Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆరోగ్యాన్ని పెంపొందించే విటమిన్లు, మినరల్స్ దోసకాయలో పుష్కలంగా లభిస్తాయి. శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను ఆరోగ్యకర స్థాయిలో ఉంచే హార్మోన్ దోసలో ఉందని పరిశోధనల్లో తేలింది. శరీరంలో కొవ్వు పదార్థాలను తగ్గించే స్టేరాల్ అనే మూలకం దోసకాయలో ఉంటుంది. ఎందుకంటే, ఇది అధిక మొత్తంలో పోషకాలను కలిగి ఉండి, తక్కువ క్యాలరీలను అందిస్తుంది. అటువంటి దోసకాయతో చేసే కొన్ని వంటకాలు తెలుసుకుందాం...
దోసకాయ బరడా
కావాల్సిన పదార్ధాలు: దోసకాయ - ఒకటి (పెద్దది), శనగపప్పు - అరగ్లాసు, పెసర పప్పు - అరగ్లాసు, ధనియాలు - రెండు స్పూన్లు, ఉప్పు - తగినంత, ఎండుమిర్చి - ఆరు (ఎక్కువ కారం తినేవారు ఇంకొన్ని వేసుకోవచ్చు), పోపు దినుసులు, నూనె,కరివేపాకు.
తయారు చేసే విధానం: దోసకాయను పొట్టు తీసి చిన్న ముక్కలుగా కోసుకోవాలి. మందపాటి బాండీలో నూనె నాలుగు స్పూన్లు వేసి వేడెక్కక అందులో పోపుదినుసులు, కరివేపాకు వేసి అవి కొంచం వేగాక తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. అవి మగ్గేలోపు మిక్సీలో శనగపప్పు, పెసరపప్పు, ఎండుమిర్చి, ధనియాలు వేసి కొంచం బరకగా పొడి చేసుకోవాలి. ముక్కలు మగ్గిన తర్వాత వాటిలో గ్రైండ్ చేసిన పొడి వేయాలి. ఉప్పు రుచికి సరిపడా వేసి అన్ని బాగా కలియబెట్టాలి. మూడు నిమిషాలు ఉంచి దించేయాలి. ఇష్టమున్నవారు కొత్తిమీర చల్లుకోవచ్చు. ఇది వేడి వేడి అన్నంలోకి బావుంటుంది.
పల్లి పచ్చడి
కావాల్సిన పదార్ధాలు: దోసకాయ - ఒకటి (చిన్నది), పల్లీలు - గుప్పెడు, చింతపండు గుజ్జు - ఒక టేబుల్ స్పూన్, ఉప్పు - తగినంత, పచ్చిమిర్చి - ఐదు, పసుపు - ఒక స్పూన్లు, కొత్తిమీర - కొంచం, పోపు దినుసులు, నూనె.
తయారు చేసే విధానం: దోసకాయ పొట్టు తీసి, సన్నగా ముక్కలు కోసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో పచ్చి మిర్చి, పసుపు, ఉప్పు, కొత్తిమీర, చింతపండు గుజ్జు, పల్లీలు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆతర్వాత అందులోనే తరిగిన దోసకాయ ముక్కలు, వేసి గ్రైండ్ చేయాలి. (మరి మెత్తగా చేయకూడదు). తర్వాత కొంచం నూనెలో పోపుదినుసులు, ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి.
పొడి కూర
కావాల్సిన పదార్ధాలు: దోసకాయ - ఒకటి (పెద్దది), కందిపప్పు - కప్పు, పోపుదినుసులు, నూనె, కరివేపాకు, ఇంగువ, కారం, పసుపు, ఉప్పు.
తయారు చేసే విధానం: ముందుగా కంది పప్పుని ఒక అరగంట నీళ్ళల్లో నాన పెట్టుకోవాలి. తర్వాత దోసకాయని పొట్టు తీయకుండా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. కంది పప్పు కొంచం నానిన తర్వాత దోసకాయ ముక్కలు, కంది పప్పు కలిపి కొంచం నీళ్లు పోసి విడిగా ఉడికించుకోవాలి. (కంది పప్పు బద్ధ లాగానే ఉండాలి. దానిని మెత్తగా పెనప కూడదు). కందిపప్పు, దోసకాయ ముక్కలు మెత్తబడ్డాక పొయ్యి మీద నుంచి దించి చల్లారాక బాండీలో నూనె వేసి వేడెక్కక పోపుదినుసులు, కరి వేపాకు, ఇంగువ వేయాలి. అవి వేగాక ఉడికించి పెట్టుకున్న దోసకాయ, కందిపప్పు కొంచం చేత్తో పిండి (అంటే నీరు లేకుండా) బాండీలో వేయాలి. సన్న సెగ మీద కలుపుతూ ఉండాలి. ఐదు నిమిషాల తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలపాలి. ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బావుంటుంది.
దోసకాయ పులుసు
కావల్సిన పదార్థాలు: దోసకాయ - ఒకటి (చిన్నది), కంది పప్పు - ఒక చిన్న గ్లాసు, ఉప్పు, కారం, పసుపు - సరిపడా, చింతపండు - కొద్దిగా, బెల్లం - కొద్దిగా, పచ్చి మిర్చి, కొత్తిమీర.
తయారు చేసే విధానం: ముందుగా దోసకాయని పొడవుగా చెక్కు తీయకుండా ముక్కలు చేసుకోవాలి. తర్వాత మందపాటి గిన్నెలో దోసకాయ ముక్కలు, పచ్చిమిర్చిని కూడా కొంచెం పొడవుగా చీరి నీళ్లు పోసి ఉడికించాలి. అందులోనే చింతపండు రసం, బెల్లం వేయాలి. ఇవి ఉడికేలోపు కుక్కర్లో కంది పప్పును మెత్తగా ఉడికించుకోవాలి. ముక్కలు మెత్త బడ్డాక అందులో ఉడికించుకున్న పప్పుని బాగా మెత్తగా రుబ్బుకోవాలి. అది కొంచం మరుగుతుండగా ఉప్పు, కారం, పసుపు వేయాలి. దించేముందు పోపు వేసి పైనుంచి కొత్తిమీర చల్లుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన పులుసు రెడీ.