Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెసలతో చేసే వంటల రుచి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇవి ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. చిన్నారులు, పెద్దలు అందరూ తరచుగా వీటిని తీసుకోవటం వల్ల ఆరోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు. పెసల్లో కొలస్ట్రాల్ చాలా తక్కువ. దీనిలో ఇనుము సమృద్దిగా ఉండటం వల్ల రక్తహీనత ఉన్నవారు ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. అలాగే ఎదిగే చిన్నారులకు, బాగా ఆటలు ఆడేవారికి ఇవి చాలా మేలు చేస్తాయి. వీటిని ఎక్కువగా తీసుకోవటం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు వస్తాయి. వీటిల్లో ఉండే యాంటి ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కణాలతో పోరాటం చేస్తాయి. పెసల్లో పీచు ఎక్కువగా ఉంటుంది. వీటిలో కాల్షియం, బి విటమిన్స్ సమృద్ధిగా ఉండటం వల్ల ఎదిగే పిల్లలను వీటిని తినిపిస్తే ఎముకలు గట్టిపడతాయి. ఇవి తేలికగా జీర్ణం అవుతాయి. అంతేకాక మధుమేహం ఉన్న వారికి పెసలు ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో ఉండే పోషకాలు రక్తంలోని చక్కర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. పెసలను వంటకాల రూపంలో తీసుకోకపోయినా, నానబెట్టి మొలకల రూపంలో కూడా తీసుకోవచ్చు. కందిపప్పుకు బదులుగా పెసరపప్పును వంటల్లో ఉపయోగిస్తే మరీ మంచది. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న పెసరపప్పుతో చేసే కొన్ని వంటకాల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం...
పాయసం
కావల్సిన పదార్థాలు: పెసరపప్పు - 1 కప్పు, పాలు - 2 కప్పులు, తురిమిన బెల్లం - 1 కప్పు, నెయ్యి - చిన్న కప్పు, ఏలకులు, జీడిపప్పు, కిస్మిస్ - తగినన్ని.
తయారు చేయు విధానం: ముందుగా పెసర పప్పుని శుభ్రంగా కడిగి కుక్కర్లో రెండు విజిల్స్ వచ్చాక ఆపేయాలి. తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకుని దానిలో కొంచం నెయ్యి వేసి అది వేడి ఎక్కేలోగా కుక్కర్లో ఉడికించి పెట్టుకున్న పెసరపప్పుని మెత్తగా(మరి మెత్తగా కాదు) చేసి, నెయ్యిలో వేసి పచ్చి వాసన పోయేదాక సన్నని సెగమిద గరిటతో తిప్పుతూ వుండాలి. పచ్చి వాసన పోయాక అందులో పాలుపోసి బాగా ఉడికించాలి. (బాగా జారుగా కావాలి అనుకునే వారు ఇంకొంచం పాలు పోసుకోవచ్చు). బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి అందులో తురిమిన బెల్లం వేసి బాగా కలుపుతూ ఏలకులు పొడి చేసి వేయాలి. (వేడిగా ఉన్నప్పుడే బెల్లం బాగా కరిగి కలిసిపోతుంది). తర్వాత చిన్న బాండీలో మిగిలిన నెయ్యి వేసి జీడీ పప్పు, కిస్మిస్ వేయుంచుకుని పాయసంలో వేసుకోవాలి. (ఇష్టం ఉన్నవారు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు)
పచ్చడి
కావల్సిన పదార్థాలు: పెసరపప్పు -1 కప్పు, పచ్చిమిర్చి - 5, ఉప్పు, పోపు దినుసులు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు - సరిపడా.
తయారు చేయు విధానం: ముందుగా పెసరపప్పుని నానబెట్టాలి. మిక్సీలో పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత అందులో నానిన పెసరపప్పు వేసి మరీ మెత్తగా కాకుండా రుబ్బుకోవాలి. ఆ తర్వాత ఇంగువ, కరివేపాకు వేసి పోపు దినుసులతో పోపు వేసుకోవాలి. వేడి వేడి అన్నంలో తింటే చాలా బావుంటుంది. (ఇష్టం ఉన్నవారు వెల్లుల్లి రెబ్బలు రెండు వేసుకోవచ్చు)
పోలి పూర్ణం బూరెలు
కావల్సిన పదార్థాలు: పెసరపప్పు - రెండు కప్పు, బియ్యం - రెండు కప్పులు, మినపప్పు - రెండు కప్పులు, తురిమిన బెల్లం - రెండు కప్పులు, ఏలకులు - నాలుగు, నూనె - సరిపడా, ఉప్పు- రుచికి సరిపడా, తినే సోడ - చిటికెడు.
తయారు చేయువిధానం: ముందుగా మినపప్పు, బియ్యం కలిపి నాలుగు గంటలు నాన బెట్టుకుని రుబ్బుకోవాలి. పెసర పప్పును కుక్కర్లో ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత పప్పుని మిక్సీలో మెత్తగా రుబ్బుకుని అందులో బెల్లం కూడా కలపాలి. ఏలకులు దంచి పొడి చేసి ఈ మిశ్రమంలో కలపాలి. ఒక బాండీలో కొంచం ఎక్కువగానే నూనె పోసి అది బాగా వేడి ఎక్కేలోగా, రుబ్బి ఉంచుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. మినపప్పు బియ్యం మిశ్రమంలో కొంచం ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. చిటికెడు తినే సోడా కూడా వేసి కలపాలి. నూనె వేడెక్కక చేసి పెట్టుకున్న పెసరపప్పు ఉండలు ఈ మిశ్రమంలో ముంచి నూనెలో వేయాలి. ఇవి బాగా వేగిన తర్వాత తీసి కొంచం చల్లారాక నెయ్యి వేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటాయి.
ఖిచిడి
కావల్సిన పదార్థాలు: బియ్యం - కప్పు, పెసర పప్పు - కప్పు (కావాలంటే కొంచం ఎక్కువ వేసుకోవచ్చు), పచ్చి మిర్చి - రెండు, అల్లం వెల్లుల్లి ముద్ద - చెంచా, బిర్యానీ ఆకు, ఉప్పు, మరియాలు - తగినంత, మిరియాలు, జీలకర్ర - చెంచా,
ఆలు, టమాటో, క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్ అన్ని కలిపి - కప్పు, నూనె - సరిపడా, నీళ్లు - ఏడు కప్పులు.
తయారు చేయు విధానం: కుక్కర్లో నూనె పోసి అది వేడెక్కక బిర్యానీ ఆకు, జీలకర్ర, మిరియాలు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కొంచం వేగనివ్వాలి. తర్వాత కూరగాయల ముక్కలు అన్ని వేసి అవి కూడా కొంచెం వేగనివ్వాలి. అవి కొంచం వేగాక ఏడు గ్లాసుల నీళ్లు పోసి అందులోనే బియ్యం, పెసరపప్పు శుభ్రంగా కడిగి వేయాలి. ఉప్పు తగినంత వేసి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చాక ఆపేయాలి. పది నిమిషాల తర్వాత కుక్కర్ మూత తీసి వేడి వేడి కిచిడిలో ఆవకాయ వేసుకుని తింటే చాలా బావుంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.