Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిద్ర వల్ల కొంతమంది టైం వేస్ట్ అవుతుంది అనుకుంటారు. కానీ సరైన నిద్రలేకపోతే ఎన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయో కొందరికి తెలియదు. రోజు ఒక యాపిల్ తింటే డాక్టర్ నుంచి దూరం ఉండవచ్చు అంటారు. అలాగే సరైన నిద్ర కూడా వైద్యుల నుంచి దూరంగా ఉండేలా చేస్తుంది. నిద్రలేమి వల్ల కండ్లు మెదడు మాత్రమే కాదు మిగతా శరీర అవయవాలపై దీని ప్రభావం పడుతుంది.
ఒకవ్యక్తి ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడటం కోసం 48 గంటలపాటు నిద్రపోలేదంట. అతను గుండెపోటుతో మరణించాడు. నిద్ర లేకపోవడం వల్ల ముఖ్యంగా పాడయ్యేది బ్రెయిన్. అది మెల్లిగా అల్జీమర్స్‌కు దారితీస్తుంది. దీంతో మనుషుల పేర్లు, ముఖాలు మర్చిపోతారు. తర్వాత ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది గుండె. మనం నిద్ర పోతున్న సమయంలోనే గుండెకు విశ్రాంతి దొరుకుతుంది. బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది. కాబట్టి ఆరుగంటల కంటే తక్కువ సేపు నిద్రపోతే జీవితంలో ఎదో ఒక సమయంలో గుండెపోటు వచ్చే ప్రమాదం 4.5 రెట్లు ఎక్కువగా ఉంటుందని వైద్యులు అంటున్నారు.
గ్రోత్ హార్మొన్లు కూడా నిద్రపోయేటపుడే విడదలవుతాయి. ఒకరోజు మనం నిద్రపోకపోతే మన ముఖం ఎలా మారిపోతుందో తెలుసుకదా... మన మెదడులోని ఒత్తిడి హార్మొన్స్ ఎక్కువగా విడదలవ్వడమే దీనికి ప్రధాన కారణం. దీనివల్ల చర్మం సాగిపోతుంది. నిద్రపోతే ముఖం కాంతివంతంగా మారుతుంది. ఎక్కువ సేపు నిద్రపోయేవారు 10 ఏండ్లు తక్కువగా కనిపిస్తారు. దీన్నే బ్యూటీ స్లీప్ అంటారు. అంతేకాదు నిద్రలేకపోవడం వల్ల మానసికంగా, శారీరకంగా వీక్‌గా కనిపిస్తారు.
నిద్రలేమి వల్ల మనలో ఉత్సాహాంగా ఉండరు. ముఖ్యంగా నైట్‌షిఫ్ట్‌ల్లో పనిచేసేవారికి ఈ ప్రమాదం ఎక్కువ. భవిష్యత్తులో వారికి కేన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. డయాబెటీస్, ఒబేసిటీ, గుండె సంబంధిత వ్యాధులు రావచ్చు. అందుకే నైట్‌షిఫ్ట్‌లు చేసేవారు సరైన ఆహారం తీసుకోవడం మంచిది. నిద్రపోయి 24 గంటలు దాటితే మన మెదడు తెలియకుండానే మైక్రోస్లీప్స్ తీసుకుంటుంది. ఇది ఒక సెకను నుంచి హాఫ్ మినట్ వరకు ఉంటుంది. దీనివల్ల చాలా యాక్సిడెంట్లు కూడా అయ్యాయి. అమెరికాలో ప్రతి ఏడాది నిద్ర లేకపోవడందో జరిగిన కార్ యాక్సిడెంట్లు 2 లక్షలకుపైగా ఉన్నాయట.
విద్యార్థులు కూడా రాత్రంతా చదువుతారు. ఇది వారికి నష్టమే. బ్రెయిన్లో ఉండే ప్రీఫ్రంటల్ నరాలు వీక్ అవుతాయి. దీంతో పరీక్ష సమయంలో ఏమి గుర్తు రాకపోవడంతోపాటు అలసట, చిరాగ్గా ఉంటుంది. త్వరగా పడుకోని తెల్లవారుజాము చదువుకుంటే సరిపోతుంది. స్లీప్ పెరాలసిస్ ఇది చాలా మందికి ఎదురయ్యే ఉంటుంది. నిద్రలో ఎవరో మనల్ని నొక్కి పట్టుకున్నట్టు ఉంటుంది. పైకి లేచే ప్రయత్నం చేస్తాం కానీ, లేవలేని పరిస్థితి ఉంటుంది. ఈ సమయంలో మనం నిద్రపోతాం కానీ, మన బ్రెయిన్ మెలకువగా ఉంటుంది. సరైన నిద్ర లేకపోవడం, సమయానికి నిద్రపోకపోవడం వల ఇలా జరుగుతాయి. నిద్రలో లేచి నడవటం, మాట్లాడం కూడా నిద్రలేమి వల్లే జరుగుతాయి.
నేషనల్ స్లీప్ ఫౌండేషన్ ప్రకారం చిన్న పిల్లలకు 9-11 గంటలు, టీనెజర్లకు 8-10 గంటలు, పెద్దవాళ్లకు 7-9 గంటలు, వృద్ధులకు 7-8 గంటల నిద్ర అవసరమని తేల్చింది.