Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుత జీవన విధానంలో జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, ప్రాసెస్డ్ ఫుడ్‌కి అలవాటు పడిపోవడం, శరీరానికి తగిన వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి... ఇలాంటివన్నీ ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు దారి తీస్తున్నాయి. అయితే వీటన్నింటిలోనూ ప్రధానంగా ఇబ్బంది పెట్టే సమస్య గుండె పోటు. కొందరికి ఈ సమస్య వారసత్వంగా కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి మీకు గుండె జబ్బు వచ్చే అవకాశం ఉంటే కొన్ని జాగ్రత్తలు పాటించి హార్ట్ ఎటాక్ల వంటివి నివారించుకోవచ్చు. అదెలాగంటే..
గుండె జబ్బు వచ్చే అవకాశాలున్నాయా: మీ జీవన విధానంలో భాగంగా మీరు చేసే కొన్ని పనులు మీకు గుండె జబ్బు వచ్చే ముప్పును పెంచుతాయి. ఇందులో భాగంగా ధూమపానం, ఫాస్ట్ ఫుడ్ తినడం వంటివి పూర్తిగా తగ్గించాల్సి ఉంటుంది. అంతే కాదు ఒకవేళ మీకు కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నా.. మీ కుటుంబంలో వారసత్వంగా గుండె పోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నా.. మీకు గుండె జబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వారు డాక్టర్లను తరచూ సంప్రదిస్తూ పరీక్షలు
ఆరోగ్యకరమైన ఆహారం: మీ భోజనంలో ఎక్కువగా కూరగాయలు, పండ్లు, ముడి ధాన్యాలు, పప్పు ధాన్యాలు, నట్స్, ప్రొటీన్ ఎక్కువగా దొరికే పదార్థాలు, చేపలు వంటివి తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. వీటితో పాటు పీచుపదార్థం ఎక్కువగా తీసుకోవాలి. రిఫైన్డ్, ప్రాసెస్డ్ ఆహారాన్ని వీలైనంతగా తగ్గించడం కూల్ డ్రింక్స్ మానేయడం వంటివి చేయాలి.
వ్యాయామం తప్పనిసరి: చాలామంది రోజంతా పని చేస్తూ కూర్చీకే పరిమితమైపోతుంటారు. ఇలా చేయడం వల్ల గుండె జబ్బు వచ్చే ముప్పు పెరుగుతుందట. అందుకే ప్రతి గంటకి ఓసారి సీట్ నుంచి లేచి ఓ ఐదు నిమిషాల పాటు నడవాల్సి ఉంటుంది. అలాగే రోజూ ఓ అరగంట పాటు వ్యాయామం చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. ప్రతి మనిషి వారానికి కనీసం 150 నిమిషాల పాటు సాధారణ స్థాయి, 70 నిమిషాల పాటు హై ఇంటెన్సిటీ వర్కవుట్ చేయాలని వైద్యులు వెల్లడిస్తారు.
బరువు అదుపులో ఉంచుకోండి: సాధారణ బరువు ఉన్నవారిలో గుండె జబ్బులు వచ్చే ముప్పు అధిక బరువు ఉన్న వారితో పోల్చితే కాస్త తక్కువే అని చెప్పుకోవాలి. అందుకే మీరు రోజూ తినే ఆహారంలో మీకు సరిపడినన్ని మాత్రమే క్యాలరీలు అందేలా చూసుకోవాలి. ఒకవేళ మీరు బరువు ఎక్కువగా ఉంటే బరువు తగ్గడం వల్ల కూడా మంచి ఫలితం కనిపిస్తుంది.
డాక్టర్ సలహా తప్పనిసరి: గుండె జబ్బు వచ్చే ప్రమాదం ఉందని తెలిసినప్పుడు ప్రతి ఆరు నెలలు లేదా సంవత్సరానికోసారి టెస్టులు చేయించుకుంటూ వైద్యులు చెప్పిన సూచనలు పాటించాలి. ఒకవేళ మందులు వేసుకోమని చెబితే వాటిని తప్పక వేసుకోవాలి. ఇవి మీకు గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి సమస్యలు రాకుండా నివారిస్తాయి. అయితే కేవలం మందులే కాదు.. మీరు జీవించే ఆరోగ్యకరమైన జీవన శైలి కూడా అవసరమే. అందుకే డాక్టర్లు చెప్పినట్టుగా సూచనలు కూడా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.