Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోవిడ్-19 వ్యాప్తి ఎలా ఉన్నా వాక్సినేషన్ మాత్రం అనుకున్న క్రమంలో సాగిపోతున్నది. వందశాతం వాక్సినేషన్ పూర్తయితే మనకు కొంత భయం తగ్గుతుంది. పిల్లలకు కూడా వాక్సిన్లు వేయటానికి భారత్ బయోటెక్ సంస్థ తయారవుతున్నది. పిల్లలకు వాక్సిన్లు వేసే వరకు వారిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇప్పుడు స్కూళ్ళు, హాస్టళ్ళు తెరిచేశారు కాబట్టి స్కూళ్ళకు పంపేవారు ఎన్నో జాగ్రత్తలను తీసుకోవాలి. పిల్లలకూ జాగ్రత్తలను నేర్పించాలి. పిల్లలకు రకరకాల జబ్బులే కాకుండా వేధించడానికి కొంతమంది మానవమృగాలు కూడా ఉంటున్నాయి. బాక్టీరియా, వైరస్ల నుండి రక్షించుకోవడమే కాదు ఇలాంటి మానవమృగాల నుండి కూడా రక్షించుకోవాలి. తల్లిదండ్రులు పిల్లల పెంపకం పట్ల శ్రద్ధ వహించాలి. తల్లిదండ్రులు ఉద్యోగ బాధ్యతలతో ఊపిరి సలపక ఆయాలమీదనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. వీళ్ళలా ఆఫీసులకు వెళ్ళగానే ఆ పసిబిడ్డల్ని అడుక్కునే వాళ్ళకు అద్దెకు కూడా ఇస్తున్నట్టు మనం వార్తల్లో చూస్తున్నాం. పిల్లలు జాతీయ సంపద. మన పిల్లలగానే కాకుండా సమాజానికి మంచి పౌరులనిచ్చే బాధ్యత మన మీదనే ఉందని తల్లిదండ్రులు గుర్తించాలి.
గుల్మొహర్ పూలతో...
గుల్ మొహర్ పూలు రోడ్డు కిరువైపులా ఎర్రటి ఎరుపు రంగు, పసుపురంగు పూలతో ప్రయాణీకులకు కనువిందు చేస్తాయి. ఈ పూలు పూసినంత కాలం రోడ్లన్నీ ఎరుపు, పసుపు మిశ్రమాలతో ఇంద్ర ధనుస్సును పూయి స్తుంటాయి. ఈ చెట్టు శాస్త్రీయనామం 'డెలోనిక్స్ రీజియా''. ఇది ఫాబేసి కుటుంబానికి చెందిన మొక్క. మేము చదువుకునేటప్పుడు ఈచెట్టు కాలేజీలోనే ఉండేది. ఫ్యాబేసి కుటుంబానికి ఉదాహరణగా డిసెక్షన్ చేస్తూ డెలోనిక్స్ రీజియా రీజియా అంటూ పాటలు పాడుకునే వాళ్ళం. దీన్ని తెలుగులో తురాయి చెట్టు అంటారు. ఈ పూలలోని కేసరాలు వంపు తిరిగి ఉండటం వల్ల పిల్లలు కోడిపుంజులాట అని ఆడుతూ ఉంటారు. ఈ చెట్ల ఆకులు చిన్నవిగా ఉండి సమాంతరంగా అమరి ఉంటాయి. మా బాబుతో వాళ్ళ కాలేజీకి వెళ్ళినపుడు రెండు, మూడు పువ్వులు కోసుకొచ్చాను. మా అపార్టుమెంటులో ఉన్న నూరు వరహాల పూల గుత్తి ఒకటి కోసుకున్నాను. ఈ రెండు పూలనూ కలిపి ఈ అమ్మాయిని సృష్టించాను. నేనీరోజు పసిపిల్లలపై జరుగుతున్న లైంగికదాడులను ఖండిస్తూ పూల బాలలను తయారు చేస్తున్నాను. పువ్వుల్లాంటి పసిమొగ్గలను కొందరు రాక్షసులు మొగ్గలోనే చిదిమేస్తున్నారు. అటువంటి వారికి కఠిన శిక్షలు పడాలని నేను కూడా అందరితో పాటు కోరుకుంటున్నాను. అందమైన పువ్వులు కూడా తమ రక్షణ కోసం ముళ్ళను ఏర్పాటు చేసుకున్నట్టుగా ఆడపిల్లలు కూడా రక్షణ పెంచుకోవాలి. పువ్వును ముట్టుకుంటే ముల్లులా గుచ్చాలి.
బంతిపూలు, కనకాంబరాలతో...
చాలా సింపుల్‌గా బంతిపూలు, కనకాంబరాలతో కలిపి ఒక బాలికను రూపొందించాను. ఇంకా వీటిలో వాటర్ క్యాన్లకు వచ్చే మూతలు, రింగులు కూడా వాడాను. మొదట ఈ రింగుల్ని గుండ్రని తలలా అమర్చాను. తర్వాత చేతులు, గౌను లాగా రింగులు అమర్చాను. ఈ గుండ్రని రింగుల్లో బంతిపూలు పెట్టాను. గౌనుకు కుచ్చుల్లాగా వాటర్ క్యాన్ మూతల్ని అమర్చాను. తలపైభాగాన కనకాంబరాల మాలను చుట్టాను. చెవులకు లోలాకులుగా ఎండిపోయిన పీస్లిల్లీ కేసరాలను పెట్టాను. కళ్ళకు కూడా దానిమ్మ పిందెల్ని ఎండాక వాడాను. పెదవులుగా కొబ్బరి పిందెల రెక్కల్ని పెట్టాను. చాలా చక్కగా అమిరాయి. చేతుల కోసం ఎండు పుల్లిల్ని వాడాను. గౌనులో రంగుల కోసం అన్ని రకాల పువ్వుల్ని, రెక్కల్ని పెట్టాను. పూల ప్రింటున్న గౌనులా అందంగా ఉంది. ఈ అందాల బొమ్మ ఎంతందంగా ఉందో. చిన్నారి చైత్ర కూడా ఇలాగే ఎర్రటి డ్రెస్‌లో అందంగా ఉంది. ఒక మానవమృగం ఆ చిన్నిపాపను ఛిద్రం చేసి చంపేసింది. ఇలాంటి క్రూర పనులకు పాల్పడ్డ నిందుతులకు కఠిన శిక్షణలు పడాలి. వాళ్ళ సమర్థిస్తూ మరింత మందిని ప్రోత్సమించేలా మాట్లాడుతున్నారు. తప్పు చేసిన వారే కాకుండా తప్పును సమర్థించే వారు కూడా శిక్షార్హులే.
గులాబీబాల
గులాబీ పువ్వంటి పాపాయి అంటారు కదా! గులాబీ పూలతో, గన్నేరు పూలతో, శంకుపూలతో కలిపి ఒక చిట్టి తల్లిని చేశాను. ఈ పూల పాపాయి ఎంత బాగుందో చూడండి. చిట్టి గులాబీలను తీసుకున్నాను. అలాగే పింక్ రంగు గన్నేరు పూలను కూడా తీసుకున్నాను. గన్నేరు పూలలో ఎరుపు, పింక్, పసుపు వంటి ఎన్నో రంగులుంటాయి. గన్నేరు చెట్లు చాలా త్వరగా పెరుగుతాయి. పొదల్లా ఉంటాయి. ఆకులు జతగా లేదా గుచ్ఛాలుగా ఉంటాయి. ప్రతి శాఖ ముగింపు వద్ద పూలు సమూహాలుగా పూస్తాయి. ఇవి పల్లెల్లో ప్రతి ఇంటి ముందూ కనిపిస్తాయి. ఇందులో ఒంటి రెక్క గన్నేరు, ముద్ద గన్నేరు అని రెండు రకాల పూలు పూస్తాయి. వీటి శాస్త్రీయ నామం ''నీరియం''. స్త్రీ మరియు శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ అధ్యయనం వల్ల పిల్లలపై లైంగిక వేధింపులు 53.22 శాతం జరగుతున్నాయని తెలుస్తున్నది. 50 శాతం లైంగిక దాడులు బాలలకు బాగా తెలిసిన వారి వల్లే జరుగుతున్నాయంటున్నారు.
నూరు వరహాల పూలతో...
ఈ పూలతో నూరు వరహాల అమ్మాయిని తయారు చేశాను. ఈ నూరు వరహాల చెట్టు 10 అడుగుల ఎత్తు వరకు పెరిగి పొదలా తయారవుతుంది. అందానికి అలంకరణకీ పెట్టింది పేరు. ఈ చెట్టు 'రూబిమేసి' కుటుంబానికి చెందినది. ''ఇక్సోరా కాక్సీనియా'' అని దీని శాస్త్రీయనామం. ఒక్కోక్క గుత్తికి నూరు కంటే ఎక్కువే పూలు పూస్తాయి. ఇవి ఎరుపు, తెలుపు, మిక్స్డ్ రంగుల్లో వుంటాయి. అలంకరణ కోసం ఉద్యానవనాలలో పెంచుతారు. మొగ్గలుగా ఉన్నా, విచ్చినా కూడా అందంగా ఉంటాయి. నేనీ పూలను రెండు గుత్తులు కోసుకొచ్చుకున్నాను. ఈ పూలతో నూరు వరహాల అమ్మాయిని తయారు చేశాను. బాలికలపై జరుగుతున్న లైంగికదాడులకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. కాశ్మీరు, గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్ ఘటనల తర్వాత లైంగిక దాడుల నిందితులను కఠినంగా శిక్షించాలన్న డిమాండ్లు బాగా వినిపిస్తున్నాయి.
పచ్చగన్నేరు, తెల్లగన్నేరు పూలతో...
పచ్చగన్నేరు పూలు ఆకులు కనిపించనంతగా కాస్తాయి. తెల్ల గన్నేరు పూల మధ్యలో పసుపు గీత ఉంటుంది. ఈ పూల రెక్కలు కాస్త గట్టిగా ఉండటం వల్ల వెంటనే వాడిపోవు. మూడు కోణాలతో కత్తిరించినట్టున్న ఆకులు, మొక్కజొన్న తొక్కు, మెట్ట తామర ఆకులు, గులాబీ రెక్కలు అన్నీ కలిపితే ఈ పూల పాపాయి తయారయింది. పిల్లల వయసు, అర్థం చేసుకునే సామర్ధ్యాన్ని బట్టి వారికి గుడ్‌టచ్, బ్యాడ్టచ్ల గురించి తల్లిదండ్రులు వివరించాలి. ఏదైనా ఒక విషయం గురించి వివరించాలనుకున్నపుడు ఒక్కసారి చెప్తే సరిపోదని సైకాలజిస్టులు చెపుతున్నారు. తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ టైము గడిపితేనే పిల్లలు వారి బాధలను, సమస్యలను తల్లిదండ్రులతో చెప్పుకుంటారు. ముఖ్యంగా తల్లి ఆడపిల్లకు సమయం కేటాయించాలి.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్