Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డెంగ్యూ జ్వరాలు బాగా వస్తున్నాయి. ఈ సంవత్సరం డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు ఎక్కువగా బాధిస్తున్నాయి. ఎక్కువగా పిల్లల్ని ఈ జ్వరాలు ఇబ్బంది పెడుతున్నాయి. డెంగ్యూ జ్వరాల వల్ల ప్లేట్లెట్స్ పడిపోతాయి. ప్లేట్లెట్స్ సంఖ్య క్రమంగా తగ్గడం వలన చివరకు మరణం సంభవిస్తుంది. అందుకే పేషెంట్‌కు ప్లేట్లెట్స్ ఎక్కిస్తారు. కానీ కొంత మంది పేషెంట్లు మామూలు జ్వరాల్ని కూడా డెంగ్యూ జ్వరంగా భావించి ప్లేట్లెట్స్ ఎక్కించమని అడుగుతూ ఉంటారు. కరోనా వైరస్ తన రూపాన్ని మార్చుకొని, మరింత బలం పుంజుకొని కొత్త వేరియంట్‌గా మార్పు చెందివస్తే మాత్రం ప్రమాదం తప్పదు. అయితే ఈలోపే మనం వాక్సినేషన్‌ను పూర్తి చేసుకోవాలి. పిల్లలకూ వ్యాక్సిన్లు ఇస్తామని డాక్టర్లు చెబుతున్నారు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు స్కూళ్ళు, హాస్టళ్ళు తెరవడం మూలంగా కోవిడ్ వ్యాపించే అవకాశాలున్నాయి. కాబట్టి ఎక్కువ ప్రికాషన్స్ తీసుకోవటం అవసరం. బయటికి వెళ్ళేటపుడు తప్పనిసరిగా మాస్క్ ధరించండి. ఎక్కువ జనాల మధ్యకు వెళ్ళకుండా ఉండటం మంచిది. ఇంట్లో ఉండి కళాత్మకంగా గడుపుదాం. జ్వరాల బారిన పడకుండా ఆరోగ్యంగా జీవిద్దాం.
చాక్లెట్లతో...
స్వాతంత్య్ర దినోత్సవం రోజు 'కిస్మీ' చాక్లెట్లు తెచ్చుకున్నాము. ఆరోజు జెండా ఎగుర వేశాక పిల్లలకు చాక్లెట్లు ఇవ్వాలి కదా! సరే మామూలుగా కూడా మా ఇంట్లో చాక్లెట్ల డబ్బాలు ఉంటాయి. మావారి దగ్గరకు వచ్చే పిల్లలు (పేషెంట్లు) ఏడుస్తూ చూడటానికి సహకరించకపోతే వాళ్ళకి చాక్లెట్లు ఇచ్చి స్టెత్‌తో చెక్ చేస్తుంటారు. అలా 'ఫెలీరో' హార్ట్ చాక్లెట్లు ఉన్నాయి. ఈరెండు రకాలతో నేను ఈరోజు ఊపిరి తిత్తుల్ని తయారు చేశాను. ఈ కరోనా కాలంలో అందరూ ఊపిరి సలపని ఊపిరితిత్తుల గురించే మాట్లాడుకుంటున్నారు. కరోనా వైరస్ ముఖ్యంగా ఊపిరితిత్తుల మీదనే ఎటాక్ చేస్తున్నది. మానవ దేహంలో ఉండే ఊపిరితిత్తుల జత. ఊపిరి తీసుకునే, వదిలే ప్రధాన అవయవము. వీటిలో రక్షిస్తూ పక్కటెముకలు ఉంటాయి. బయటి గాలి నుంచి ఆక్సిజన్ రక్త. ప్రవాహంలోకి పంపించడం, అక్కడి నుంచి కార్బన్ డాయాక్సైడును ఊపిరి వదలడం ద్వారా బయటకు పంపించడం ఊపిరితిత్తులు చేసే ప్రధానమైన పని అన్ని క్షీరదాలలోనూ, చాలా సరశేరుకాల్లోనూ ఊపిరితిత్తులు గుండెకు ఇరువైపులా ఉంటాయి. కుడి ఊపిరితిత్తి కొద్దిగా పెద్దదిగా ఉంటుంది. రెండు ఊపిరితిత్తులు కలిసి సుమారు 1.3 కేజీల బరువు ఉంటాయి. ఇవి రెండూ ఉర:కుహరంలో భద్రంగా ఉంటాయి. మానవులు మాట్లాడటానికి అవసరమయ్యే గాలిని ఉత్పత్తి చేసేవి కూడా ఊపిరితిత్తులే.
ఆకులతో...
రోడ్డుకిరువైపులా హరితహారంలో భాగంగా చెట్లు నాటారు. కొత్త సంవత్సరం మా ఇంటి ముందు కూడా టేకు, కానుగలతో పాటుగా మరో చెట్టు నాటారు. ఆ చెట్టు పేరు తెలీదు. చాలా పొడుగ్గా పెరిగింది. చిన్నచిన్న ఆకులు గుండ్రంగా ఉన్నాయి. ఆ ఆకుల్ని చూస్తే మందంగా ఉన్నాయి. కోసిన తర్వాత కూడా రెండు రోజులు వడలి పోకుండా ఉంటున్నాయి. కాబట్టి ఆ ఆకులతో ఏదైనా బొమ్మ చెయ్యాలనుకున్నాను. ఈ వారం ఊపిరితిత్తుల్ని చేయాలనుకున్నాను కాబట్టి పచ్చటి ఆకులతో ఊపిరితిత్తుల్ని చేశాను. పచ్చటి ప్రకృతిలో దొరికే స్వచ్ఛమైన గాలిని పీలిస్తే ఎలాంటి ఊపిరితిత్తుల సమస్యలుండవని అంటారు కదా! అందుకే పచ్చని ఆకుల ఊపిరితిత్తులు తయారయ్యాయి. ఊపిరితిత్తుల జబ్బుల్లో ప్రధానమైనవి న్యుమోనియా, ఊపిరితిత్తుల క్యాన్సర్. శ్వాస సంబంధ వ్యాధులు వచ్చినపుడు కణజాలాలు దెబ్బతింటాయి. వైరస్, బాక్టీరియాల దాడి మూలంగా ఏర్పడే సమస్యలు కొన్నయితే, సిగరెట్, పొగాకు వంటివి సేవించడం వల్ల ఏర్పడే ఇబ్బందులు మరికొన్ని. ధూమపానం వలన ఊపిరితిత్తులు చెడిపోయి పూర్తిగా పాడయిపోయి తీసివేయవలసిన పరిస్థితి కూడా వస్తుంది. కరోనా వైరస్ వచ్చిన తర్వాత శ్వాసకోశ వ్యవస్థను, ఊపిరితిత్తులను బలహీన పరుస్తుందనే విషయం తెలుసు కదా! అందుకే కోవిడ్ నుంచి కోలుకునేటప్పుడే శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేపట్టాలి. ఈ వ్యాయామాలను ఛెస్ట్ ఫిజియోధెరపీ అంటారు.
ఇంజక్షన్ సీసాలతో...
కోవిడ్ ఉధృతంగా వ్యాపిస్తున్నపుడు ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోయినపుడు, నేను కరోనా బొమ్మనూ ఊపిరితిత్తుల బొమ్మనూ తయారు చేశాను. గత సంవత్సర లాక్డౌన్లో కరోనా రావటానికి గల సమస్యలను, బొమ్మల రూపంలో తయారు చేశాను. వీటినన్నింటినీ మా ఆసుపత్రిలో ''కరోనా అవగాహనా సదస్సు'' నిర్వహించినపుడు ఎగ్జిబిషన్‌గా పెట్టాను. తర్వాత ఈ బొమ్మలను 'క్వారంటైన్' అనే పుస్తకంలో పొందుపరచాను. అలా ఆసుపత్రి వ్యర్థాలతో ఊపిరితిత్తుల బొమ్మ తయారైంది. ఫ్యాక్టరీల నుంచి వెలువడే పొగ, వాహనాల నుంచి వెలువడే పొగ వాయువుల వలన వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. ఇలాంటి వాతావరణంలో బతికే వాళ్ళకు ఎక్కువగా ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి. శుభ్రమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలి మనిషికి లభ్యమైనప్పుడు ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. కోవిడ్ బారిన పడిన రోగులకు సెకండÊ వేవ్‌లో ఆక్సిజన్ వినిమయం ఎక్కువగా జరిగింది. శ్వాస తీసుకోలేక పోవడం చాలా సర్వసాధారణ లక్షణంగా మారింది. అందువలన ఒక్కొక్క కోవిడ్ రోగికి ఆక్సిజన్ ఎక్కువ కావల్సి వచ్చింది.
చిక్కుడు గింజలతో...
మా ఇంట్లో గత సంవత్సరం చిక్కుడు చెట్టు మొలిచింది. దానిని మూడో అంతస్తు దాకా లాకుంటే మా బాల్కనీలో కొచ్చి కాయలు వేసింది. ఎన్ని కిలోల కాయలు కాసిందో లెక్కలేదు. అది కూడా లావుపాటి విత్తనాలు, రుచికరమైన తోలుతో ఉన్నాయి. చిక్కుడు చెట్టు పీకేసిన తర్వాత తీగలకు బోలెడు ఎండిపోయిన కాయలున్నాయి. వాటినన్నిటినీ వలిచి ఎండబెట్టాను. దాదాపు 4,5 కేజీల విత్తనాలు వచ్చాయి. ఆ చిక్కుడు గింజలతో ఊపిరితిత్తుల్ని చేశాను. వాయు నాళాన్ని గట్టి చెక్కముక్కలతో అలంకరించాను. మా ఇంటి దగ్గర ఫొటో ఫ్రేములు కట్టే షాపు ఉన్నది. ఆ షాపులో ప్రేములు కట్టాక కత్తిరించి పారబోసే చెక్కముక్కలున్నాయి. షాపతను వాటిని నాకు పంపాడు. ఏదైనా బొమ్మలో ఉపయోగపడతాయని ఆలోచించాడు. అందుకే ఆ చెక్కముక్కల్ని వాడాను. రెండు ఊపిరితిత్తులకు చిక్కుడు గింజల్ని వాడాను. కోవిడ్ రోగులకు ఆక్సిజన్ వినిమయం తగ్గాలంటే శ్వాస నిలిపి ఉంచే వ్యాయామాలను చేయాలి.
పువ్వులతో...
మా ఇంట్లో ఒక్క కుండీలో పెట్టిన శంకుపూలు ఇల్లంతా వనంగా మార్చాయి. ఇందులో నీలం రంగు, తెలుపురంగు ఉంటాయి. ఇంకా నీలం రంగులో ముద్దశంకుపూలు కూడా ఉన్నాయి. దీన్ని నీలం రంగు అనకూడదేమో నీలం, వయొలెట్ రెండు రంగులూ కలిసి ఉంటాయి. నాకైతే ఈ పూలతో నెమలినీ, కృష్ణుడ్నీ చేయాలనిపిస్తుంది. కానీ ప్రస్తుతం ఊపిరితిత్తుల్ని తయారు చేశాను. కొన్ని రకాల పూలపుప్పొడులు ఊపిరితిత్తులకు నచ్చవు. అందువల్ల దగ్గు, ఆయాసం కలగజేస్తాయి. పూల వలన ఊపిరితిత్తులకు ఇబ్బంది ఉంటుందని తెలియజేయడానికే ఇలా బొమ్మను చేశాను. ఉబ్బసం చాలా సాధారణంగా ప్రజల్లో ఉండే జబ్బు. దీని వలన ఊపిరి ఆడక చాలా ఇబ్బందులు పడతారు. వాయు నాళాలు మూసుకుపోవడం వలన గాలి సరిగా లోపలికి పోదు.