Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంట్లో ఏ వస్తువు ఎక్కడుంటే నీట్‌గా ఉంటుంది.. ఎక్కడ ఎలాంటి అలంకరణ వస్తువులు అమర్చాలి.. అన్న విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటాం. నిజానికి ఇలా మనకు నచ్చినట్లుగా ఇంటిని తీర్చిదిద్దుకునే ప్రక్రియ మనసు పైనా సానుకూల ప్రభావం చూపుతుందని చెబుతున్నాయి కొన్ని అధ్యయనాలు. అందుకే ఒత్తిడిగా, ఆందోళనగా అనిపించినప్పుడల్లా ఇంటి అలంకరణపై శ్రద్ధ పెడితే మనసు తిరిగి కుదుటపడుతుందని చెబుతున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో మనసు మెచ్చేలా ఇంటిని ఎలా తీర్చిదిద్దుకోవాలో తెలుసుకుందాం రండి..
ఉద్యోగం చేసే మహిళలకు రోజూ ఇంటిని సర్దడం కుదరకపోవచ్చు. దాంతో ఆ సమయంలో అవసరమున్న పనులే చేసి మిగతా వాటిని పక్కన పెట్టేస్తుంటారు. ఫలితంగా వారం తిరిగే సరికల్లా ఇల్లంతా చిందరవందరగా తయారవుతుంది. అది మానసిక ఒత్తిడికి దారి తీస్తుంది. ఒత్తిడిని అదుపు చేసే శక్తి పచ్చదనానికి ఉందంటున్నారు నిపుణులు. అందుకే ఇంట్లోని ప్రతి గదిలో ఇండోర్ ప్లాంట్స్, మనీ ప్లాంట్స్, సువాసన వెదజల్లే పూల మొక్కలు.. వంటివి ఏర్పాటు చేసుకోమంటున్నారు. వీటికోసం ప్రత్యేకంగా స్థలం కూడా కేటాయించక్కర్లేదు. పై నుంచి వేలాడదీసే హ్యాంగింగ్ ప్లాంట్స్, గోడకు అమర్చే ప్లాంట్స్ ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇవి అమర్చుకున్న దగ్గర్నుంచి మీ దృష్టి వీటి పైనే ఉంటుంది. కాబట్టి ఒత్తిడి దరిచేరకుండా జాగ్రత్తపడచ్చు. అలాగని ఇంటిని అలాగే వదిలేయకుండా మీకు వీలు చిక్కినప్పుడల్లా వారానికోసారి లేదంటే రెండు వారాలకోసారి సర్దే పని పెట్టుకుంటే సరిపోతుంది.
మీకు నచ్చినట్టుగా
ప్రతి ఒక్కరి ఇంట్లో వాళ్లకు నచ్చిన ప్రదేశమంటూ ఒకటి ఉంటుంది. అది బాల్కనీ కావచ్చు.. వంటగది కావచ్చు.. లేదంటే ఇంటి ముంగిట్లో కావచ్చు.. కాస్త మూడ్ బాగోలేకపోయినా, పని ఒత్తిడితో సతమతమైనా.. ఇక్కడికొచ్చి సేదదీరుతుంటాం. అయితే ఈ ప్రదేశం మరింత ఆహ్లాదాన్ని పంచాలంటే మన అభిరుచుల్ని, నైపుణ్యాల్ని ఇక్కడ పెట్టుబడిగా పెట్టచ్చంటున్నారు నిపుణులు. కొంతమందికి వింటేజ్ స్టైల్ అంటే ఇష్టముంటే.. మరికొంతమందికి నచ్చిన రంగులు వేసుకోవడం ఇష్టముంటుంది.. పుస్తకాల పురుగైతే ఆ ప్రదేశాన్ని గ్రంథాలయంగా మార్చేస్తుంటారు. ఇంకొందరు ఆ పర్సనల్ స్పేస్‌నే వర్కింగ్ స్పేస్‌గానూ మార్చుకుంటారు. ఇలా మీ ఇష్టాయిష్టాలకు తగినట్టుగా ఆ ప్రదేశంలో అందమైన అలంకరణ వస్తువులకు చోటిస్తే ఇక ఆ ప్రదేశాన్ని మీరు వదలనే వదలరు.
మీరే డిజైనర్
ఎవరి ఇంటికి వారే ఇంటీరియర్ డిజైనర్ కావాలంటున్నారు నిపుణులు. ఇతరుల దగ్గర్నుంచి ఐడియాలు తీసుకోవడంలో తప్పు లేదు.. కానీ మీలో ఉన్న ఆలోచనలకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే మీ మనసు మరింత సంతృప్తి పడుతుంది. అంతేకాదు.. కొంతమందికి ఆర్ట్ వేయడం, క్రాఫ్ట్స్ తయారుచేయడం.. వంటి కళల్లో పట్టుండొచ్చు. వాటిని వృథా చేయకుండా మీ ఇంటికోసం చక్కటి థీమ్‌తో కూడిన అందమైన డెకరేటివ్ పీసెస్‌ని తయారుచేసుకొని ఇంట్లో అమర్చుకోవచ్చు. పైగా ఎవరైనా బయటి వ్యక్తులు ఇంటికొచ్చినప్పుడు మీరు తయారుచేసిన వస్తువులను మెచ్చుకుంటే మనసు ఎగిరి గంతేస్తుంది.
మీకు అనుకూలంగా
ఇతర గదుల మాట ఎలా ఉన్నా.. కిచెన్ నీట్‌గా కనిపిస్తే మనసుకు సంతృప్తిగా, సంతోషంగా అనిపిస్తుంటుంది. అయితే దీన్ని సర్దడంలోనూ పలు మెలకువలు పాటిస్తే.. మరింత కంఫర్టబుల్‌గా, హ్యాపీగా ఫీలవ్వచ్చంటున్నారు నిపుణులు. చాలామంది ఇళ్లలో మాడ్యులర్ వంటగదులే ఉంటున్నాయి.. వార్డ్రోబ్స్ లోపలే సరంజామా ఉంటుంది కదా అని ఇష్టమొచ్చినట్టుగా పడేయకుండా రోజూ అవసరమున్నవి మీకు అందుబాటులో, ఎక్కువగా వాడనివి పైర్యాక్స్లో లేదంటే వెనకవైపు అమర్చుకోవచ్చు. కిచెన్‌లో ఏ వస్తువైనా, ఎంత జాగ్రత్త తీసుకున్నా త్వరగా జిడ్డు పడుతుంది. కాబట్టి జిడ్డుగా మారిన ప్లాస్టిక్ డబ్బాల్ని శుభ్రం చేయడానికి అదనంగా శ్రమ పడాలి. అదే వాటికి బదులు అన్నీ ఒకే తరహా గాజు సీసాలు ఎంచుకొని సరుకులన్నీ వాటిలో నింపుకుంటే చూడ్డానికి నీట్‌గా కనిపిస్తుంది. అది చూసి మన మనసు నిండుతుంది. ఇక స్టౌ వెనక గోడలు, కిచెన్ ప్లాట్‌ఫామ్ జిడ్డు పట్టకుండా ఉండాలంటే యాంటీ గ్రీజ్ షీట్స్ అతికించడం మంచిది. అవసరం తీరాక వాటిని తొలగిస్తే సరిపోతుంది.