Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఘూన్ఘాట్... శతాబ్దాలుగా మహిళలను అణచివేస్తూనే వుంది. తరతరాలుగా ఆమెను నాలుగ్గోడలకే పరిమితం చేస్తుంది. ముఖ్యంగా ఉత్తర భారతంలోని గ్రామీణ ప్రాంతంలోని మహిళలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంది. అక్కడి మహిళల స్వయంప్రతిపత్తిని పరిమితం చేస్తుంది. వారిని అభివృద్ధి చేయకుండా నిషేధిస్తూనే ఉంది. దేశ రాజధానికి అత్యంత సమీపంలో ఉండే హర్యానా రాష్ట్ర మహిళలు ఈ ముసుగు వల్ల ఎలాంటి ఆంక్షలు ఎదుర్కొంటున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం...
''నేను ఘూన్ఘాట్ కింద ఉక్కిరిబిక్కిరి అయ్యాను. అతను నాతో ఎప్పుడూ గొడవపడుతూనే ఉంటాడు. మా అత్తగారి ముందు, కుటుంబంలోని ఇతర సభ్యుల ముందు ఉన్నప్పుడు నన్ను ముసుగు వేయమని బలవంతం చేస్తాడు'' అని తన భర్త భగవాన్ దాస్ బిష్ణోరు గురించి శుష్మా భదు బిష్ణోరు చెప్పారు.
పోరాడి కూల్చివేసినప్పటికీ
పితృస్వామ్య సంప్రదాయంలో పొందుపరచబడిన ఘూన్ఘాట్, పర్దా వ్యవస్థ భారతదేశంలో వేద కాలం నాటిది. ఇది స్త్రీలను అణచివేసేందుకు ఉపయోగిస్తున్న ఓ సాధనం. ఒకప్పుడు ఘూన్ఘాట్ ఉన్నత వర్గాలకు చెందిన మహిళలు ఒంటరిగా ఉన్నప్పుడు పురుషుల దృష్టి వారిపై పడకుండా ఉంచేందుకు వేసుకునేవారు. నేడు కాలాలు మారినప్పటికీ.. మహిళలు ఈ వివక్షత వ్యవస్థను పెద్ద ఎత్తున పోరాడి కూల్చివేసినప్పటికీ ఘూన్ఘాట్ మహిళలను, ప్రత్యేకించి హిందీ మాట్లాడే గ్రామీణ ప్రాంతంలో ప్రగతిని సాధించకుండా నిషేధిస్తూనే ఉంది.
హర్యానాలో సజీవంగా ఉంది
నలభై ఏండ్ల సుష్మ 18 సంవత్సరాల వయసులో వివాహం చేసుకుంది. 90ల చివరలో ఆమె వివాహం చేసుకుని అత్తగారింటికి వచ్చింది. అప్పటి నుండి ఒక దశాబ్దానికి పైగా ఆమె ఘూన్ఘాట్ను వేసుకునే జీవిస్తుంది. భారతదేశంలో వివాహ వ్యవస్థ మహిళలపై అనేక ప్రభావాలు చూపుతుంది. అయతే దేశంలోని చాలా ప్రాంతాలలో ఘూన్ఘాట్ సంప్రదాయం తుడిచిపెట్టుకుపోయినప్పటికీ హర్యానాలో మాత్రం అది ఇంకా సజీవంగా ఉంది.
ముసుగు వేసుకునే...
''నేను ముసుగును వేసుకోకపోతే నా భర్త నన్ను కొట్టి చంపుతాడు. ఘూన్ఘాట్ మా సాంప్రదాయం అని అతను చెబుతాడు. నేను దానిని ఎలా నిరోధించగలను... సంవత్సరాలుగా మేము దాని వేసుకుంటూనే బతుకుతున్నాము'' అని హర్యానా రాష్ట్రంలోని ఓ గ్రామంలోని జమీందార్ కుటుంబానికి చెందిన సుష్మా గుర్తు చేసుకుంది. 2010లో హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లాలోని ఓ కుగ్రామమైన ధని మియాంఖాన్ మొదటి మహిళా సర్పంచ్‌గా సుష్మా ఎంపికయ్యారు. ఆ గ్రామం నుండి ఓ మహిళ సర్పంచ్‌గా ఎన్నిక కావడం అదే మొదటిసారి. అక్కడ మహిళను సర్పంచ్‌గా నియమించాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం. గ్రామ సర్పంచ్ అయిన తర్వాత సుష్మా తన ఇంటి నాలుగు గోడలు దాటి అనేక మంది వ్యక్తులను కలవవలసి వచ్చింది. సమావేశాల్లో పాల్గొని ప్రసంగించాల్సి వచ్చింది. అయితే ఇదంతా ఆమె ముసుగు వేసుకునే చేస్తుంది.
ముసుగు ఎత్తడం
''నేను ముసుగు తీయాల్సి వచ్చినపుడు నా భర్త ఆందోళన చెందాడు. కానీ అందరూ నాకు మద్దతు పలకడంతో సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేయాలనే నా నిర్ణయానికి అతను ఒప్పుకున్నాడు'' అని ఆమె చెబుతున్నారు. ఫతేహాబాద్‌లోని కార్యాలయాలను సందర్శించాల్సి వచ్చినప్పటి నుండి నా సమస్యలు ప్రారంభమయ్యాయి. అధికారులను కలవడానికి బయటకు వెళ్ళిన ఆమె ముసుగు తీసేందుకు భర్త అంగీకరించాడా..?
ప్రతిజ్ఞ చేశారు
''నేను నా ముసుగును బయట తీసేయడం చాలా సమస్యాత్మకం అని అనుకున్నాను. అయినా నేను అతనితో సూటిగా చెప్పాను. నేను నా ముసుగును ఎప్పటికీ ఎత్తివేస్తాను లేదా పంచాయితీ కార్యకలాపాల్లో పాల్గొనను'' అని చెప్పి సుష్మా తన సమస్యను పరిష్కరించుకుంది. ఘూన్ఘాట్ వ్యవస్థపై తను చేసిన పోరాటంలో మొదట తన ఇంట్లో తర్వాత గ్రామంలో గెలిచింది. 2012లో ఆమె తన గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల కాంపౌండ్‌లోని 25 గ్రామాల మహా పంచాయితీని ఏర్పాటు చేసింది. అక్కడ మహిళలందరూ సమావేశమై ఒక్కసారిగా ముసుగును ఎత్తివేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
వదలడం కష్టమే
''మహా పంచాయితీలో ప్రతి ఒక్కరూ తమ ముసుగును ఎత్తివేసారు. కానీ మహిళలు తమ ఇండ్లకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ముసుగు వేసుకుంటే నేను దానికి హామీ ఇవ్వలేను. మొదట్లో గ్రామంలోని పురుషులు ఎంతో ఆందోళన చెందారు. తమ ఇళ్లల్లోని మహిళలను అనేక రకాలుగా హింసించారు. అని సుష్మ అన్నారు. 39 ఏండ్ల నిర్మలా దేవి మొదటిసారిగా మహా పంచాయితీలో తన ముసుగును ఎత్తివేసింది. గ్రామ సర్పంచ్ ముసుగు ఎత్తివేస్తామని మాతో ప్రతిజ్ఞ చేయించినప్పుడు మేమందరం చేశాము. అప్పటి నుండి పరిస్థితులు మారినప్పటికీ కుటుంబంలోని పెద్ద మనుషులు, నా కుమార్తెల భర్త ముందు నేను ఇప్పటికీ ముసుగు వేసుకునే ఉండాలి. నేను అబద్ధం చెప్పను. ఇది చాలా కాలంగా కొనసాగుతున్న సాంప్రదాయం కాబట్టి దీన్ని పూర్తిగా వదులుకోవడం కష్టం'' అని నిర్మల చెప్పారు.
ఉద్యమించినా కొనసాగుతుంది
''ప్రజల దృష్టిలో పెట్టుకోవల్సింది ఒక్కటే. మనిషికి గౌరవం ముఖ్యం, ముసుగు కాదు. మహిళలు తమ ముఖాలను దాచుకోకుండా గ్రామం చుట్టూ తిరగవచ్చు. కానీ పురుషులు మహిళల పట్ల గౌరవం కలిగి ఉండాలి'' అని సుష్మా తెలిపారు. సుష్మా చేసిన ప్రయత్నాలు ధని మియాంఖాన్లో కొంత మార్పు తెచ్చినప్పటికీ ఉద్యమం ప్రారంభమై దాదాపు దశాబ్దం తర్వాత కూడా ఘూన్ఘాట్ వ్యవస్థ సజీవంగా ఉంది.
ముసుగులేని జీవితం తెలియదు
గ్రామంలో కొన్ని చోట్ల గో మాత గౌరవార్థం ఒక ఊరేగింపు జరుగుతోంది. ఇక్కడ చాలా మంది మహిళలు తమ దుప్పట్టాతో ముఖాలు పూర్తిగా కప్పుకున్నారు. వారిలో ఒకరైన 43 ఏండ్ల తోనా దేవి మాట్లాడుతూ ''ముసుగు లేకుండా జీవితం ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఇది గ్రామంలోని వృద్ధులను గౌరవించే జీవన విధానంగా, మార్గంగా మారింది. నేను ముసుగు లేకుండా గ్రామంలో తిరగలేను'' అన్నారు.
ముసుగు వేసుకోవల్సిందే
''నాకు ఇష్టం లేదు కానీ నేను దాని గురించి పెద్దగా చేయలేను. నేను తప్పనిసరిగా ముసుగు వేసుకోవాలి. నాకు మామగారి ముందు సిగ్గు అనిపిస్తుంది. ముసుగు లేకుండా వివాహం చేసుకున్నప్పటికీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను దానిని ఎల్లప్పుడూ వేసుకునే ఉంటాను'' అని మోనిక చెప్పింది.
మరింత దిగజార్చడమే
ఘూన్ఘాట్ వ్యవస్థ తరం నుండి తరానికి బదిలీ చేయబడుతుండటంతో దానికి ఇప్పట్లో అంతం అంటూ ఉండదు. మహిళలు స్వేచ్ఛతో జీవించకుండా నిరోధిస్తున్నాయి. అయితే ముసుగు లేకుండా మహిళలు ఉంటే ఈవ్ టీజింగ్, వేధింపులు వంటి నేరాలు గ్రామాల్లో న్యాయబద్దమైనవి అనే భావన వుంది. లైంగిక వేధింపులకు వేసుకునే బట్టలే కారణంగా చూపితే స్త్రీల జీవితాలను మరింత దిగజార్చడమే. మహిళా సాధికారతను వెనక్కి నెట్టడమే. ప్రస్తుతం జరుగుతున్న లైంగిక వేధింపులను చూస్తుంటే ఘూన్ఘాట్ వ్యవస్థ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని స్పష్టంగా అర్థమవుతుంది.
అధికార ప్రకటన
ముసుగును అరికట్టడానికి సుష్మాతో కలిసి మహిళలు బలమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇది గ్రామాల్లో నిర్విరామంగా కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు అటువంటి తిరోగమన సంప్రదాయాలను ప్రచారం చేసినప్పుడు అది ఆచరణను మరింత చట్టబద్ధం చేస్తుంది. 2017లో హర్యానా ప్రభుత్వం కృషి సంవాద్‌లో ఒక ప్రకటనను విడుదల చేసింది. ఇది ప్రభుత్వ యాజమాన్యంలోని పత్రిక. ఘూన్ఘాట్ గురించి వర్ణిస్తూ ''ఘూన్ఘాట్కి ఆన్-బాన్, మహారా హర్యానాకి పెచ్చన్'' (ఘూన్ఘాట్ ధరించడం అనేది హర్యానా రాష్ట్ర సంప్రదాయానికి ఓ గుర్తింపు).
సంప్రదాయాల ప్రకారమే జీవిస్తారు
హర్యానా మహిళా కమిషన్ ఛైర్పర్సన్ ప్రీతి భరద్వాజ్ దాని గురిం మాట్లాడుతూ ''ఇది హర్యానా నగరాలు, గ్రామాల మధ్య విరుద్ధమైన పరిస్థితి. ఇంటి నుండి బయటకు వచ్చి నగరాలకు వెళ్లిన మహిళలు మారారు. వారు ఇకపై ముసుగు వేసుకోరు. ముసుగు ఎత్తివేసి గ్రామం మొత్తానికి ఆదర్శప్రాయమైన స్ఫూర్తిని ప్రదర్శించిన అనేకమంది మహిళా సర్పంచ్‌లు కూడా ఉన్నారు. అయితే ముసుగు కింద సంతోషంగా ఉన్న మహిళలు కూడా ఉన్నారు. అందులో చదువుకున్న మహిళలు కూడా ఉన్నారు. తరతరాలుగా కొనసాగుతున్న ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం మహిళలు జీవిస్తారు. వారు దానిని పట్టించుకోరు'' అన్నారు.
మహిళలు భయపడుతున్నారు
హర్యానాలో మహిళలు ముసుగు ఉంచమని బలవంతం చేయలేదని భరద్వాజ్ చెప్పారు. ఇది కొందరి విషయంలో ఎలాంటి ఇబ్బంది కలిగించనప్పటికీ చాలా మంది తమ మహిళలను ముసుగు ఉంచాలని షరతు విధించారు. ముసుగు వేసుకున్న మహిళల్లో ఎక్కువమంది దానిని ఎత్తివేయడానికి భయపడుతున్నారు. గ్రామం నుండి బహిష్కరించబడటమో, ఎగతాళికి గురి కావడమో జరుగుతుందని వారి భయం.
బయటకు వస్తే వేస్తారు
హర్యానా మహిళా, శిశు అభివృద్ధి శాఖలో ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ (ఐసిడిఎస్) జాయింట్ డైరెక్టర్ రాజ్‌బాలా కటారియా... హర్యానా గ్రామాల్లో ఘూన్ఘాట్ వ్యవస్థ ఇక్కడ ఉందని అంగీకరిస్తున్నారు. ''ఇది నగరాలలో విద్యావంతుల మధ్య తుడిచిపెట్టుకుపోయింది. కానీ అది నేటికీ గ్రామాల్లో ఉంది. ఏదేమైనా కాలక్రమేణా ఓ మార్పును మేము చూశాము. మహిళలు ఇంట్లో ముసుగు ఉంచరు కానీ వారు తమ ఇళ్ల నుండి బయటకు వచ్చిన తర్వాత దాన్ని వేస్తారు'' అని కటారియా చెప్పారు.
- సలీమ, యువర్స్ స్టోరి సౌజన్యంతో