Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చదువుకోసమో, బిజినెస్ కోసమో, ఆఫీస్ పనుల కోసమో... ఇలా కారణమేదైనా ఈ కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ చాలామందికి విమానయానం చేయక తప్పట్లేదు. అయితే ఎప్పటికప్పుడు గాలిని శుద్ధి చేసే వెంటిలేషన్ సిస్టమ్ విమానాల్లో ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ముప్పు చాలా వరకు తగ్గుతుందంటున్నారు నిపుణులు. అలాగని నిర్లక్ష్యం వహించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే ప్రమాదం మన దాకా రాకుండా జాగ్రత్తపడొచ్చు. మరి ప్రస్తుత కరోనా ప్రతికూల పరిస్థితుల్లో విమాన యానం చేసే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకుందాం...
కరోనా భయంతో ఎక్కడికెళ్లినా మాస్క్ ధరిస్తున్నాం. అయితే రద్దీగా ఉండే ప్రదేశాల్లో రెండు మాస్కులు ధరించడం మంచిది. దాంతో వైరస్ ముప్పు 95 శాతం దాకా తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు. విమాన ప్రయాణం కూడా రద్దీతో కూడుకున్నదే కాబట్టి.. విమానాల్లో ప్రయాణించే వారు కూడా రెండు మాస్కులు ధరిస్తేనే ఇతరుల నుంచి కొవిడ్ సోకకుండా జాగ్రత్తపడొచ్చు. అందుకే లోపల సర్జికల్ మాస్క్.. దానిపై నుంచి క్లాత్ మాస్క్ పెట్టుకోవాలి. ఎన్ 95 మాస్క్ అయితే ఒక్కటి పెట్టుకున్నా సరిపోతుంది. ఇక దీంతో పాటు అదనంగా మాస్కులు, హ్యాండ్ శానిటైజర్, డిస్ఇన్ఫెక్టంట్ వైప్స్, టిష్యూస్.. వంటి ఒకసారి వాడిపడేసే వస్తువుల్ని హ్యాండ్‌బ్యాగ్‌లో చేతికందేలా అమర్చుకుంటే వాడుకోవడానికి మరింత సులభంగా ఉంటుంది.
ప్రస్తుత కరోనా ప్రతికూల పరిస్థితుల్లో స్టైల్ కంటే ఆరోగ్యానికే అధిక ప్రాధాన్యమివ్వమంటున్నారు నిపుణులు. అందుకే శరీరం మొత్తం కవరయ్యేలా ఉండే జీన్స్-ఫుల్ స్లీవ్స్ షర్ట్, టీషర్ట్, గౌన్, ఫ్రాక్.. వాటికి జతగా ఫుల్స్లీవ్స్ డెనిమ్ జాకెట్, పాదాలు కవరయ్యేలా షూస్, కండ్లద్దాలు, స్కార్ఫ్‌తో ముఖాన్ని కవర్ చేయడం, చేతులకు గ్లౌజులు.. వంటివి ఎంచుకోవాలి. ఇలా శరీరం మొత్తం కప్పి ఉంచే లాంటి దుస్తులు వేసుకుంటే ఆయా ఉపరితలాల నుంచి వైరస్ చర్మానికి అంటుకోకుండా జాగ్రత్తపడచ్చు.
ఏ ప్రయాణమైనా కిటీకీ పక్కన సీట్లో కూర్చోవడానికే మనం ఆరాటపడుతుంటాం. ఈ కరోనా కాలంలో విమానయానం చేసే వారికి ఈ సీటే సురక్షితం అని చెబుతున్నారు నిపుణులు. ఎమోరీ యూనివర్సిటీ, జార్జియా టెక్ పరిశోధకులు చేసిన అధ్యయనంలోనూ ఇదే విషయం తేలింది. విమానంలో సూక్ష్మక్రిములు ఎక్కువగా చేరని ప్రదేశాలేమైనా ఉన్నాయంటే అది విండో సీటే అని చెబుతున్నారు పరిశోధకులు. అయితే ముందే బుకింగ్ చేసుకుంటే కిటికీ పక్కన సీట్లను ఎంచుకోవచ్చు. అప్పటికప్పుడు ప్రయాణమంటే ఇది కుదరచ్చు.. కుదరకపోవచ్చు. కాబట్టి ఏ సీటైనా కూర్చునే ముందు శానిటైజ్ చేసుకోవడం, ఆ చుట్టుపక్కల ఉపరితలాలు తాకకపోవడం, చేతుల్ని ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవడం, తోటి ప్రయాణి కులతో మాట్లాడక పోవడం వంటి కనీస జాగ్రత్తలు పాటిస్తే సురక్షితంగా ప్రయాణం చేయచ్చు.
విమాన ప్రయాణ మంటేనే విలాసవంతంగా ఉంటుంది.. ఇక అందులో సర్వ్ చేసే ఆహార పదార్థాల విషయంలో ఎక్కువ శుచి-శుభ్రత పాటి స్తుంటారు అనుకుంటారు చాలామంది. నిజానికి ఇలాంటి సౌకర్యం అన్ని విమానాల్లో ఉండచ్చు.. ఉండకపోవచ్చు అంటోంది యూఎస్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. విమానాల్లో ఉండే నీటి ట్యాంకులు అన్ని వేళలా పరిశుభ్రంగా ఉంటాయని చెప్పలేము. కాబట్టి టీ, కాఫీ వంటివి తీసుకోకపోవడమే ఉత్తమం అని చెబుతోంది. ఈ తిప్పలన్నీ ఎందుకు అనుకున్న వాళ్లు ఇంటి నుంచే పండ్లు, డ్రైఫ్రూట్స్ సలాడ్స్.. వంటివి వెంట తీసుకెళ్లచ్చు. అయితే ఇంటి నుంచి తీసుకెళ్లాలనుకున్న పదార్థాలేవైనా పరిమిత బరువులోనే ఉంటే ఇబ్బంది ఉండదు. పైగా ఇంటి ఆహారమైతే వైరస్ ముప్పు కూడా చాలా వరకు తగ్గుతుందంటున్నారు నిపుణులు.
విమానాశ్రయంలో కుర్చీలు, ఏటీఎంలు, చెక్-ఇన్ మెషీన్స్, ఎస్కలేటర్స్ వంటి ఉపరితలాల్ని తాకిన ప్రతిసారీ చేతుల్ని శానిటైజ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఎప్పుడూ మన చేతిలో ఉండే మొబైల్‌నూ శానిటైజ్ చేయాల్సిందే. మనం వెంట తీసుకెళ్లిన లగేజ్ బ్యాగ్స్ చెక్ చేసేటప్పుడు, వాటిని విమానంలో స్టోరేజ్ యూనిట్లో భద్రపరిచేటప్పుడు ఎంతోమంది చేతులు మారుతుంటాయి. కాబట్టి ప్రయాణం ముగిసి అవి తిరిగి మన దగ్గరికొచ్చిన తర్వాత డిస్-ఇన్ఫెక్టంట్ వైప్స్‌తో వాటి హ్యాండిల్స్ తుడవాలి.