Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నైజాం - రజాకార్లకు, నెహ్రూ సైన్యాలకు, కాంగ్రెస్ రాజాకార్లకు వ్యతిరేకంగానూ పోరాడారు. తమ అన్నదమ్ములతో, భర్తలతో పాటు వారూ దళాలలో చేరారు. చీమలు దూరని చిట్టడవుల్లో, గుట్టల్లో, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ కష్టసుఖాలు పంచుకున్నారు. కొరియర్లుగా, రాజకీయ ఆందోళన కారులుగా బాధ్యతలు స్వీకరించారు. నేడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట దినోత్సవం సందర్భంగా ఆ ధీర వనితల సాహసాలను, త్యాగాలను ఓ సారి మననం చేసుకుందాం...
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో స్త్రీలు ప్రముఖపాత్ర పోషించారు. భూమికోసం, అధికవేతనాల కోసం, భూస్వాముల దాష్టికాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో పురుషులతో సమానంగా వీరోచితంగా పోరాడారు. అడవులు, చిన్నచిన్న గూడేల నుండి కోయ, చెంచు మొదలైన వారందరినీ తరిగివేసే 'బిగ్స్ పథకాన్ని' తీవ్రంగా వ్యతిరేకించారు. ఉద్యమం కొత్తగా విస్తరిస్తున్న ప్రాంతాలలో ప్రజావుద్యమాలలోనూ, ప్రజాసంఘాలలోనూ ప్రముఖ పాత్ర నిర్వహించారు. రజాకార్లు, నైజాం పోలీసులు, నెహ్రూ సైన్యాలు జరిపిన అమానుష చిత్రహింసలకు ఎక్కువగా గురైంది బలైంది స్త్రీలే. విచక్షణను మరిచిన శత్రువులు స్త్రీలను చింతబరికలతో ఒళ్ళు చిట్లిపోయేటట్లు కొట్టేవారు. అవమానించేవారు. లైంగిక దాడులు చేశారు. తమ కండ్లముందే తమ ప్రాణంలో ప్రాణం అయిన కన్నబిడ్డలను హింసిస్తుంటే, తమ అన్నదమ్ముల, భర్తలను అరెస్టు చేసి కాల్చి చంపుతుంటే భరించారు.
ఆత్మగౌరవం కాపాడుకునేందుకు
శత్రువు దుర్మార్గం నుండి తప్పించుకునేందుకు, గెరిల్లా దళాలలో చేరేందుకు, రహస్య జీవితం గడిపేందుకు తమ ఇండ్లలో మగవారు వెళ్ళిపోయేవారు. పోలీసుల లూటీల తర్వాత మిగిలివున్న కొంపగోడు కాపాడుకోవలసిన బాధ్యత స్త్రీలపైనే పడింది. తమ అత్మగౌరవం కాపాడుకునేందుకు ఆ కిరాతక సైనికుల దౌర్జన్యానికి తమ ప్రాణాలు బలికాకుండా రక్షించుకునేందుకు వారు చూపిన పట్టుదల, ప్రతిఘటన, పోరాట పటిమ మనల్ని ఉత్తేజపరుస్తాయి. ఆనాడు వారిలో కలిగిన చైతన్య, నైతిక, సాంస్కృతిక జీవనంలో స్త్రీలలో కలిగిన సరికొత్త మార్పు... వీటన్నింటినీ తలచుకుంటే ఆర్థికంగా, సాంగికంగా అణగారిన మన స్త్రీ జాతిలో ఎంతటి విప్లవదీక్ష, శక్తి ఇమిడి వున్నాయ అని ఆశ్చర్యం కలుగుతుంది.
భూమిని నిలుపుకున్న వీరనారి ఐలమ్మ
విసునూరు దేశముఖ్ దురాక్రమణకు గురికాకుండా తన భూమిని నిలబెట్టుకునేందుకు మహిళలు తీవ్రంగా పోరాడారు. ఆంధ్రమహాసభ - కమ్యూనిస్టు పార్టీల సహకారంతో మొట్టమొదట పోరాడింది జనగాం తాలూకా, పాలకుర్తి గ్రామానికి చెందిన వీరనారి ఐలమ్మ. అంతేకాదు ఎన్ని కష్టాలు వచ్చిన పార్టీకి అండగా నిలబడాలని తన కొడుకులు, కూతుళ్ళను కూడా ప్రోత్సహించింది. భూస్వామ్య వ్యతిరేక పోరాటాలకు ఆ ఊళ్ళో జరిగే కార్యకలాపాలకు వారి ఇల్లే కేంద్రం. అది కేవలం ఆమె భూమి కోసం మాత్రమే జరిగిన పోరాటం కాదు. తెలంగాణ రైతు తన నేల కోసం జరిపిన పోరాటపు తొలిదశకు ఆమె చిహ్నం.
ఆ భూమి నాది
మిర్యాలగూడెం తాలూకా ముకుందాపురంలో ఓ షావుకారు, కుమ్మరి మట్టయ్యను భూమి స్వాధీనం చేయమని బలవంతం పెట్టాడు. మట్టయ్య అంగీకరించక పోవడంతో నెహ్రూ సైన్యాల సహకారంతో అతన్ని చిత్రహింసలు పెట్టి చివరికి చంపేశారు. కాని మట్టయ్య భార్య రణరంగంలోకి దూకింది. ఈ భూమిని ససేమిరా వదిలేది లేదంది. ఆమెపై పోలీసులు లైంగికదాడి చేశారు. అయినా ఆమె దిగిరాలేదు. ఆ గ్రామ ప్రజలందరినీ తమ భూమికోసం జరిగే పోరాటంలో సహకరించమని కదిలించి తమ భూమిని నిలుపుకొంది. ''అవును ఆ భూమి నాది'' ఇదే ఆమె మాట. ఇలా వాడపల్లి, కొండిపోలు, మొద్దులకుంట, వీరారం మహిళలు తమ భూమి కోసం వీరోచితంగా పోరాడారు. ఇవి కేవలం రికార్డు చేయబడిన వారి వివరాలు మాత్రమే. తెలంగాణ పోరాటంలో ఇలాంటి ఘటనలు వందలాదిగా జరిగాయి. వేలాదిగా స్త్రీలు పురుషులతో పాటు రంగంలో నిలబడి భూమికోసం, దక్కిన భూమిని నిలుపుకోవటం కోసం జరిగిన ప్రతి పోరాటంలో భాగస్వాములయ్యారు.
కూలి పెంపు కోసం...
వ్యవసాయ కార్మికులు చాలామంది స్త్రీలే. తాము కూడా కూలికి వెళ్ళి సంపాదించనిదే తమకు, తమ బిడ్డలకు పూట గడవడం అసాధ్యం. కేవలం మగవారి సంపాదనతో సంసారం జరగదు. అందుకే వ్యవసాయ కార్మిక సమ్మెలలోనూ, భూస్వాముల, దొరల గడీలలోని గిడ్డంగులలోనూ ధాన్యం స్వాధీనం చేసుకుని పంచుకొనటంలో స్త్రీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొండ్రపల్లి పరిసర ప్రాంతాల్లో కూలి రోజుకు రెండు లేక మూడు శేర్లుండేది. దాన్ని నాలుగు శేర్లకు పెంచాలని కూలీల సమ్మె జరిగింది. స్త్రీలు పెద్ద సంఖ్యలో కదిలారు. జెండాలు చేతబూని ప్రదర్శనలు చేశారు. భూస్వాములను లొంగదీసేందుకు, వారి ధాన్యపు కొట్లపై దాడిచేసి ధాన్యం స్వాధీనం చేసుకున్నారు. దాంతో భూస్వాములు లొంగి వచ్చి కూలి పెంచక తప్పలేదు. బీడీ ఆకు కోత కోసి బతికే గోదావరి తీర ప్రాంతాలో, పిండిప్రోలు, ఇల్లెందులో జరిగిన పోరాటంలో పెద్ద ఎత్తుల పాల్గొన్నారు. రాజాకార్లు, పోలీసులు కలిసి బాలేములు, పాత సూర్యాపేట, మల్లారెడ్డిగూడెం, దేవరుప్పల తదితర గ్రామాలపై దాడిచేసినపుడు వారిని వడిశలతో ప్రతిఘటిస్తున్న పురుషుల పక్కన నిలబడి వడిశలకి రాళ్ళందించారు. అలా సహకరిస్తున్న ఓ స్త్రీ మల్లారెడ్డి గూడెంలో జరిగిన పోలీసుల కాల్పుల్లో మరణించింది.
కోయపల్లె స్త్రీల సాహసం
గుండాల ప్రాంతంలోని కట్టుగూడెం అనే కోయపల్లెపై మిలటరీ దాడి చేసినప్పుడు, గూడెంలోని స్త్రీలు, పురుషులు కలిసి ప్రతిఘటించారు. వారు ఒక సుబేదారును, ముగ్గురు సైనికులను చంపి వారి ఆయుధాలను గుంజుకున్నారు. సైన్యం పారిపోయింది. తర్వాత సైన్యం పెద్ద బలగాన్ని సమీకరించుకుని మళ్ళీ గూడెంపై దాడికి వచ్చింది. గూడెం మొత్తం నట్టడివిలోకి వెళ్ళి తలదాచుకుంది. ఆ సమయంలో స్త్రీలు చూపిన ఓర్పు, సహనం, పట్టుదల మరవురానివి. చివరికి వాళ్ళ పిల్లలు ఏడిస్తే శత్రువులకు తమ ఉనికి తెలిసిపోతుందని ఏడవకుండా నోళ్ళు మూసేశారు. ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని తమలోవున్న పట్టుదల, చైతన్యం, దృఢత్వం నిపూపించారు.
చిత్రహింసలు పెట్టినా..
అప్పట్లో నేరెడ గ్రామం ఉద్యమానికి బలమైన కేంద్రం. గ్రామ మహిళలను రహస్యాలు చెప్పమని వేధించేవారు. ఒకసారి 70 మంది మహిళలను పట్టుకుని చింతబరికలతో బాదారు. ఆ కిరాతకులు అంతటితో ఆగలేదు. వారికి పైజమాలు తొడిగించి పాదాల వద్ద గట్టిగా కట్టేసి పైజమాలోపలికి తొండలను వదిలారు. ఆ సమయంలో వారి బాధ వర్ణనాతీతం. పైగా గాయాలపై కారం చల్లారు. ఐదు నెలల వరకు వారు అనారోగ్యం నుండి కోలుకోలేకపోయారు. మరొక రోజు మిలటరీ వాళ్ళు స్త్రీలను నిర్భంధించి వారి బిడ్డలకు పాలివ్వనీయలేదు. ఆ పిల్లలు తల్లిపాల కోసం ఒకటే ఏడుపు. అయినా వారెవ్వరూ ఒక్క రహస్యం కూడా బయటకు చెప్పలేదు.
ఇలాంటివారెందరో...
సూర్యాపేట తాలూకా పర్సాయపల్లికి చెందిన అచ్చమ్మ, నడిగడ్డ గ్రామం లచ్చమ్మ, రాజారం గ్రామానికి చెందిన జైనాబీ, ధర్మాపురం లంబాడీ తండాకు చెందిన మంగిలీ, ఖమ్మం జిల్లా సేద్దపల్లికి చెందిన మల్లికాంబ, హుజూర్ నగర్ తాలూకా రంగాపురంకు చెందిన ఎర్రమ్మ, పిండిప్రోలు గ్రామానికి చెందిన రాంబాయమ్మ, నందిగామ తాలూకా చొప్పకట్లవారి పాలెంకు చెందిన వెంకమ్మ... ఇలాంటి వారెందరో సాయుధ రైతాంగ పోరాటంలో తమ శక్తి మేరకు పాలుపంచుకున్నారు.
గెరిల్లా పోరాటంలో...
ఇంత వరకు తమ తమ ఇండ్లల్లో ఉంటూ స్త్రీలు తమని తాము రక్షించుకుంటూ, శత్రువునెట్లా ఎదురుదెబ్బ తీసిందో తెలుసుకున్నాం. చాలామంది స్త్రీలు తమను దళాల్లోకి తీసుకొమ్మని దళాలతో పాటు అడవులలోకి తీసుకుపొమ్మని పార్టీని కోరారు. అయితే పార్టీ కొద్ది మందిని మాత్రమే దళాలలోకి తీసుకుంది. అయినా రాజకీయంగా, మిలటరీరీత్యా విభిన్న కార్యక్రమాలను అడవులలోనూ, మైదానాలలోనూ నిర్వహించిన మహిళా కామ్రేడ్స్‌కు కొదవలేదు.
మల్లు స్వరాజ్యం...కామ్రేడ్ భీమిరెడ్డి నర్సింహారెడ్డి చెల్లెలు. 1945 నుండి యువతిగా ఉండగానే ఆమె ఆంధ్రమహాసభ కమ్యూనిస్టు పార్టీలలో చాలా ఉత్సాహంగా పని చేస్తోంది. ఆమె మంచి వక్త. చొరవగలది. స్త్రీలను పురుషులను ఆ మహత్తర పోరాట దినాలలో ఉద్యమాలలో, నిర్మాణ యుతంగా తీసుకువచ్చింది. పార్టీకి సర్వకాల కార్యకర్తగా నిజాం రజాకార్ల రోజులలోనూ ఆ తర్వాత గోదావరి అడవులలో మూడు సంవత్సరాలపాటు వుంది. ఆమె ముందు జోనల్ కార్యకర్తగావుండి, తర్వాత ప్రాంతీయ కమిటీ సభ్యురాలయింది. గుండాల కేంద్రంలో కోయలను ఉత్తేజపరచి వారికి నాయకత్వం వహించి వారిని పోరాటంలోకి దింపిందామె. ఆమె భూస్వాముల కుటుంబం నుండి వచ్చింది. అయినా అణగారిన ప్రజలు, వ్యవసాయ కార్మికులలోకి చొచ్చుకుపోయి వారిలో కలిసిపోయింది. అంతే కాకుండా ఆరుట్ల కమలమ్మ, నల్లగొండకు చెందిన రాములమ్మ, నల్లమల అడవులలో తుపాకి ధరించిన దళ సభ్యురాలు రంగమ్మ, చింతపాలెం పార్టీకార్యకర్త భార్య తిరుపతమ్మ, హుజూర్నగర్ మండల పార్టీలో పని చేసిన సావిత్రమ్మ, 1950లో దళంలో చేరిన నరసమ్మ ఇలా ఎందరో తుపాకి పట్టి రజాకార్లకు, నెహ్రూ పోలీసులకు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడారు.
కోయ స్త్రీల ముందంజ
గోదావరి తీర అడవులలో స్త్రీలు అందునా కోయ స్త్రీలు చాలామంది దళాలలో చేరి చురుకుగా పనిచేశారు. గెరిల్లా దళాలలో 9 మంది, కొరియర్లుగా 15 మంది, దళ ఉపనాయకులుగా ఇద్దరు, ఆర్గనైజర్లుగా ఇద్దరు, స్థానిక దళాలలో 10 మంది మహిళలున్నారు. వారిలో కొందరి పేర్లు నాగమ్మ, పాపక్క, లచ్చక్క, రామక్క, పుల్లక్క, భద్రక్క, అడివమ్మ, నారాయణమ్మ, వెంకటమ్మ, కోయ్య లచ్చక్క ఉన్నారు. అంతే కాకుండా ఆనాటి వివాహ వ్యవస్థలో మార్పుల కోసం కూడా కృషి చేశారు. వితంతు మహిళలు మళ్ళీ పెండ్లి చేసుకునేలా ప్రోత్సహించారు.
ఎన్నో త్యాగాలు
ఆమె ఓ మృతవీరుని భార్య. ఆమే కామ్రేడ్ పద్మ. ఆమె తన పిల్లవాడితో సహా మాతో పాటు ఓ రహస్య కార్యాలయంలో ఉంది. మా రహస్య నిర్మాణంలో సమర్ధుడైన ఒక కార్యకర్తతో అనుబంధాన్ని పెంచుకునేందుకు మేము ప్రోత్సహించాం. వారిద్దరూ అనురాగ బద్ధులయారు. వారికి వివాహం జరిగింది. పరిస్థితుల కారణంగా కార్యకర్తలను తగ్గించుకోవల్సి వచ్చింది. ఆమె భర్త అడవులకు వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు ఆమె నిండు గర్భిణి. ఆ బిడ్డను తనతో తీసుకెళితే తన అన్నలు తనను స్వీకరించరు. అందుకే ఆ బిడ్డను కని పిల్లలు లేనివారు ఎవరికైనా ఇచ్చివేసి తనను అన్నయ్యల దగ్గరకు వెళ్ళిపోయి పార్టీకి భారం తగ్గించమని సూచించను. ఆమె పార్టీ నిర్ణయాన్ని గౌరవించి కన్నబిడ్డను త్యాగం చేసింది. అప్పుడు ఆ తల్లి పడిన వేధన నన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంది. ఈ విధంగా ఎంతో మంది తల్లులు ఉద్యమం కోసం ఎన్నో త్యాగాలు చేశారు. వారందరికీ లాల్ సలామ్...
(సేకరణ: పుచ్చలపల్లి సుందరయ్యగారు రచించిన 'వీరతెలంగాణా విప్లవ పోరాటాలు - గుణపాఠాలు' పుస్తకం నుండి)