Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాధారణంగా మనం బయటకు వెళ్లినపుడు వివిధ రకాల కాలుష్యాలు, అలర్జీ కారకాలతో అనారోగ్యానికి గురవుతాం. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఈ ఎయిర్ పొల్యూషన్ వల్ల ప్రతి ఏడాది దాదాపు 7 మిలియన్ల మంది మరణిస్తున్నారట. కనీసం ఇంటి లోపలి వాతావరణాన్ని అయినా శుభ్రంగా పెట్టుకోగలిగితే ఎయిర్ పొల్యూషన్ నుంచి తప్పించుకోవచ్చు. దీనికి సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మీ ఇంటి లోపల కూడా బయటి మాదిరి గాలి కలుషితమయ్యే ప్రమాదం ఉంటుంది. ఇంటి లోపలి గాలిని శుభ్రపరచుకోవడం మీ చేతుల్లోని పనే కాబట్టి తగిన చర్యలు తీసుకోవాలి. అవేంటో తెలుసుకుందాం...
ఇండోర్ ప్లాంట్స్: ఇండోర్ ప్లాంట్స్ ఇంటికి అందంతోపాటు గాలిని కూడా ప్యూరిఫై చేస్తాయి. అయితే ఎంచుకున్న మొక్కలను వాటికి అనుగుణంగా జాగ్రత్తగా పెంచుకోవాలి. వీటిని నైట్ స్టాండ్ లేదా సైడ్ టేబుల్స్‌పై ఏర్పాటు చేసుకూడదు. పీస్ లిల్లీ, స్నేక్ ప్లాంట్, స్పైడర్ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్లకు చక్కని ఎంపిక.
వెంటిలేషన్: ముఖ్యంగా మీ ఇంటికి సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. బయటి నుంచి వచ్చే గాలి ఇంట్లోని కాలుష్య కారకాలను భర్తీ చేస్తుంది. వెంటిలేషన్ లేని ఇల్లు కలుషితంగానే ఉంటుంది. అందుకే కిటికీలు, తలుపులు క్రమం తప్పకుండా తెరచి ఉంచాలి. కిటికీలకు ఉండే ఎయిర్ ఫిల్టర్లను మారుస్తుండాలి. వాటిని శుభ్రం చేస్తూ ఉండాలి. ఎయిర్ కండీషన్లో ఉండే ఫిల్టర్లు ఇంటిలోని గాలిని కాలుష్యం చేసే ప్రమాదం ఉంది. అందుకే మెరుగైన ఆరోగ్యం కోసం ఫిల్టర్లను మార్చాలి. దుమ్ము ధూళి కణాలు కూడా వాటిలో చిక్కుకుపోతాయి. ఇంటికి తప్పనిసరిగా ఎగ్సాస్ట్ ఫ్యాన్స్, ఎయిర్ వెంట్లను ఏర్పాటు చేసుకోవాలి.
క్లీనింగ్: కార్పెట్లను క్లీన్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. గృహాలంకరణలో ఉపయోగించే రగ్గులు, తివాచీలను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. దుమ్ము రేణువులు కార్పెట్లకు సులభంగా చిక్కుకుపోతాయి. దీనివల్ల అలర్జీలు వస్తాయి. శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి సమస్యాత్మకంగా ఉంటుంది. వీటిని వ్యాక్యుమ్ చేయడం.. క్రమం తప్పకుండా బాగా శుభ్రం చేయాలి. అలాగే కర్టెన్లు, బెడ్షీట్లను కూడా ఇలాగే క్లీన్ చేసుకుంటూ ఉండాలి.
పొడిగా ఉండేలా: తేమ లేదా తడిగా ఉండే ప్రదేశాల్లో శిలీంద్రాలు, బ్యాక్టిరియాకు సంతానోత్పత్తి కేంద్రాలుగా మారతాయి. ఇవి ఇండోర్ ఎయిర్ క్వాలిటీపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఇల్లు ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి.