Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వ్యాయామాలు చెయ్యకపోతే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతుంటారు. అతి తక్కువ శారీరక శ్రమతో జీవితాన్ని సాగించేవారిలో హృదయ సంబంధిత రోగాలు వచ్చే ప్రమాదం ఉందని ఇప్పటికే ఎన్నో అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే తాజా అధ్యయనంలో తేలిన నమ్మలేని నిజాలు అందర్నీ విస్తుపోయేలా చేస్తున్నాయి. శారీరక శ్రమ చేసినా.. హృదయ ధమనుల్లోని కాల్షియం డిపాజిట్లు పెరిగే ముప్పు ఉందని పరిశోధన వెల్లడించింది. గుండె వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని అంచనా వేసేందుకు గుండె ధమనుల్లోని కాల్షియం డిపాజిట్ మొత్తాన్ని కొలుస్తారు. ఈ డిపాజిట్లు గుండె కండరాలకు ఆక్సిజన్ అధికంగా ఉండే రక్తం చేరకుండా అడ్డుపడతాయి.
దక్షిణకొరియాలోని సియోల్‌లోని సుంక్యుంక్వాన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్, మేరీల్యాండ్‌లోని అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ బ్లూమ్‌బెర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నిపుణులు ఈ పరిశోధన చేశారు. ఈ అధ్యయన ఫలితాలను హార్ట్ అనే ఆన్లైన్ జర్నల్‌లో ప్రచురించారు.
ఊబకాయం, మధుమేహం, గుండెపోటు, ఇతర అనారోగ్య సమస్యలను నివారించడానికి వ్యాయామం సహాయపడుతుందని అధ్యయనం ఒప్పుకుంది. కానీ శారీరక శ్రమ కొరోనరీ అథెరోస్క్లెరోసిస్ (ధమని మందంగా తయారవడం) సమస్యను పెంచుతుందని పరిశోధకులు తెలిపారు. శారీరక శ్రమతో యాంత్రిక ఒత్తిడితో పాటు నాళాల గోడలు దెబ్బతిని అధిక రక్తపోటు, పారాథైరాయిడ్ హార్మోన్ పెరుగుదలకు కారణమవుతాయని పరిశోధకులు వివరించారు.
శారీరక శ్రమ గుండె వ్యాధులు వచ్చే ముప్పును పెంచకుండానే కొరోనరీ ఆర్టరీ కాల్షియం స్థాయిలను పెంచే అవకాశం ఉందని పరిశోధకులు తెలిపారు. గుండెపోటు నివారణ చికిత్స భాగంగా కరోనరీ ఆర్టరీ కాల్షియం కొలుస్తారని తెలిపారు. శారీరక శ్రమ.. ఆహారం, విటమిన్లు, ఖనిజాల ప్రభావాలను సైతం సవరిస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు.
పరిశోధకుల బృందం మార్చి 30 నుంచి డిసెంబర్ 2017 వరకు సియోల్, సువాన్, దక్షిణ కొరియాలోని రెండు ప్రధాన ఆరోగ్య కేంద్రాలలో సమగ్ర రెగ్యులర్ హెల్త్ చెకప్ చేయించుకున్న 30 ఏళ్ల వయసున్న 25,485 మందిపై అధ్యయనం చేశారు. తక్కువ చురుకుగా ఉన్నవారి కంటే ఎక్కువ చురుకుగా ఉన్నవారే పొగ తాగేందుకు ఇష్టపడడం లేదని అధ్యయనంలో తేలింది. అలాగే బాగా శారీరక శ్రమ చేసేవారిలో తక్కువ మొత్తంలో కొలెస్ట్రాల్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాదు వారిలో అధిక రక్తపోటు, కొరోనరీ ఆర్టరీలలో కాల్షియం డిపాజిట్లు ఉన్నట్టు కనుగొన్నారు.
కనీసం వారానికి 3 నుంచి 5 గంటల పాటు వ్యాయామాలు చేయాల్సిందిగా పరిశోధకులు సూచించారు. లేదా వారానికి 75-150 నిమిషాల పాటు కఠిన ఏరోబిక్ ఎక్సర్సైజులు చేయాలన్నారు. శారీరక శ్రమ వల్ల కొరోనరీ కాల్షియం పెరిగే ప్రమాదం ఉందని రోగులు, వైద్యులు గుర్తు పెట్టుకోవాలన్నారు. ప్లాక్ నయం కావడానికి అలాగే కాల్సిఫికేషన్ కారణంగా కాల్షియం ప్లాక్ హృదయ ధమనుల్లో పెరుగుతూ ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.