Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా కారణంగా దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది. ఇటీవలె 'సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ' విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. కరోనా ముందు వరకు 14.8 శాతం ఉన్న నిరుద్యోగ రేటు ప్రస్తుతం 23.5 శాతానికి చేరుకుంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉద్యోగం వెతుక్కోవడానికి బదులు.. ఏదైనా వ్యాపారం చేసుకోవడం మంచిదన్న ఆలోచనలో కొంతమంది ఉన్నారు. మరికొందరేమో తాము ఎప్పట్నుంచో అనుకుంటోన్న వ్యాపార లక్ష్యాలకు ఇప్పుడు పదును పెడుతున్నారు. మరి, మీరూ ఇదే ఆలోచనలో ఉన్నారా? అయితే ప్రతికూల పరిస్థితుల్లోనూ తమ హవా కొనసాగించే ఇలాంటి కొన్ని బిజినెస్‌లపై మీ దష్టి పెట్టమంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం...
డెలివరీ సర్వీస్
ఈ కరోనా కాలంలో సరుకు రవాణా సంస్థలకు గిరాకీ బాగా పెరిగిందని చెప్పచ్చు. ఆన్లైన్లో ఆర్డరివ్వడం, తాము కోరుకున్న చోటికి కావాల్సిన వస్తువులు, ఆహార పదార్థాల్ని తెప్పించుకోవడంతో.. నేరుగా షాపుకెళ్లి కొనే వారి కంటే ఇంటి వద్దకే డెలివరీ చేయించుకునే వారే పెరిగిపోయారు. నిజానికి ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లోనూ లాభాల బాట పట్టిన అతి తక్కువ వ్యాపారాల్లో ఈ డెలివరీ సర్వీసెస్ కూడా ఒకటని చెప్పచ్చు. మరి మీకు వ్యాపారం చేయాలన్న ఆలోచన ఉంటే ఇదే రంగాన్ని ఎంచుకోవచ్చు. ఈ వ్యాపారంలో మీరు సొంతంగా ఆయా వస్తువుల్ని రవాణా చేయడంతో పాటు పెద్ద పెద్ద ఈ-కామర్స్ సంస్థలతోనూ అనుసంధానం కావచ్చు. ఇందుకోసం పురుషుల్నే కాకుండా మహిళల్నీ నియమించుకుంటే.. వారికీ ఉపాధి కల్పించిన వారవుతారు. పైగా ఎలాంటి ప్రతికూల పరిస్థితులొచ్చినా ఈ వ్యాపారం కొనసాగుతూనే ఉంటుందని, తద్వారా బోలెడంత డబ్బూ ఆర్జించవచ్చని ఈ కరోనా కాలంలో నిరూపించబడింది. మీరూ దీని గురించి ఆలోచించవచ్చు.
నైపుణ్యాలు పంచుకోండి
మీకు ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువా... ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యమిస్తారా..? మానసిక సమస్యల్ని పరిష్కరించే నైపుణ్యాలు మీలో ఉన్నాయా? ఇలా సంపూర్ణ ఆరోగ్యం విషయంలో తలెత్తే సందేహాల్ని నివత్తి చేయగలరా? అయితే అదే మీ బిజినెస్‌కు మంచి ఐడియా. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో అందరూ ఆరోగ్యంపై దష్టి సారిస్తున్నారు. ఇప్పటిదాకా నిర్లక్ష్యం చేసిన అనారోగ్యాలపై శ్రద్ధ పెడుతూ వాటి నుంచి విముక్తి పొందడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి తరుణంలో మీలో ఉన్న నైపుణ్యాల్ని బట్టి 'హెల్త్ ఎక్స్పర్ట్ అడ్వైజర్'గా మారారంటే ఇక మీకు తిరుగుండదు. ఇందుకోసం మీరు సోషల్ మీడియా పేజీల్ని, సొంతంగా యాప్స్, వెబ్‌సైట్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. లేదంటే ఇది వరకే ఉన్న నిపుణుల కమ్యూనిటీలో చేరచ్చు. ఒకవేళ మీరే సొంతంగా ఈ వ్యాపారం ప్రారంభిస్తే.. బ్యూటీ, ఫ్యాషన్.. వంటి విభిన్న రంగాల్లో సలహాలిచ్చే అడ్వైజర్స్ని మీ కంపెనీలో చేర్చుకొని మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకోవచ్చు. ఏదేమైనా మీరిచ్చే సలహాలు అవతలి వారి సమస్యల్ని పరిష్కరించేందుకు ఎంత వరకు ఉపయోగపడు తున్నాయన్న దాన్ని బట్టే మీకు ఆదరణ పెరుగుతుంది.
క్లీన్ అండ్ గ్రీన్‌గా
కరోనాతో చాలామంది క్లీన్ అండ్ గ్రీన్ సూత్రాన్ని పాటిస్తున్నారు. అంటే.. ఇంట్లోని ప్రతి వస్తువును శుభ్రం చేసుకోవడం, పరిసరాలను నీట్‌గా ఉంచడం వంటివి చేస్తున్నారు. అయితే ఇది ఎవరికి వారు చేసుకోవచ్చు. మరి అదే.. పెద్ద పెద్ద భవనాలు, ఆఫీసులు, అపార్ట్మెంట్స్.. వంటివి క్రిమి రహితం చేయాల్సి వస్తే.. అందుకు అందరూ సంప్రదించేది 'కమర్షియల్ క్లీనింగ్ సర్వీసెస్'నే! పరిశుభ్రతకు పెద్ద పీట వేస్తోన్న ప్రస్తుత తరుణంలో ఇదీ ఓ చక్కటి బిజినెస్ ఐడియానే అంటున్నారు నిపుణులు. అయితే 'పారిశుద్ధ్యమా.. మేమా?' అని నామోషీగా ఫీలవకుండా ముందుకెళ్తే ఈ వ్యాపారం కాసులు పండిస్తుందంటున్నారు. అయితే దీనికోసం మీరు కొనే మెషినరీ కోసం ముందే తగిన డబ్బు పోగేసుకోవడం, నాణ్యమైన వాటినే కొనుగోలు చేయడం వల్ల వ్యాపారంలో త్వరలోనే పుంజుకునే అవకాశం ఉంటుంది. అలాగే మీ వద్ద పనిచేసే ఉద్యోగులు తగిన నాణ్యతా ప్రమాణాలు, కనీస జాగ్రత్తలు పాటించేలా చూడడమూ మీ బాధ్యత అని మర్చిపోవద్దు.
వ్యాపారాలకు వారధిగా...
టెక్నాలజీ అభివద్ధి చెందుతోన్న ఈ కాలంలో ఏదైనా వస్తువును అమ్మాలన్నా, ఓ వ్యాపారాన్ని ప్రమోట్ చేయాలన్నా.. అంతా సోషల్ మీడియా ద్వారానే క్షణాల్లో జరిగిపోతోంది. పైగా సోషల్ మీడియా మేనేజ్మెంట్కి ప్రస్తుతం ఆదరణ కూడా విపరీతంగా ఉంది. అందుకే మీకు ఆసక్తి ఉంటే ఇలా ఇతరుల వ్యాపారాల్ని, ఉత్పత్తుల్ని ప్రమోట్ చేసే, మేనేజ్ చేసే వారధిగానూ మీరు మారొచ్చంటున్నారు నిపుణులు. దీనికోసం ఓ 'సోషల్ మీడియా మేనేజ్మెంట్ కంపెనీ'ని ప్రారంభించమంటున్నారు. ఈ ఐడియా వినడానికి బాగానే ఉంటుంది కానీ.. అమలు చేయడమే కష్టం. ఎందుకంటే మీరు రిక్రూట్ చేసుకునే సోషల్ మీడియా మేనేజర్స్‌కు కంటెంట్ క్రియేషన్, గ్రాఫిక్ డిజైనింగ్, వీడియోలు రూపొందించడం.. వంటి ఎన్నో అంశాలపై మంచి పట్టుండాలి.. అది జరగాలంటే వాళ్లకు ఎక్కువ మొత్తంలో జీతాలివ్వడానికీ వెనకాడకూడదు. అలాగే మీ కంపెనీని ప్రమోట్ చేసుకోవడమూ ముఖ్యమే... ఇవన్నీ సఫలం కావాలంటే మీ దగ్గర ఎక్కువ మొత్తంలో పెట్టుబడి ఉండాలి. అలాగని మొదట్లోనే ఎక్కువ మొత్తంలో లాభాలు ఆశించకుండా కాస్త ఓపిక వహిస్తే ఇక భవిష్యత్తులో మీరే ఇతర కంపెనీలకు పోటీదారు కావచ్చు.