Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వారు చరిత్ర సృష్టిస్తున్నారని వారికి తెలుసు. వెస్ట్ బొకారో డివిజన్, నోముండిలోని టాటా స్టీల్ గనుల్లోని 38 ఆపరేటర్లు మహిళలు తలచుకుంటే ఏదీ అసాధ్యం కాదని నిరూపించారు. మహిళాఏమైన్స్ కార్యక్రమం కింద టాటా స్టీల్ 38 మంది మహిళా హెవీ ఎర్త్ మూవింగ్ మెషినరీ ఆపరేటర్లను వెస్ట్ బొకారో, నోముండిలోని గనుల్లో ఆన్‌బోర్డ్ చేసింది. వారిలో ఐదుగురు యువతులు ఈ అసాధారణమైన వృత్తిని ఎందుకు ఎంచుకున్నారో హర్స్టోరీతో పంచుకున్నారు. ఆ విశేషాలు నేటి మానవిలో...
వీరిలో చాలామందికి కనీసం సైకిల్ తొక్కడం కూడా తెలియదు. కానీ హెవీ ఎర్త్ మూవింగ్ మెషినరీ నిర్వహించడాన్ని మాత్రం ఎవ్వరూ నిరోధించలేకపోయారు. దీనికి నైపుణ్యంతో పాటు శారీరక సామర్థ్యం కూడా చాలా అవసరం. నైపుణ్యం లేని మహిళా కార్మికులకు సాంకేతిక శిక్షణను అందించడం, గనుల్లో ప్రధాన ఉద్యోగాలలో పని చేయడానికి వీలు కల్పించే లక్ష్యంతో టాటా స్టీల్ ప్రధాన కార్యక్రమైన ఉమెన్ఏమైన్స్లో భాగంగా మహిళలను ఎంపిక చేశారు. ఈ ఎంపిక ప్రక్రియలో వ్యక్తిగత ఇంటర్వ్యూ తర్వాత రాత పరీక్ష కూడా ఉంటుంది. వెస్ట్ బొకారో డివిజన్లో ఎంపికైన అభ్యర్థులు ఆపరేటర్లుగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఓ సంవత్సరం పాటు తీవ్ర శిక్షణ పొందుతారు. శిక్షణ పూర్తయిన తర్వాత వారు డంపర్, డోజర్, పార, ఎక్స్కవేటర్, డ్రిల్‌తో సహా క్వారీ వద్ద ఆపరేటింగ్ అసిస్టెంట్లుగా నియమించబడతారు.
నచ్చిన రంగాన్ని కొనసాగించాలి
ఇరవై రెండేళ్ల దీపికా కుమారి డాక్టర్ కావాలని కలలు కన్నది. కానీ పరిస్థితులు మరో రకంగా మారిపోయాయి. బిడిఎస్‌లో సీటు వచ్చినప్పుడు ఆమె తన డాక్టర్ కావాలనే కోరికను విడిచిపెట్టి మరేదైనా చూసు కోవాలని నిర్ణయించుకుంది. హెచ్ఇఎంఎం పరేటర్ కోసం ప్రయత్నించింది. దానికి దరఖాస్తు చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయంతో ఆమె కుటుంబం ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆమె ఎప్పుడూ డాక్టర్ కావాలని కోరుకునేది. దాని కోసమే కలలు కనేది. డాక్టర్ సీటు వచ్చే వయసే దాటిపోయిందా అని ఇరుగు పొరుగువారు అడిగేవారు. కానీ అవేమీ ఆమె పట్టించుకోలేదు. తన నిర్ణయానికి కట్టుబడి ఉంది.
ఇంటర్య్వూ, రాత పరీక్ష విజయవంతంగా పూర్తి చేసుకుంది. తన శిక్షణ కాలంలో దీపిక ఫీల్డ్‌వర్క్, సిమ్యులేటర్ల ద్వారా వివిధ రకాల మెషీన్లను ఆపరేట్ చేయడం నేర్చుకుంటుంది. ''నేను శారీరక శ్రమను అస్సలు పట్టించుకోను. మేము గ్రౌండ్ లెవెల్ నుండి విషయాలు నేర్చుకుంటున్నాము. శిక్షణ కాలం నాకు బాగా నచ్చింది'' అంటుంది ఆమె. ఉద్యోగానికి స్త్రీపురుష తేడా ఉండకూడదని దీపిక భావిస్తుంది. ''ఎవరైనా తనకు నచ్చిన రంగాన్ని కొనసాగించగలగాలి'' అని ఆమె చెబుతుంది.
- దీపికా కుమారి, వెస్ట్ బొకారో
నమ్మకం వచ్చింది
ఉమెన్ఏమైన్స్ ప్రోగ్రామ్‌లో హెచ్ఇఎంఎం ఆపరేటర్‌గా చేరడానికి ముందు కిరణ్ గనుల కంట్రోల్ రూమ్‌లో పనిచేశారు. మెకాట్రానిక్స్‌లో డిప్లొమా పూర్తి చేసి ఆమె ఈ వృత్తిలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. ఆమె తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉన్నారు.
''టాటా స్టీల్ హెచ్ఇఎంఎం ఆపరేటర్లను నియమించుకుంటోందని నాకు తెలిసినప్పుడు, నేను వెంటనే దరఖాస్తు చేసుకున్నాను. రాత పరీక్ష, ఇంటర్వ్యూ రెండింటినీ పూర్తి చేసాను. శిక్షణా కాలంలో మేము బేసిక్స్ నుండి మొదలుపెట్టాము. సిమ్యులేటర్ ద్వారా డ్రైవ్ చేయడం నేర్చుకున్నాము. వివిధ విభాగాలలో అనుభవం పొందాము. డంపర్, పార మొదలైనవి నిర్వహించడం తెలుసుకున్నాము. ఏడు నెలల శిక్షణ తర్వాత ఫీల్డ్‌లో రెండు నెలలు గడిపాము'' ఆమె చెప్పింది.
ఆమె కుటుంబం, స్నేహితుల నుండి కొన్ని అడ్డంకులను ఎదుర్కొంది. ''ఇది మహిళలు చేసే ఉద్యోగం కాదని నాతో చాలా మంది అనేవారు. కానీ నా తల్లిదండ్రులు నా నిర్ణయాన్ని గౌరవించారు'' ఆమె జతచేస్తుంది. కిరణ్ శిక్షణ సమయంలో ప్రశంసలు అందుకుంది. ''ఆపరేటర్లు అడుగడుగునా మాతో ఉంటారు. మాలోవున్న భయాన్ని వదిలించుకోవడానికి యంత్రాలను మేమే ఆపరేట్ చేస్తాము. ప్రారంభంలో కంటే ఇప్పుడు మరింత నమ్మకం వచ్చింది'' ఆమె చెప్పింది. కిరణ్ కంపెనీలో ఉన్నత స్థాయిలో దగాలని, తన చదును కూడా కొనసాగించాలని కోరుకుంటుంది. ''మీరు ఏమీ చేయలేరని ఎవరైన అన్నప్పుడు మీరు దాన్ని సవాలును స్వీకరించాలి. ఏమైనా చేయగలరని వారికి చూపించాలి''
- కిరణ్ ముండారి, నోముండి
ఏదైనా విభిన్నంగా చేయాలని
ఇరవై ఆరు సంవత్సరాల పూనమ్ కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ చేసింది. కానీ హెచ్ఇఎంఎం ఆపరేటర్ వృత్తిని ఎంచుకుంది. ''ఓ అసాధారణమైన పనిని ఎంచుకుని దాన్ని మేమూ చేయగలం అని ప్రపంచానికి నిరూపించాలనుకుంది.
''నేను ఎప్పుడూ విభిన్నంగా ఏదైనా చేయాలనుకుంటున్నాను. ఇంతకు ముందు ఈ వృత్తికి ఎవరూ ప్రయత్నించలేదు. కాబట్టి పురుషుల ఆధిపత్య రంగాలలో ఉద్యోగాలు చేయడానికి వెనుకాడే ఇతర అమ్మాయిలకు నేను ఉదాహరణగా ఉంటాను'' అని ఆమె చెప్పింది.
పూనమ్ ఎంచుకున్న ఈ వృత్తిని గౌరవించినవారు ఉన్నారు. అలాగే వ్యతిరేకించవన వారు కూడా ఉన్నారు. ఆమె ఆశయాల గురించి ఆమె కుటుంబానికి తెలిసినప్పటికీ.. ఇతరులు మాత్రం ఆశ్చర్యపోయారు.
''శిక్షణా కాలం బాగా గడిచింది. ఉద్యోగం సులభం లేదా కష్టం అని నేను అనుకోను. ఏ పరిస్థితినైనా ఎదుర్కోవటానికి లేదా కష్టతరమైనప్పుడు నిర్ణయం తీసుకోవడానికి దృష్టి, ఏకాగ్రత, మనసుతో పాటు మనలో నైపుణ్యం కూడా చాలా అవసరం'' ఆమె జతచేస్తుంది.
ఉద్యోగ భౌతిక స్వభావం గురించి ఆమె ఆందోళన చెందలేదు. ఆమె తన సామర్ధ్యాల మేరకు తన బాధ్యతలను నెరవేర్చాలని, ఎదగడానికి అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
''మనం పనిని ఎలా ఎంచుకోవాలి అనేది మన చేతుల్లో ఉంది. ఏదైనా సవాలును స్వీకరించడానికి, మూసపద్ధతిని విచ్ఛిన్నం చేసి ముందుకు సాగడానికి మనల్ని మనం ప్రోత్సహించాలి'' అంటుంది పునమ్.
- పునమ్ ప్రీతి సింగ్, వెస్ట్ బొకారో
భయాన్ని పోగొట్టుకున్నాను
టాటా స్టీల్‌లో పనిచేసే తన తండ్రి ద్వారా హెచ్ఇఎంఎం ఆపరేటర్ ఉద్యోగం గురించి ప్రియ తెలుసుకుంది. ఆమెకు ముందు మూడు తరాలకు చెందిన వ్యక్తులు ఈ సంస్థలోనే పనిచేశారు. కాబట్టి ఆమె ప్రయత్నం సులభమయింది.
''నేను మొదట గనిని సందర్శించినప్పుడు ఒక కంఫర్ట్ జోన్ నుండి అండర్‌గ్రౌండ్‌కి వెళ్లినట్టు అనిపించింది. అది కాస్త సవాలుగా ఉంది. భారీ యంత్రాల నిర్వహణ కష్టమైన పని. నాకు ద్విచక్ర వాహనం నడపడం కూడా తెలియదు. శిక్షకులు, ఇతర సిబ్బంది అందించిన సహకారంతో నాలోని భయాన్ని పోగొట్టుకున్నాను. నాపై నేను నమ్మకాన్ని పెంచుకున్నాన'' ఆమె చెప్పింది. ప్రియా ట్రైనింగ్ పీరియడ్ తర్వాత పూర్తి సమయం ఉద్యోగంలో చేరడానికి ఎంతో ఆసక్తి చూపింది. షిఫ్టులలో పనిచేయడానికి ఆమెకు ఎలాంటి చిరాకు లేదు. పైగా ఆమె తన పూర్వీకుల అడుగుజాడల్లో నడుస్తున్నందుకు గర్వపడుతుంది.
''మహిళలు తమకు కావలసిన రంగాన్ని ఎంచుకోవచ్చు. వారు చేయలేనిది ఏదీ లేదు. వారు సవాళ్లను స్వీకరించి తమను తాము నిరూపించుకోవాలి'' అని ఆమె చెప్పింది.
- ప్రియా మిశ్రా, నోముండి
అమ్మాయిలు ఎందుకు చేయలేరు
10వ తరగతి పూర్తి చేసిన వెంటనే సుస్మితా మండల్ టాటా స్టీల్‌లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంది. ఆమె తండ్రి సంస్థలో పనిచేస్తున్నారు. దాంతో టాటా స్టీల్‌లో ఉద్యోగులు పొందే ప్రయోజనాలు, అవకాశాలు వృద్ధిని ఆమె ప్రత్యక్షంగా చూసింది.
''నేను రాత పరీక్షలలో అర్హత సాధించలేకపోయాను. అందుకే మేనేజ్మెంట్ ఆనర్స్‌లో బీకామ్, మానవ వనరులలో మాస్టర్స్, ఎకనామిక్స్‌లో బిఈడి చేశాను' 'అని ఆమె చెప్పింది.
హెచ్ఇఎంఎంలో అవకాశం వచ్చినప్పుడు సుస్మిత దాన్ని వదులుకోలేదు. కానీ ఆమె చుట్టూ ఉన్న వ్యక్తుల నుండి నిరుత్సాహపరిచేవి, విచిత్రమైన ప్రతిస్పందనలు అందుకుంది. వారు ఆమె తండ్రిని ''ఒక అమ్మాయి ఈ పనిని ఎలా చేయగలదు? ఈ ఉద్యోగంలోకి వెళ్ళడానికి మీరు ఆమెకు ఎలా అనుమితించారు?'' అని అడిగేవారు. ఆమె తండ్రి సూటిగా ''మహిళలు విమానాలు నడపవచ్చు, బస్సులు, రైళ్లు నడపవచ్చు. మరి అలాంటప్పుడు ఈ పనిని ఎందుకు చేయలేరు?'' అని సమాధానం చెప్పారు. తండ్రి ప్రోత్సాహంతో సుస్మిత రాత పరీక్ష, ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించి టాటా స్టీల్ వారి వెస్ట్ బొకారో విభాగంలో చేరింది.
''మొదటి రోజు నుండి శిక్షణా కాలం మనోహరంగా ఉంది. టాటా స్టీల్ ఒక ప్రత్యేకమైన పని సంస్కృతిని కలిగి ఉంది. ఇది ఉద్యోగిలోని క్రమశిక్షణ, గౌరవం, కృషిని గుర్తిస్తుంది. నేను సుస్మిత నుండి సుస్మితాజీ నుండి సుస్మితా మామ్ వరకు ఎదిగాను. అది చాలా గొప్ప గౌరవం'' అని ఆమె చెప్పింది.
కింది స్థాయి నుండి విషయాలు నేర్చుకోవడం, సుస్మిత తన శిక్షణను పూర్తి చేయడానికి, పూర్తి సమయం గనిలో చేరడానికి సిద్ధంగా ఉంది. విభిన్న కెరీర్లు చేపట్టడానికి సంకోచించే ఇతర అమ్మాయిలకు ఆమె ఓ ఉదాహరణగా నిలిచింది.
''ఒక పనిని చేసే ముందు చేయగలమా లేదా అని సంకోచించవద్దు. సంకల్పం, కోరిక ఉన్న చోట విజయం సాధించే మార్గం కూడా ఉంటుంది. మీరు మీ మనసు పెట్టి ప్రయత్నిస్తే ఆకాశమే మీ హద్దు అవుతుంది'' అంటూ జత చేస్తుంది.
- సుస్మిత మండలం, పశ్చిమ బొకారో
- సలీమ