Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆమె వయసు 68 ఏండ్లు... బాధ్యతల నుండి విరమణ పొంది విశ్రాంతి తీసుకోవాలని మనసు కోరుకునే వయసు. కానీ ఆమె మాత్రం వంద మంది పిల్లలకు తల్లిగా మారింది. అది కూడా సమాజం అంటరాని వారిగా భావించే ఎయిడ్స్ బాధితలకు... ఆమే మంగళ్ షా. హెచ్ఐవీ/ఎయిడ్స్ బారిన పడిన 100 మంది పిల్లలను అక్కున చేర్చుకుని వారి యోగక్షేమాలు చూస్తున్నారు. బంధువుల చేత వెలివేయబడిన వారిని మళ్ళీ నిలబెట్టేందుకు కృషి చేస్తున్న ఆమె ప్రయాణం గురించి నేటి మానవిలో...
అరవై ఎనిమిదేండ్ల మంగళ్ షా మంగల్తాయిగా ప్రసిద్ధి చెందారు. మానవత్వం మూర్తిభవించిన ఈమె పేదలు, నిరాశ్రయులైన పిల్లలు, మహిళల కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. దాదాపు రెండు దశాబ్దాలుగా హెచ్ఐవీ పాజిటివ్ పిల్లలకు విశేషమైన సేవలు అందిస్తూ వారి సంరక్షణా బాధ్యతలు చూస్తున్నారు. 100 మంది పిల్లలకు గాడ్ మదర్ నిలిచారు.
ఓ సాహసమే...
ఒక మహిళగా ఉండి ఇరవై ఏండ్ల నుండి సమాజం అంటరాని వారికిగా చూసే హెచ్ఐవి పాజిటివ్ పిల్లలతో కలిసి పనిచేస్తున్నారంటే ఆమెది ఓ సాహసోపేతమైన ప్రయత్నమే అని చెప్పుకోవాలి. కానీ ఆమె సేవ చేయాలనే ఆమె ప్రగాఢమైన కోరిక, దృఢ సంకల్పమే ఆమెతో ఈ పని చేయిస్తుంది. ''మీరు ప్రజలను నిజంగా నమ్మితే వారిని ప్రేమించడానికి మీకు సమయం చాలదు'' అనే మదర్ థెరిస్సా మాటలను షా బలంగా నమ్ముతారు.
సహాయం చేయడానికి
వివాహం చేసుకుని అత్తగారింటికి వచ్చిన తర్వాత కుటుంబంలోని ఇతర మహిళలు పూజలు, పునస్కారాలు అంటూ తమ సమయాన్ని కేటాయించినప్పుడు 17 ఏండ్ల షా మాత్రం అవసరమైన వారికి సహాయం చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపారు. వికలాంగులు, గర్భిణీలు, హెచ్ఐవి పాజిటివ్ సోకిన మహిళా సెక్స్ వర్కర్లకు సహాయం చేయడానికి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళేవారు. ఈ మహిళలకు మహిళలకు కుటుంబం నుండి ఎలాంటి సహకారం లేదని ఆమె అర్థం చేసుకున్నారు.
సెక్స్ వర్కర్లకు అవగాహన
ఆదరణకు నోచుకోని వారిని చూసుకోవాలని, తన వంతు సహాయం చేయాలని షా నిర్ణయించుకున్నారు. మొదట్లో ఆమె ఆసుపత్రిలో అవసరమైన రోగులకు ఇంట్లో వండిన ఆహారాన్ని అందించడం ప్రారంభించారు. ఆ త్వరలో హెచ్ఐవి/ఎయిడ్స్ బారిన పడిన మహిళా సెక్స్ వర్కర్ల కోసం పని చేయవలసిన అవసరాన్ని గుర్తించారు. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో అత్యంత దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్న మహిళలు వీరు. దాదాపు 35 సంవత్సరాల కిందట మహిళా సెక్స్ వర్కర్లలో హెచ్ఐవి/ఎయిడ్స్ గురించి అవగాహన కల్పించడానికి షా ప్రయాణం ప్రారంభించారు. అందరూ అత్యధికంగా అసహ్యించుకుంటూ ఓ ప్రాణాంతకమైన వ్యాధిగా దీన్ని పరిగణిస్తున్న సమయంలో షా ఈ సాహసం చేశారు.
అనాథలైన అమ్మాయిలు
ఒకరోజు ఆమె తన కుమార్తె డింపుల్లో కలిసి పంధర్పూర్లోని సెక్స్ వర్కర్లకు హెచ్ఐవి/ఎయిడ్స్ గురించి అవగాహన కల్పించడానికి వెళ్ళారు. అక్కడ రెండున్నర, ఒకటిన్నర సంవత్సరాల వయసు గల ఇద్దరు ఆడపిల్లల గురించి వారికి తెలిసింది. ఎయిడ్స్ సోకి తల్లిదండ్రులు చనిపోతే ఆ పిల్లల్ని ఆవుల షెడ్డులో వదిలేసి వెళ్ళిపోయారు. ఆ అమ్మాయిల వల్ల కుటుంబం పరువు పోవడమే కాకుండా వారి వల్ల మొత్తం కుటుంబానికి వ్యాధి సంక్రమించే ప్రమాదం వుందని వారి బంధువులు భయపడ్డారు. ఆ అమ్మాయిలను చూసుకోవడానికి గ్రామస్తులను ఒప్పించడంలో షా చేసిన ప్రయత్నం ఫలించలేదు. దాంతో ఆ పిల్లల్ని తమ ఇంటికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.
పలావి ప్రారంభించి
హెచ్ఐవీ పాజిటివ్ సోకిన ఆ పిల్లల్ని ఉంచేందుకు ఓ అనాథాశ్రమం కోసం ప్రయత్నించారు. జిల్లాలోగానీ మొత్తం మహారాష్ట్రలో గానీ అలాంటి పిల్లలు ఉండేందుకు ఓ ఇల్లు లేదని గ్రహించారు. షా అలాంటి పిల్లలకు ఆశ్రయం, సంరక్షణ అందించాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు పాజిటివ్ పిల్లల కోసం ఓ ఇంటిని స్వయంగా నిర్మించారు. ఆ సంరక్షణ గృహానికి 'పాలవి' అని పేరు పెట్టారు. అంటే మరాఠీలో 'మొక్క కొత్త ఆకులు' అని అర్థం. ''2001 నుండి మేము వారి సంరక్షణ, పునరావాసం కోసం పని చేస్తున్నాము. ఈ పిల్లలతో నాకు చాలా లోతైన బంధం ఏర్పడింది. ఈ పిల్లలకు తల్లి సంరక్షణ అవసరం అని నేను భావిస్తున్నాను. పిల్లలు సంతోషంగా ఉండాలి. ప్రతి క్షణం ఆనందంగా గడపాలి. మేము పలావి వద్ద అదే పని చేస్తున్నాము'' అని షా అంటున్నారు.
రాష్ట్రంలోనే ఏకైక సంస్థ
ప్రాజెక్ట్ పలావి... అనేది ప్రభా హీరా ప్రతిష్టాన్ కింద మహారాష్ట్రలో నడుస్తున్న ఓ సంస్థ. మహారాష్ట్ర హెచ్ఐవి/ఎయిడ్స్ వ్యాప్తిలో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఈ వ్యాధితో జీవించే వ్యక్తులకు పరిష్కారం చూపడంలో, వ్యవస్థ మార్పుపై దృష్టి సారించిన ఏకైక సంస్థ మహారాష్ట్ర వ్యాప్తంగా పలావి ఒక్కటే. ప్రస్తుతం పలావికి వ్యక్తిగత, స్థానిక విరాళాలు, అంతర్జాతీయ సంస్థల ద్వారా నిధుల సమకూరుతున్నాయి. అలాగే మిలాప్, ఇతర క్రౌడ్‌ఫండింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పలావి తన పని కోసం నిధులను సేకరిస్తోంది.
బహుళ ఆలోచనలతో...
గత 20 సంవత్సరాలలో పలావి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేసింది. అత్యంత ప్రమాదంలో ఉన్న ప్రజలను కాపాడటమే లక్ష్యంగా చేసుకోవడానికి బహుళ ఆలోచనలను ఆవిష్కరించింది. వివిధ వర్గాల ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. అనాథ పిల్లలు, హెచ్ఐవి/ఎయిడ్స్‌తో బాధపడుతున్న ఇతర వ్యక్తులకు నివాస సంరక్షణ సేవలను అందిస్తోంది. ఇది హెచ్ఐవి పాజిటివ్ అనాథ పిల్లలకు సైన్ బోర్డ్‌గా ఉపయోగపడింది.
తీవ్రమైన సవాళ్ళు
షా చెబుతున్న ప్రకారం ఈ సంస్థ ప్రధాన దృష్టి ఆ పిల్లల హక్కులు, సమానత్వం, పౌరసతాన్ని నిర్ధారించడం. 50 మంది ఉద్యోగులతో పాటు 50 మందికి పైగా వాలంటీర్ల సహాయంతో పలావి హెచ్ఐవి పాజిటివ్ పిల్లలకు, వ్యక్తులకు చికిత్స, సంరక్షణ సేవల అవసరాలని చూసుకుంటుంది. సమాజం అంటరాని వారిగా చూసే ఈ అట్టడుగు వర్గాల వ్యక్తుల కోసం ఓ ఏజెన్సీని నిర్మించింది. వీరి కుటుంబ సభ్యులంతా సామాజికంగా, ఆర్థిక తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ''మా ప్రతి చర్య ద్వారా మేము పిల్లవాడిని ప్రేమిస్తున్నామనే భావనను ఇస్తాము. మేము చూపుతున్న ప్రేమ కారణంగా నిర్లక్ష్యానికి గురౌతున్నామనే భావన వారిలో ఉండకపోగా జీవించాలనే కోరిక పెరుగుతుంది. అలాంటి భావన వారిలో కల్పించడమే మా లక్ష్యం'' అంటున్నారు షా.
ఇద్దరితో మొదలై...
మొదటి నుండి సంరక్షణ గృహంలో హెచ్ఐవి పాజిటివ్ పిల్లల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల ఉంది. 2001లో మేము ఇద్దరు పిల్లలతో దీన్ని ప్రారంభించాము. 2005లో 15 మంది పిల్లలను సంరక్షణ గృహంలో చేర్చుకున్నాము. 2006-2010 మధ్య ఆ సంఖ్య 69కి పెరిగింది. 2011-2015 సమయంలో సంఖ్య 88కి పెరిగింది. 2018లో 112 మంది పిల్లలు ఉన్నారు. 2019-2020 నాటికి 110 మంది పిల్లలు మా వద్ద ఉన్నారు. ప్రస్తుతం పలావి 125 హెచ్ఐవి పాజిటివ్ పిల్లలను చూసుకుంటోంది. భవిష్యత్తులో 500 అనాథ పిల్లలకు వసతి కల్పించగలిగే ''మాతృవన్''ను రూపొందించాలని సంస్థ యోచిస్తోంది. ఇది ఈ పిల్లలను స్వయం ఆధారిత, స్వతంత్రంగా ఆదాయాన్ని సంపాదించుకునేలా చేయడానికి కూడా ఆలోచిస్తోంది.
- మంగళ్ షా
- సలీమ