ పెద్ద చింతచెట్టు కనిపించింది. చెట్టునిండా చిన్న చిన్న చింతకాయలు వేలాడుతున్నాయి. ఇప్పుడే మొదలవుతున్నాయి. బుల్లి బుల్లి చింతకాయల్ని 'ఓనగాయలు' అంటారట. నాకు ఆ కాయలు, చెట్టు చూడగానే దాని దగ్గరే ఉండిపోయాను. చింత చెట్టుకున్న చిగురు, చిన్న చింత కాయలు కోసుకుని వచ్చాను. ఈ చింత కాయల్ని చూడగానే బొమ్మలు చేయాలన్పించింది. కొన్ని బొమ్మలు చేశాను. పొడవైన తొడిమ ఉండటంతో వీటిని ఎలుకల్లాగా చేద్దామనుకున్నాను. చింతకాయ మీద కండ్లు దిద్ది, ఇంకా శరీరం మీద వెంట్రుకలున్నట్టుగా నల్ల రంగుతో దిద్దాను. ఇప్పుడు చూడటానికి ఎలుకల్లాగే ఉన్నాయి. వినాయక చవితికి వాడవాడలా గణపతిని పెడతారు. కాబట్టి ఆయన కోసం బోలెడు ఎలుకల్ని సిద్ధం చేస్తున్నాను. వడియాలతో, దొండకాయలతో, చింతకాయలతో, వెల్లుల్ని పాయలతో రకరకాల ఎలుకలు తయారవుతున్నాయి. టామ్ అండ్ జెర్రీ లోని జెర్రీ ఎలుక పాత్ర, మిక్కీ మౌస్ వంటి కార్టూన్ పాత్రలు పిల్లల కోసం రూపొందించడబ్బాయి. అవి చేసే విన్యాసాలు పిల్లలకెంత నవ్వు తెప్పిస్తాయో గదా! వీటి మనస్తత్వం మానవులకు దగ్గరగా ఉంటుందట. బహుశ అందుకేనేమో ప్రయోగశాలల్లో ఎక్కువగా ఎలుకల మీద ప్రయోగాలు జరుగుతుంటాయి. తర్వాత ఎలుకలు ఎక్కువ సార్లు సంతానోత్సత్తి చేయడం వల్ల కూడా ప్రయోగాలకు ఉపయోగిస్తారు.
సీసా మూతలతో
ఇప్పుడు మంచినీళ్ళ సీసా చేతిలో లేకుండా ఎక్కడికీ వెళ్ళడం లేదు. ఇప్పటికీ మనం జాగ్రత్త పడకపోతే ముందు ముందు ఆక్సిజన్ సిలెండర్లు మోసుకుని తిరిగే అవసరం పడుతుంది. ఇలా కొన్న మంచి నీళ్ళ సీసాలు ఉపయోగించాక పారవేస్తాం కదా. అలాంటప్పుడు మూతలు తీసి దాచిపెట్టి బాటిల్‌ను బాగా నలిపేసి పారెయ్యాలి. లేకపోతే మరల ఆ బాటిళ్ళలో నీళ్ళు నింపి అమ్ముతారు. నేను పోయిన సంవత్సరం వినాయక చవితికి గణపయ్యలతో పాటు మూషికాలను కూడా తయారు చేశాను. ఇలాంటి సీసాల మూతలతో ఎలుకను రూపొందించాను చూడండి. రాజస్థాన్‌లోని కర్ణిమాత ఆలయంలో సుమారు 20 వేల ఎలుకలు నివాసం ఉంటాయి. ఈ ఆలయంలో ఎలుకల చిత్రాలు ఉంటాయి. అక్కడ ఎలుకలకు ఆహారం అందించి జాగ్రత్తగా చూసుకుంటారు. విజయానికి, ధైర్యానికి ప్రతీకగా కొలిచే దుర్గామాత ఇక్కడ కర్ణిమాతగా వెలిసింది. ఈ ఆలయాన్ని 'మూషికాలయం' అని అంటారు. ఈ గుడి మొఘలాయూ వాస్తులో కట్టబడి ఉన్నది.
సపోటా గింజలతో
పోయిన నెలలో సపోటాలు బాగా దొరికాయి. సపోటా గింజలు చాలా అందంగా ఉంటాయి. మంచి నిగనిగలాడే మెరుపుతో నల్లగా ఉంటాయి. వీటిని కన్నులకు వాడుకుంటే ఎంత కరెక్టుగా సరిపోతాయో. అందుకే నేను వీటిని దాచుకుంటాను. అయితే ఇవి రెండు మూడు రోజులయ్యాక బ్రౌన్ కలర్లోకి మారతాయి. కొద్దిగా ఎండగానే నలుపు నుంచి బ్రౌన్ రంగుకు తిరుగుతాయి. నేను ఈ సపోటా గింజలతో ఎలుకను రూపొందించాను. వీటి పళ్ళు ఎంత బలమైనవంటే కట్టులకు కూడా రంధ్రం చయగలవు. పంచతంత్ర కథల్లో ఎలుక-సింహం కథ, మిత్రలాభంలో పావురాలు - వేటగాడు కథలో ఎలుక గురించి చదువుకుంటాము. ఎలుకలు రైతులకు ఎంతో నష్టం కలగజేస్తాయి. పంట చేలను నాశనం చేయడం, కూరగాయలను కొరికేయడం వంటివి చేస్తాయి. ధాన్యపు గాదెల్లో చేరి ధాన్యాన్నంతా బొక్కేస్తుంటాయి.
మోరంగడ్డతో
పులుసులో వేయడానికి మోరంగడ్డలు తెచ్చారు. నాకు దాన్ని చూడగానే ఎలుక ఆకారం వచ్చేలా అనిపించింది. అంతే పులుసు సంగతి పక్కనబెట్టి ముందుగా ఆ గడ్డతో ఎలుకను తయారు చేశాను. మోరంగడ్డ వంపులు తిరిగి కలుగులో నుంచి దొంగ చూపులు చూసే ఎలుకలా ఉన్నది. దానికి కండ్లు, మూతి దగ్గర మీసాలు అన్నీ పెట్టాను. ఇప్పుడు నిజంగా దొంగచూపుల ఎలుక వలె అనిపిస్తుంది. ఇంటి యజమాని పక్కకు వెళితే అన్నీ కొరికేయాలని చూస్తున్నట్టుంది. ఈ ఎలుకల వలన నిత్య జీవితంలో ఇళ్ళలోనూ, పొలాలలోనూ ఎన్నో నష్టాలు వాటిల్లుతాయి. అంతేగాక ప్లేగు వ్యాధిని వ్యాప్తి చేయగలవు. ఎలుకల్లో యాభై జాతుల వరకు ఉన్నాయి. ప్లేగు వ్యాధి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు మూడు కోట్ల నుంచి ఐదు కోట్ల వరకు ప్రజలు చనిపోయారు. క్రీ.శ 541 సంవత్సరంలో తొలిసారిగా ప్లేగు వ్యాధి వచ్చింది.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్