Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతీయ మహిళలు శక్తికి ప్రతిరూపాలు. ఎన్నో రంగాలలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. అడ్డంకులను ఎదుర్కొంటున్నారు. లోతుగా పరిశీలిస్తే సమాజంలో నెలకొన్న అసమానతలను, వివక్షను, అవినీతిని రూపు మాపడం కోసం కృషి చేస్తున్న వారు ఎందరో ఉన్నారు. సమజానికి అంకితభావంతో, నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారు. అనేక సామాజిక దుర్మార్గాలను మార్చడంలో మహిళా కార్యకర్తలు గణనీయమైన పాత్ర పోషిస్తున్నారు. భావితరాలకు ఆశాకిరణాలుగా ఉన్నారు. వారిలో కొందరి గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం...
అరుణ రారు
అవినీతిపై పోరాడటానికీ, ప్రభుత్వ పారదర్శక పాలనకై విశేషమైన కృషి చేస్తూ ప్రసిద్ధి చెందారు. తల్లిదండ్రుల ప్రభావం ఈమెపై చాలా ఉంది. సమాజంపై అవగాహన కల్పించడంలో తండ్రి ప్రధాన పాత్ర పోసిస్తే... స్వతంత్ర భావాలతో జీవించడం తల్లి నుండి నేర్చుకున్నారు. పాండిచ్చేరిలోని అరబిందో ఆశ్రమం, ఢిల్లీలోని ఇంద్రప్రస్థ కళాశాలలో చదువుకున్నారు. తర్వాత ఉపాధ్యాయ వృత్తిని ప్రారంభించారు. అయితే సామాజిక సేవకురాలిగా మారాలనే లక్ష్యంతో ఉపాధ్యాయ వృత్తిని వదులుకున్నారు. ఆమె 1967లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్(ఐఏఎస్) పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. కార్మికులు, రైతుల సాధికారత కోసం, సామాజిక, అట్టడుగు ప్రజల కోసం పని చేసే 'మజ్దూర్ కిసాన్ శక్తి సంఘం' నాయకురాలిగా ప్రసిద్ధి చెందారు. 2005లో సమాచార హక్కు చట్టం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. సమాజానికి చేసిన సేవలకుగాను ఈమెకు 2000లో కమ్యూనిటీ లీడర్షిప్ ద్వారా రామన్ మెగసెసే అవార్డు, 2010లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, అకాడెమియా, మేనేజ్మెంట్లో ఎక్సలెన్స్ ద్వారా లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అవార్డులను అందుకున్నారు. 2011లో టైమ్ మ్యాగజైన్ ద్వారా 'ప్రపంచవ్యాప్తంగా 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా ఈమె నిలిచారు.
మేధా పాట్కర్
సామాజిక సంస్కర్త, రాజకీయ నాయకురాలైన మేధా పాట్కర్ ముంబైలో జన్మించారు. చాలా చిన్న వయసులోనే ప్రజా సేవపై ఆసక్తి పెంచుకున్నారు. ట్రేడ్ యూనియన్ నాయకుడి కుమార్తెగా ఉన్న ఆమె వెనుకబడిన వారు ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. వారికి సేవ చేయాల్సిన అవసరం ఉందని భావించారు. మేధా తండ్రి స్వాతంత్య్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఆమె తల్లి స్వదర్లో సభ్యురాలు. ఆర్థికంగా బలహీనమైన మహిళలకు సహాయం చేయడానికి ఏర్పడిన సంస్థ ఇది. వారు చదువుకోవడానికి సహాయపడుతుంది. మేధా టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ నుండి సోషల్ వర్క్‌లో ఎంఏ పూర్తి చేశారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్‌లోని గిరిజన, రైతు సంఘాలలో పూర్తి కాలం పని చేయడం మొదలుపెట్టారు. దానికోసం తన పీహెచ్‌డీని విడిచిపెట్టేశారు. గుజరాత్ నదులను, ప్రజలను కాపాడే ఉద్యమమైన 'నర్మదా బచావో ఆందోళన్' వ్యవస్థాపక సభ్యురాలిగా ఆమె గుర్తింపు పొందారు. 2014లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా ఆమెకు 8.9 శాతం ఓట్లు సాధించారు. అయితే మార్చి 28, 2015న ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
కిరణ్ బేడీ
పంజాబ్‌లోని పవిత్ర నగరమైన అమత్‌సర్‌లో పుట్టి పెరిగారు కిరణ్ బేడి. ఆమె ఓ సామాజిక కార్యకర్త. అలాగే దేశంలోనే మొదటి మహిళా అధికారి. ఆమె తన శాఖకు పూర్తి నమ్మకంతో సేవ చేయడమే కాకుండా అనేక సామాజిక కార్యక్రమాలకు ఎంతో సహాయం చేశారు. ఓ మాజీ టెన్నిస్ క్రీడాకారిణిగా, అమత్సర్కు చెందిన బహుముఖ ప్రజ్ఞాశాలి సామాజిక కార్యకర్తగానే కాక ఆమె సేవ సమయంలో పశ్చిమ ఢిల్లీలో మహిళలపై నేరాల సంఖ్యను తగ్గించిన ఘనత కూడా ఈమెదే. తీహార్ జైల్ బాధ్యతలు చూసే సమయంలో అనేక సంస్కరణలను ప్రవేశపెట్టారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. 1994లో రామన్ మెగసెసే అవార్డును అందుకున్నారు. 2003లో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌కి పోలీసు సలహాదారుగా నియమితులైన మొదటి భారతీయ మహిళ కూడా ఈమెనే. సామాజిక కార్యక్రమాలు, రచనలపై దష్టి పెట్టడానికి ఆమె 2007లో తన వృత్తికి రాజీనామా చేశారు. తర్వాత అనేక పుస్తకాలు రాశారు. ప్రస్తుతం 'ఇండియా విజన్ ఫౌండేషన్' నడుపుతున్నారు.
అరుంధతీ రారు
రచయిత్రి, నటి, రాజకీయ కార్యకర్త. అవార్డు పొందిన నవల 'ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్' (1997), పర్యావరణ, మానవ హక్కుల కార్యకర్తగా ఆమె ప్రసిద్ధి చెందారు. అరుంధతి తండ్రి బెంగాలీ టీ ప్లాంటర్, తల్లి సిరియన్ సంతతికి చెందిన క్రిస్టియన్. క్రైస్తవ మహిళలు తమ తండ్రుల ఎస్టేట్లలో సమాన వాటాను పొందే హక్కును విజయవంతంగా దాఖలు చేయడం ద్వారా భారతదేశ వారసత్వ చట్టాలను సవాలు చేశారు. వాస్తుశిల్పిగా శిక్షణ పొందినప్పటికీ అరుంధతికి డిజైన్‌పై పెద్దగా ఆసక్తి లేదు. నర్మదా డ్యామ్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మేధా పాట్కర్‌తో కలిసి ప్రచారం చేశారు. ఆ డ్యామ్ ఐదు లక్షల మందిని నిర్వాసితులను చేస్తుంది. ఈ డ్యామ్ వల్ల సాగునీరు, తాగునీరు కూడా అందదు. నిర్వాసితులకు పరిహారం లేదు. అందుకే డ్యామ్‌కు వ్యతిరేకంగా మానవ హక్కుల కోసం ఆమె బహిరంగంగా చేసిన వాదనకు గుర్తింపుగా అరుంధతికి 2002లో 'లన్నన్ కల్చరల్ ఫ్రీడమ్' అవార్డు, 2004లో 'సిడ్నీ శాంతి బహుమతి', 2006లో 'ఇండియన్ అకాడమీ ఆఫ్ లెటర్స్' నుండి సాహిత్య అకాడమీ అవార్డు లభించాయి.
ఇరోమ్ షర్మిల
''ఐరన్ లేడీ ఆఫ్ మణిపూర్''గా ప్రసిద్ధి చెందిన ఇరోమ్ షర్మిల సంఘర్షణలతో కూడిన ఈశాన్య రాష్ట్రంలో అత్యంత గుర్తింపు పొందిన వ్యక్తి. ఈమె ఇంటర్ పూర్తిచేసి తన రాష్ట్రంలో ''ప్రజా ప్రతిఘటనలకు చిహ్నం''గా మారారు. ఇరోమ్‌పై తండ్రి ప్రభావం చాలా వుంది. నవంబర్ 2, 2000న, ''మలోమ్ ఊచకోత'' తర్వాత ఆమె నిరాహార దీక్షను ప్రారంభిచారు. అక్కడ 10 మంది మరణించారు. అది ఆమెపై తీవ్ర ప్రభావం చూపింది. 500 వారాలకు పైగా ఆహారం, నీటిని తీసుకోకుండా ఆమె ''ప్రపంచంలోనే ఎక్కువ రోజులు హంగర్ స్ట్రైక్ చేసిన'' వ్యక్తిగా గుర్తింపు పొందారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2014న ఎంఎస్ఎన్ పోల్ ద్వారా ఆమె భారతదేశపు అగ్ర మహిళా చిహ్నంగా ఎన్నికయ్యారు. ఇరోమ్ నీరు, ఆహారం తీసుకోనప్పటికీ ప్రభుత్వం ఆమెకు బలవంతంగా ఆహారం ఇస్తూనే ఉంది. ప్రతి సంవత్సరం ఆమె ఆత్మహత్యాయత్నం ఆరోపణలపై అరెస్టు చేయబడుతోంది. ఆమె ఈ ఉద్యమం ప్రారంభించి 16 సంవత్సరాలు అయ్యింది. కానీ ఆమె సంకల్పం ఇంకా విచ్ఛిన్నం కాలేదు. తూర్పు భారతదేశంలోని ఏడు రాష్ట్రాలలో సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టాన్ని భారత ప్రభుత్వం రద్దు చేసినప్పుడు మాత్రమే తాను తింటానని ఆమె ప్రతిజ్ఞ చేశారు.
మానసి ప్రధాన్
2013లో రాణి లక్ష్మీబాయి స్త్రీ శక్తి పురస్కారం అందుకున్న రచయిత, కవి. మహిళల హక్కుల కోసం పోరాడినందుకు ఆమె ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఒడిషా రాష్ట్రంలో ఓ పేద కుటుంబంలో జన్మించిన ఆమె ఆ ప్రాంతానికి 15 కి.మీ. దూరంలో ఉండే ఏకైక పాఠశాలకు వెళ్ళి చదుకున్నారు. తన గ్రామం నుండి న్యాయ పట్టా పొందిన మొదటి మహిళ. యునైటెడ్ నేషన్ వారి యుఎన్ ఉమెన్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ నుండి 2011లో 'అత్యుత్తమ మహిళా అవార్డు'తో సహా అనేక ప్రశంసలను ఆమె అందుకున్నారు. మహిళల కోసం స్థాపించిన నిర్భయ వాహిని వ్యవస్థాపకురాలు. భారతదేశంలో మహిళలపై హింసను అంతం చేయడానికి దేశవ్యాప్త ఉద్యమం అయిన 'హానర్ ఫర్ ఉమెన్ నేషనల్ క్యాంపెయిన్'కు నాయకత్వం వహిస్తున్నారు. అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సెన్సార్ బోర్డ్) ప్యానెల్లో కూడా పనిచేస్తున్నారు. ఇంకా అంతర్జాతీయ మహిళా మండలి (డబ్ల్యూడబ్ల్యూఓ), జాతీయ మహిళా కమిషన్ విచారణ కమిటీలో కూడా సభ్యురాలు.
లక్ష్మి అగర్వాల్
యాసిడ్ దాడులను ఆపండి అంటూ ప్రచారం చేసే ఓ టీవీ హౌస్ట్ ఈమె. ఆమె యాసిడ్ దాడి నుండి బయటపడింది, యాసిడ్ దాడి బాధితుల హక్కుల కోసం తన గొంతు విప్పారు. ప్రేమను తిరస్కరించినందుకు 2005లో 15 సంవత్సరాల వయసులో 32 ఏండ్ల వ్యక్తి ఆమెపై యాసిడ్ దాడి చేశాడు. హిందుస్తాన్ టైమ్స్ వారు రాసిన యాసిడ్ దాడి బాధితులపై కథనలో ఈమె గురించి కూడా ప్రచురితమైనది. యాసిడ్ అమ్మకాలను అరికట్టడానికి కోసం 27,000 సంతకాలను సేకరించి సుప్రీంకోర్టుకు వెళ్ళి యాసిడ్ దాడులకు వ్యతిరేకంగా వాదించింది. ఆమె పిటిషన్ ద్వారా యాసిడ్ విక్రయాలను నియంత్రించాలని సుప్రీం కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. యాసిడ్ దాడుల విచారణను సులభతరం చేయడానికి పార్లమెంట్ ఆదేశించింది. భారతదేశంలో యాసిడ్ దాడుల నుండి బయటపడిన వారికి సహాయం చేయడానికి అంకితమైన 'ఛాన్వ్ ఫౌండేషన్'కు ఈమె డైరెక్టర్. యుఎస్ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా ద్వారా 2014 అంతర్జాతీయ స్థాయిలో ధైర్యం కలిగిన మహిళగా అవార్డును అందుకున్నారు. ఆమె 'ఇండియన్ ఆఫ్ ది ఇయర్'గా కూడా ఎంపికయ్యారు. అమ్మాయిలందరూ బాహ్య రూపాన్ని కాకుండా వారి అంతర్గత అందాన్ని ప్రతిబింబించేలా ప్రోత్సహిస్తున్నారు.
- సలీమ