Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ ఉరుకులపరుగుల జీవితంలో చాలా కుటుంబాల్లో వంట వండుకుని తినేంత తీరికే ఉండటం లేదు. ఉద్యోగాల నిమిత్తం ఉదయం వెళితే వచ్చేది ఏ సాయంత్రానికో, రాత్రికో. ఇంత బిజీ లైఫ్‌లో చాలామంది ఫ్రెష్‌గా వండుకుని తినడం ఎప్పుడో మానేశారు. వండిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెట్టుకుని టైం దొరికినప్పుడు అదే తింటూ ఆకలి తీర్చుకుంటున్నారు. ఫ్రెష్ ఫుడ్ తిన్న ఫీల్ కలగడం కోసం వేడి చేసుకుని తింటున్నారు. కానీ.. అన్ని వేళలా ఇది మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. ఇలా నిల్వ ఉంచుకుని పదేపదే వేడి చేసుకుని తినకూడని ఆహార పదార్థాలేంటో తెలుసుకుందాం.
కోడిగుడ్లను ఉడకబెట్టుకున్న వెంటనే తినేయాలి. కోడిగుడ్లలో ప్రధానంగా ఉండే ప్రొటీన్లలో నైట్రోజన్ ఒకటి. కోడిగుడ్లను పదేపదే వేడి చేసి తినడం వల్ల ఈ నైట్రోజన్ నుంచి క్యాన్సర్ కారకమైన కార్సినోజెనిక్ అనే కెమికల్ విడుదలవుతుంది. ఆ గుడ్లను తినడం వల్ల క్యాన్సర్‌ను కొని తెచ్చుకునే ప్రమాదముంది.
చాలా ఇళ్లలో ఉదయాన్నే టిఫిన్ చేసి.. మధ్యాహ్నం, రాత్రికి అన్నం వండుకుని తింటుంటారు. అయితే.. మధ్యాహ్నం మిగిలిపోయిన అన్నాన్ని వేడి చేసి తినడం మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఫ్రిజ్‌లో నిల్వ ఉంచుకుని రాత్రికి మళ్లీ ఆ అన్నాన్ని వేడి చేసుకుని తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ బారిన పడే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.
- ఆలూ మనిషి శరీరానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆలుగడ్డలో విటమిన్ బీ-6, పొటాషియం, విటమిన్-సి సమృద్ధిగా ఉంటాయి. అయితే.. ఇన్ని పోషకాలున్న ఆలూ కూరను వండిన తర్వాత నిల్వ ఉంచుకుని మళ్లీ వేడి చేయడం వల్ల క్లోస్ట్రిడియం బోటులినమ్ అనే బ్యాక్టీరియా ఏర్పడేందుకు కారణమవుతుంది. ఈ బ్యాక్టీరియా కారణంగా అనారోగ్యం బారిన పడే అవకాశముంది.
చాలామందికి ఉండే అలవాటేంటంటే.. మిగిలిపోయిన చికెన్‌ను నిల్వ ఉంచి ఆ తర్వాత వేడి చేసుకుని తింటుంటారు. అయితే.. చికెన్‌ను ఒకసారి కంటే వేడి చేసుకుని తింటే అందులో ఉండే ప్రోటీన్ మాలిక్యూల్స్ నశించిపోతాయి. అంతేకాకుండా, వండిన చికెన్‌ను పదేపదే మైక్రోవేవ్ ఓవెన్లో వేడి చేయడం వల్ల హానికరమైన క్రిములు వ్యాపించే అవకాశం ఉంది.
ఏ కూరనైనా పదేపదే వేడి చేసుకుని తినకుడదు. మరీ ముఖ్యంగా.. క్యారెట్‌ను. క్యారెట్‌తో కూడిన ఆహారాన్ని పొరపాటున కూడా మళ్లీ మళ్లీ వేడి చేసుకుని తినొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వండిన కూరలను అదే పనిగా వేడి చేసుకుని తినడం వల్ల నైట్రోసమైన్ అనే రసాయనం విడుదలవుతుందని.. కూరగాయల్లో ఉండే నైట్రేట్స్ నుంచి విడుదలయ్యే ఈ రసాయనం కారణంగా పిల్లలకు శ్వాసకోశ సమస్యలతో పాటు క్యాన్సర్‌కు కారణమవుతుందని తెలిపారు.