Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుంజన్ శ్రీవాస్తవ... కళాకారిణిగా దాదాపు రెండు దశాబ్దాల జీవితం ఆమెది. విజువల్ ఆర్ట్‌లో పీహెచ్డీ చేసిన ఈమె తనను ఓ కళాకారిణిగా తీర్చిదిద్దిన తన బాల్యాన్ని, చదువును గుర్తు చేసుకున్నారు. తన చిత్రకళ ద్వారా పర్యావరణాన్ని ప్రేమిస్తూ.. ప్రకృతిని ఆరాధిస్తున్న ఈమె ఇటీవలె తన కళారూపాలను వర్చువల్ ఎగ్జిబిషన్ ద్వారా ప్రపంచం ముందుంచారు. ఎంతో నైపుణ్యం ఉండి వెలుగులోని రాలేక మరుగున పడివున్న యువతరానికి మార్గనిర్దేశం చేస్తూ వారి కళల్లో.. కండ్లల్లో కాంతిని నింపుతున్న ఆమె గురించి...
వృత్తిపరంగా మ్యూజిషియన్ అయిన శ్రీవాస్తవ తల్లి, కళల మార్గంలోకి వెళ్ళడానికి బిడ్డకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. అదే గుంజన్ జీవితంలో అన్ని మార్పులకు దారి తీసింది. తల్లి ఇచ్చిన స్వేచ్ఛను చక్కగా వినియోగించుకుంది. ఆర్ట్‌వైపు తన అడుగులు వేసింది. అలహాబాద్ విశ్వవిద్యాలయం నుండి దృశ్య కళలో పీహెచ్డీ చేసింది. ''ఓ అభిరుచిగా మొదలై నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఒక్క సంవత్సరాలలో తీవ్రమైన అన్వేషణగా మారింది. నా చిత్రాలను ప్రదర్శించడం ప్రారంభించాను. కొత్త అవకాశాలు వస్తున్నాయి'' అంటున్నారు గుంజన్. పీహెచ్డీ చేస్తున్న సమయంలోనే ఆమె భారతీయ కళతో ప్రేమలో పడింది. ఆధునిక కళ భారతదేశానికి ఎలా వచ్చిందో.. సమకాలీన భారతీయ కళను ఎలా ప్రభావితం చేస్తుందో అధ్యయనం చేసింది.
కళాకారిణిగా జీవితం
నగర దృశ్యాలు, ప్రకృతి దృశ్యాలు, సముద్ర దృశ్యాలతో తన కళా జీవితాన్ని ప్రారంభించి గుంజన్ తర్వాత కాలంలో పర్యావరణ పరిరక్షణ వైపుకు మళ్ళింది. తన చిత్రాల కోసం ఆమె సయాన్ బ్లూ ప్రింట్‌ను ఉత్పత్తి చేసే సైనోటైప్ ప్రింటింగ్ వంటి సాంప్రదాయ సాంకేతికతను ఉపయోగిస్తుంది. తన నైపుణ్యంతో పశ్చిమ బెంగాల్ గవర్నర్ కేశరి నాథ్ త్రిపాఠిచే గుర్తింపు పొందింది.
అత్యంత సవాలు
పెద్ద కాన్వాసులపై ఆమె వేసిన పెయింటింగ్‌లు 15,000 వేల రూపాయల నుండి 8 లక్షల వరకు ధర పలుకుతున్నాయి. ప్రతి సంవత్సరం అమెరికాలోని కాలిఫోర్నియాలోని గ్యాలరీలలో తన కళాకృతులను ప్రదర్శిస్తుంది. ఏదేమైనా కోవిడ్-19 కారణంగా భద్రతా సమస్యలు ఏర్పడ్డాయి. అందుకే కళాకారులు ఇప్పుడు వర్చువల్ ఎగ్జిబిషన్లను నిర్వహించాలని యోచిస్తున్నారు. ఏదేమైన కళను సృష్టించడం తన ముందు ఉన్న అత్యంత ప్రాథమిక సవాలు అని ఆమె అంటున్నారు. ఇంకా మాట్లాడుతూ ''కళను సృష్టించడం అంటే ఎంతో స్ట్రగుల్ చేయడమే. ఈ క్రమంలో కొన్నిసార్లు చాలా అలసిపోతాను. పరిశోధన చేస్తున్న సమయంలో నన్ను నేను సృజనాత్మకంగా మలుచుకోవడం కోసం, అలసిపోకుండా ఉండేందుకు, నాలో ప్రేరణ నింపుకునేందుకు ప్రకృతి వైపు మళ్ళి నాలో శక్తిని నింపుకుంటాను'' అంటున్నారు.
పర్యావరణానికి అనుకూలంగా...
టెక్నాలజీని ఉపయోగించడం, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రపంచ ధోరణులకు గురికావడం వల్ల భారతదేశంలో కళ చాలా ముందుకు వచ్చిందని గుంజన్ అంటున్నారు. తత్ఫలితంగా, సాంప్రదాయక కళలో విజువల్ ఆర్ట్ మరింత అభివృద్ధి చెందుతుంది. స్థిరమైన కళ, జీవనం పట్ల మక్కువ, విషపూరితం కాని రంగులు, పర్యావరణ అనుకూలమైన కళలను ఎంపిక చేసుకోవడానికి ఎక్కువ మంది కళాకారులు ముందుకు వస్తున్నారు. ఇది చాలా సంతోషించాల్సిన విషయం అని ఆమె అంటున్నారు. ఈ రోజుల్లో వర్ధమాన కళాకారుల కోసం సోషల్ మీడియా ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని గుంజన్ అంటున్నారు.
ప్రజలే నిర్ణయిస్తారు
''నేను సాంప్రదాయ ఆలోచనలు కలిగిన వ్యక్తిని. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా కూడా మన ఆలోచనల్ని తీర్పు దిద్దుతుంది. ఇలాంటి టెక్నాలజీ కాలంలో ప్రజలే మనలోని ప్రతిభను గుర్తించి నిర్ణయిస్తారు. మన కళను మనం అంచనా వేయలేము. ఇది కేవలం ఓ కళాకారిణిగా నా వ్యక్తిగత అభిప్రాయం. అయితే ఈ రంగంలో నాణ్యత లేని పనితో పాటు కాపీ చేయడం కూడా జరుగుతుంది'' అంటున్నారు.
వర్ధమాన కళాకారుల కోసం...
గుంజాన్ 'యు లీడ్ ఇండియా ఫౌండేషన్' సహ వ్యవస్థాపకురాలు. ఇది లాభాపేక్షలేని సంస్థ. ఇది భారతదేశానికి తర్వాతి తరం నాయకులను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సంస్థ గురించి మాట్లాడుతూ ''నాయకత్వానికీ, కళ సృజనాత్మకత... ఇవి రెండు ఒకదానితో ఒకటి బలంగా ముడిపడి ఉన్నాయి. భవిష్యత్తులో నాయకులుగా దేశ నిర్మాణానికి దోహదం చేయడంలో సహాయపడటమే మా లక్ష్యం'' అంటున్నారు.
వెలుగులోకి రాలేక
అటల్ ఇన్నోవేషన్ మిషన్‌లో మార్పుకు మార్గదర్శకురాలిగా... గ్రామీణ భారతదేశంలో తమను తాము వ్యక్తీకరించుకునే సామాజిక నైపుణ్యాలు లేని అట్టడుగు వర్ధమాన కళాకారులతో ఆమె కలిసి పనిచేస్తుంది. అందమైన కళలను సృష్టించే మనసు, శ్రమతో కూడిన గొప్ప నైపుణ్యం కలిగి ఉన్నప్పటికీ చివరికి వారు వెలుగులోకి రాలేకపోతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో తమని తాము నిలబెట్టుకోలేకపోతున్నారు. అలాంటి వారి కళలను ప్రపంచానికి పరిచయం చేయడంలో ఆమె మార్గనిర్దేశం చేస్తుంది. తన నెట్‌వర్క్‌ను ఉపయోగించి సోషల్ మీడియా ఛానెల్‌ల మధ్య వారి సృజనాత్మకతలను ప్రోత్సహించడం కోసం గుంజన్ వారికి సహాయపడుతుంది. ప్రోత్సహించే ఓ కుటుంబ నేపథ్యం నుండి వచ్చిన గుంజన్ వారి నైపుణ్యాలు, కళల పట్ల వారి అంకితభావం, వారి వద్ద ఉన్న అతి తక్కువ సదుపాయాలు చూసి ఆశ్చర్యపోతుంది.
- సలీమ