Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనిషి బతకడానికి నీరు, గాలి, ఆహారం ఉంటే చాలు. కానీ వీటితో పాటు మనవ జీవనంలో ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర కూడా అంతే అవసరం. నిద్ర ద్వారానే శరీరం కొత్త ఉత్సాహం పొందుతుంది. రోజుకు 6 గంటల పాటు నిద్రించకుంటే అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రోజుకు నాలుగు గంటల పాటు నిద్రపోయేవారు.. లేకుంటే అర్థరాత్రంతా మేల్కొని ఆరు గంటలు నిద్రతో సరిపెట్టుకునే వారు.. మరుసటి రోజు యాక్టివ్గా పనిచేయలేరు. రాత్రి నిద్రపోకుండా మేల్కొంటే ఒబిసిటీ, గుండె సంబంధిత వ్యాధులు, హైబీపీ, డయాబెటిస్, నిద్రలేమి సమస్యల బారిన పడక తప్పదు. అయితే నిపుణులు ఏం చెబుతున్నారంటే రోజూ కనీసం ఆరు గంటలైనా నిద్ర ఉండాలని తెలిపారు. రోజు మొత్తంలో కనీసం ఆరు గంటలైన నిద్రపోని వారిలో గుండెకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందట.
నిద్రలేమి కారణంగా తీవ్ర ఒత్తిడి పెరగడమే కాకుండా అది శరీరంలోని రక్తప్రసరణపై ప్రభావం చూపిస్తుందని తెలిపారు. తద్వారా రక్తనాళాల్లో ఒత్తిడి ఏర్పడి అది మెల్లగా గుండెపై ప్రభావం చూపిస్తుందని పేర్కొన్నారు. నిద్రపోయే ముందు మీ బెడ్రూమ్ నిశ్శబ్దంగా.. ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. నిద్ర సమయంలో గదిలో ఎక్కువ వెలుగు లేకుండా చూసుకోవాలి. సాయుంత్రం తర్వాత కాఫీ, టీ, కూల్డ్రింక్స్ అస్సలు తీసుకోకుండా ఉంటే మంచిది. ప్రతీ రోజూ ఒకే వేళకి నిద్రపోవాలి. పగలు చిన్నకునుకు చాలు. ఎక్కువసేపు నిద్రపోవద్దు. రాత్రి బాగా నిద్ర పట్టాలంటే పగలు కనీసం అరగంట సేపయినా పగటి వెలుగులో (డే లైట్) గడపాలి. గోరు వెచ్చని పాలు తాగాలి. పాలలో ట్రిప్టోఫ్యాన్ అనే అమైనో ఆసిడ్ ఉంటుంది. దాని వల్ల బాగా నిద్ర పడుతుంది.
నిద్రకు ముందుపుస్తకాలు చదవడం, టీవీ చూడడం వంటివి చేయవద్దు. అయితే ముఖ్యంగా రాత్రివేళల్లో నిద్ర ఎంతో మంచిదని అధ్యయనంలో రుజువైంది. ఇటీవల పరిశోధకులు మధ్య వయసు ఉన్న 4వేల మంది పురుషులు, మహిళల్లో రక్తనాళాల పనితీరును పరీక్షించారు. ఈ అధ్యయనంలో రాత్రివేళల్లో ఆరు గంటలు కంటే తక్కువ సమయం నిద్రించినవారిలో 27 శాతం మేర గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నట్టు నిర్ధారించారు. ఆరు కంటే ఏడు గంటల వరకు నిద్రించిన వారిలో కంటే తక్కువ సమయం నిద్రించినవారిలోనే ఈ సమస్య తీవ్రంగా ఉంటుందని గుర్తించారు. అందుకే సరైన నిద్ర అవసరం. ఎంత ఒత్తిడి ఉన్నా.. ఎన్ని పనులు ఉన్నా.. నిద్రించే సమయాన్ని కాస్త కేటాయిస్తే.. ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందవచ్చునని పరిశోధకులు సూచిస్తున్నారు.
కంటి నిండా నిద్ర లేదంటే అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. నిద్రలోనూ మెదడు పనిచేస్తుంటుందిగానీ దాని చురుకుదనం, పరిసరాలపై చైతన్యం తగ్గుతుంది. అంతర్గతంగా పనులన్నీ జరుగుతూనే ఉన్నా.. అవయవాలు, మెదడు బాహ్య విషయాలను మరచిపోయి విశ్రాంతి తీసుకోవటం నిద్ర ముఖ్య ఉద్దేశం. పసిపిల్లలు రోజుకు 16 గంటలైనా పడుకుంటారు. యుక్తవయసులకు సగటున 8-9 గంటల నిద్ర అవసరం. పెద్దలు ఎవరైనా రోజుకి కనీసం 5-8 గంటల సేపు నిద్రపోవటం అవసరం.