Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒకప్పుడు ఇంటింటికీ వెళ్ళి ట్యూషన్లు చెప్పింది.. ఇప్పుడు ఎడ్టెక్ స్టార్టప్ ట్యూటర్కాబిన్ను నిర్మించింది. అసమానలతో పోరాడింది. తన గ్రామంలో చదువు పూర్తి చేసుకున్న మొదటి అమ్మాయిగా చరిత్ర సృష్టించింది. ఆమే నేహా ముజావడియా... అమ్మాయిలు సామాజిక అభద్రత నుండి బయటపడాలని బలంగా కోరుకుంటున్న ఆమె విజయగాథ గురించి మనమూ తెలుసుకుందాం..
మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ జిల్లాలోని మెల్ఖేడా గ్రామానికి చెందిన నేహా ముజావడియా తన గ్రామం నుండి చదువు పూర్తి చేసిన మొదటి అమ్మాయి. అయితే ఆమె ఆశయం కేవలం ఉన్నత విద్యను అభ్యసించడానికి మాత్రమే పరిమితం కాలేదు. చిన్న పల్లెటూరిలో పుట్టి పెరిగిన ఆ అమ్మాయి సామాజిక అసమానతలను నుండి విముక్తి పొందాలని, ఏదో ఒక రోజు సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాలని కోరుకుంది. వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న మహిళలకు చదువుకోవడం, వ్యాపారం చేయడం లాంటి చాలా వరకు కలలుగానే మిగిలిపోతుంటాయి. కానీ నేహా మాత్రం అవాంతరాలన్నింటినీ విజయవంతంగా ఎదిరించి నేడు చాలా మందికి స్ఫూర్తిగా నిలిచింది.
వెయ్యి మంది ఉపాధ్యాయులతో...
2018లో ప్రారంభమైన నేహా ట్యూబర్కాబిన్ ప్రాథమిక, మాధ్యమిక, కళాశాల స్థాయి నుండి మొదలుకొని అన్ని రకాల పోటీ పరీక్షల వరకు అన్ని వయసుల విద్యార్థులను సిద్ధం చేయడంలో ముందు భాగంలో వుంది. ఈ రోజు ప్లాట్‌ఫారమ్‌లో దాదాపు 1,000 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఢిల్లీ, ఆగ్రా, ముంబై మొదలైన ప్రాంతాలో ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు.
విద్యకు దూరమౌతున్నారు
గ్రామాల్లోని అమ్మాయిలకు చిన్న వమసులోనే వివాహం చేసే పద్ధతిని విచ్ఛిన్నం చేయాలని నేహా నిర్ణయించుకుంది. ఆర్థిక సమస్యలు, నిరక్షరాస్యత వల్ల విద్యార్ధులు.. ముఖ్యంగా బాలికలు ఉన్నత విద్య అభ్యసించలేకపోతున్నారు. ఉజ్జయినిలోని విక్రమ్ విశ్వవిద్యాలయం నుండి బీఏ (ఎకనామిక్స్) పూర్తి చేసిన తర్వాత నేహా సంప్రదాయ సంకెళ్ళను తెంచుకుని ఎంబీఏ చేసేందుకు ఇండోర్‌కు వెళ్లాలనుకుంది. ''ఇండోర్‌కు వెళ్లడానికి నా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. నా గ్రామంలో బాలికలకు విద్య ప్రాధాన్యమైన విషయం కాదు. ప్రపంచం మొత్తం మారిపోతున్నా ఈ సమయంలో కూడా చదువుకోడానికి నేను చాలా కష్టపడ్డాను'' అని నేహా చెప్పింది. పెండ్లి చేసి పంపించాల్సిన అమ్మాయికి ఒంటరిగా నగరానికి పంపిస్తే సమాజం నుండి ఎన్నో విమర్శలు ఎదుర్కోవలసి వస్తుందని ఆ తల్లిదండ్రులు భయం.
అడ్డంకులు అధిగమించి
అడ్డంకులు ఎన్ని ఎదురైనా నేహా తన పట్టు వదలలేదు. ఇండోర్‌లో ఉన్నత విద్య చేసేందుకు తల్లిదండ్రులను ఎలాగోలా ఒప్పించింది. 2009లో ఇండోర్‌కు వెళ్లి పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఓ ప్రైవేట్ సంస్థలో ఏసీఏ కోర్సు కోసం చేరింది. ''నేను అడ్మిషన్ కోసం రోజుల తరబడి తిరిగాను. గతంలో నేను చేసిన డిగ్రీ కారణంగా నేను చాలా సంస్థలలో అర్హత పొందలేకపోయాను. సీట్లు పరిమితంగా ఉన్నాయి. ఏసీఏ తర్వాత నేను ఎంబీఏ ప్రవేశానికి అర్హత పొంది తదుపరి చదువుల కోసం ఇండోర్‌లోని క్రిస్టియన్ కళాశాలలో చేరాను'' అంటూ ఆనాటి రోజులను నేహా గుర్తు చేసుకుంది.
నగర జీవితం
మాస్టర్స్ చదువుతున్నప్పుడు నేహా నగరంలో ఉండే ఏ అవకాశాన్ని కోల్పోవాలనుకోలేదు. వీలైనంత ఎక్కువ జ్ఞానాన్ని పొందాలని నిర్ణయించుకుంది. అయితే దీనికి ఆర్థిక సమస్య అడ్డుగా నిలబడింది. తల్లిదండ్రులపై ఆధారపడి వారికి భారం కాకూడదని ఇంటింటికి వెళ్ళి ట్యూషన్లు తీసుకోవడం ప్రారంభించింది. ''నేను వీలైనన్ని ఎక్కువ తరగతులు తీసుకున్నాను. నా ఖర్చులను చాలా వరకు తగ్గించుకుని డబ్బును ఆదా చేసాను. ఉదయాన్నే ఇంటి నుండి బయలుదేరి ఎంబీఏ క్లాసులకు హాజరు కావడం, ఆ తర్వాత ఇంటింటికీ ట్యూషన్ తీసుకోవడం, ఇంటి పనిని నిర్వహించడం, చదువుకోవడం ఇది నా రోజువారి దినచర్య. కొన్నిసార్లు రోజుకు 17 గంటలకు పైగా పని చేసేదాన్ని'' అంటుంది నేహా.
అతితక్కువ కాలంలోనే...
ఈ విధంగా ఎంతో కష్టపడి ఆర్థిక సమస్యల నుండి బయటపడడం ప్రారంభించింది. అతి తక్కువ కాలంలోనే నేహాకు ఇదే వ్యాపార ప్రతిపాదనగా మారింది. తల్లిదండ్రుల నుండి ట్యూషన్ల కోసం అధిక మొత్తంలో ఎలా వసూలు చేస్తున్నారో నేహా దగ్గరగా చూసింది. ఈ సమయంలో నేహా తన వ్యాపార ఆలోచనపై దృష్టి పెట్టింది. అయితే ఆర్థిక సమస్యలు లేకుండా తనపై తనకు నమ్మకం వచ్చి, వ్యాపారం ప్రారంభించగలిగే నైపుణ్యం పొందిన తర్వాతనే అందులోకి దిగాలని భావించింది. అందుకే దాన్ని ప్రారంభించే ముందు నాలుగు సంవత్సరాల పాటు రెగ్యులర్ ట్యూషన్లు కొనసాగించింది.
సొంత గుర్తింపుకోసం...
ఓపక్క నేహాను గ్రామానికి తిరిగి రావాలని ఆమె తల్లితండ్రులు ఒత్తిడి చేస్తున్నారు. ఎందుకంటే ఆమె మాస్టర్స్ పూర్తి చేసే దశలో ఉంది. ''నేను ఇండోర్‌లో ఉండడానికి మరో సంవత్సరం సమయం ఇవ్వమని నా తల్లిదండ్రులను బతిమలాడుకున్నాను. నేను నా సొంత గుర్తింపును సృష్టించాలనుకున్నాను. ఎదుగుదల లేని గ్రామంలో నా జీవితం ముగించకూడదు. అయితే నాలో ఎక్కడో భయం వుంది... కానీ ఎప్పుడూ నిరాశ పడలేదు. ఏదో ఒకవిధంగా నా కుటుంబాన్ని ఒప్పించగలిగాను'' అని నేహా చెప్పింది.
ట్యూటర్కాబిన్ను ప్రారంభించి
అతి తక్కువ బడ్జెట్‌తో నేహా 2018లో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ఓ సాధారణ వెబ్‌సైట్‌ను నిర్మించి ట్యూషన్ల కోసం ఒకే ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించడానికి ట్యూటర్లను నియమించడం, ఇంటర్వ్యూ చేయడం, శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది. ప్రారంభంలో 10-15 మంది ట్యూటర్లతో మొదలుపెట్టింది. తర్వాత ఆమె కోర్ టీమ్‌లో భాగమయ్యింది. వ్యక్తిగత ఖ్యాతి, కృషి వల్ల ఆమెకు అప్పటికే డిమాండ్ ఉంది. ''మొదట్లో మాకు ఇండోర్ సమీప ప్రాంతాల నుండి 150 మంది ట్యూటర్లు, 10-15 మంది విద్యార్థులు ఉన్నారు. మేము నర్సరీ స్థాయి నుండి కళాశాల వరకు తరగతులు అందించాము. చాలా మంది హోమ్ ట్యూషన్ చెప్పమని కోరేవారు'' అంటుంది నేహా.
పది మందితో మొదలుపెట్టి
కరోనా మహమ్మారి వల్ల ఆన్లైన్లో కార్యకలాపాలు పెరిగిపోయాయి. డిజిటల్ పరిజ్ఞానం గురించి పరిమిత వనరులు, పరిజ్ఞానం ఉన్నప్పటికీ ఆమె చుట్టుపక్కల వ్యక్తుల నుండి నేర్చుకుంది. అలా 2018లో కేవలం 10 మంది ట్యూటర్లతో మొదలుపెట్టి 2019లో 800 మంది టీచర్ల స్థాయికి చేరుకున్నారు. ఈరోజు 1,000తో ఢిల్లీ, ఆగ్రా, ముంబై మొదలైన ప్రాంతాలకు ఆన్లైన్ పరిధిని విస్తరించడంతో పాటు ఇండోర్, భోపాల్‌లో ఆఫ్‌లైన్ తరగతులు తీసుకుంటున్నారు.
ప్రత్యేక ఫీచర్లతో...
ప్లాట్‌ఫారమ్‌లో పూర్తి, పార్ట్‌టైమ్ ఉపాధ్యాయులు ఉన్నారు. వారు ఆన్బోర్డ్కి ముందు విస్తృత శిక్షణ పొందారు. ప్రతి విద్యార్థికి క్షుణ్ణంగా పరీక్ష, విశ్లేషణల ఉపయోగం తర్వాత ఒక ట్యూటర్ని కేటాయిస్తారు. అయితే ఫీజులు మాడ్యూల్స్ కోర్సుల ప్రకారం రూపొందించబడ్డాయి. ప్లాట్‌ఫారమ్ విద్యార్థుల పనితీరును అంచనా వేయడానికి తర్వాత వారి లోపాలపై పని చేయడానికి ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. లైవ్ క్లాసులు, రికార్డింగ్ సెషన్లు, ఏ సమయంలోనైనా ప్రశ్నోత్తరాలు, కెరీర్ కౌన్సెలింగ్, తల్లిదండ్రుల కోసం ప్రత్యేక లాగిన్ వంటి ఫీచర్లు అందిస్తున్నారు. అంతేకాదు మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులకు ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు, ఉచిత విద్యను అందిస్తుంది. నేహా ప్రతిరోజూ ప్లాట్‌ఫారమ్‌ను వీలైనంత సమర్ధవంతంగా చేయడానికి ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ పెట్టడానికి ప్రయత్నిస్తుంది.
భాషా పరమైన సమస్యలను ఛేదించేందుకు
హిందీ మీడియం విద్యార్థులను చిన్నచూపు చూసే సమాజం మనది. అలాగే వారు దీర్ఘకాలిక సమస్యను ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే వీరు భాషాపరమైన సంకెళ్లను తొలగించి నాణ్యమైన విద్యపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నేహా భావించింది. పరిమిత సదుపాయాలతో చిన్న పట్టణం నుండి వచ్చినా నేహా విజయవంతమైన ప్రయాణాన్ని ఎవ్వరూ ఆపలేకపోయారు. కుబెరన్ హౌస్ ద్వారా టాప్ 60 స్టార్టప్‌లలో గుర్తింపు పొందింది. ప్రస్తుతం నిధుల సేకరణ కోసం పెట్టుబడిదారులతో తుది చర్చలు జరుపుతోంది. 15 మంది సభ్యుల ఈ స్టార్టప్ 20-21 ఆర్థిక సంవత్సరంలో 22 లక్షల రూపాయల ఆదాయాన్ని పొందగలిగింది. అలాగే ఈ సంవత్సరం చివరి నాటికి 2,50,000 మంది విద్యార్థుల నమోదును లక్ష్యంగా పెట్టుకుంది. ఇంకా ట్యూటర్ బేస్ 5,000కి విస్తరించాలని యోచిస్తోంది.
సామాజిక అభద్రత నుండి విముక్తి
ఇప్పుడు నేహా తన గ్రామంలోనే కాదు చుట్టుపక్కల ఉన్న చాలా మంది అమ్మాయిలకు రోల్ మోడల్. తన స్వగ్రామాన్ని సందర్శించినపుడు ఒక అమ్మాయికి ఎంపిక చేసుకునే స్వేచ్ఛనివ్వడం కోసం ఆమె చుట్టూ ఉన్న వ్యక్తులు ఎంతగా కష్టపడతారో, అవహేళన చేస్తారో గుర్తు చేసుకుంటుంది. ''నేను అమ్మాయిలను సామాజిక అభద్రత నుండి విముక్తి చేయమని ప్రోత్సహించాలనుకుంటున్నాను. తన జీవితాన్ని తాను ఎంపిక చేసుకునే విధంగా విద్య, నైపుణ్యాలతో తనను తాను సన్నద్ధం చేసుకోవాలనుకుంటున్నాను'' అని నేహా అంటున్నారు.
చదువే ఆయుధం
ఓ చిన్న గ్రామం నుండి వచ్చిన నేను తల్లిదండ్రులు, విద్యార్థుల బాధను అర్థం చేసుకున్నాను. విద్య అత్యంత శక్తివంతమైన ఆయుధం. పేదరికం నుండి బయటపడటానికి ఇదే సహాయపడుతుంది. నేను విద్యార్థులను వారి లక్ష్యాలను సాధించడానికి అన్ని విధాలుగా ప్రేరేపించి సహాయపడగలనని ఆశిస్తున్నాను. ముఖ్యంగా మనం ఆంగ్ల భాష ఉన్నతమైనదిగా భావించే సమాజంలో జీవిస్తున్నాము. హిందీ-మీడియం నేపథ్యం వల్ల నేను చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. కానీ నేను ఎప్పుడూ నా నైపుణ్యాన్ని తక్కువ అంచనా వేసుకోలేదు. కాబట్టే ఈరోజు గర్వించదగిన మహిళా వ్యాపారిగా మారగలిగానే.
- నేహా