Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎర్రగా, దోరగా చూడగానే తినాలనిపించేలా ఉంటాయి టమాటాలు. ఏ కూరలోనైనా టమాటా వేస్తే దాని రుచే వేరు కదా..? ఇవి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. అలాంటి టమాటాలతో చేసే కొన్ని వంటకాలు మీకోసం...
టమాటా పచ్చడి (మొదటి రకం)
కావాల్సిన పదార్ధాలు: టమాటాలు - నాలుగు పెద్దవి (కొంచం పచ్చిగా, గట్టిగా ఉండాలి), పచ్చిమిర్చి - ఆరు , పచ్చి కొబ్బరి - నాలుగు స్పూన్లు, పుదీనా - కొంచం, వెల్లుల్లి రెబ్బలు- నాలుగు, ఉప్పు, పసుపు, పోపుదినుసులు, నూనె, కరివేపాకు - రుచికి సరిపడా.
తయారు చేయు విధానం: బాండీలో నూనె పోసి అందులో టొమాటో తరిగి వేయాలి. పచ్చిమిర్చి, పుదీనా, వెల్లుల్లి వేసి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. అవి మగ్గకా పొయ్యిమీద నుంచి దించి చల్లారనివ్వాలి. చల్లారాక మిక్సీలో వేసి వాటితో పాటు పచ్చి కొబ్బరి, ఉప్పు, పసుపు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. తర్వాత దాంట్లో పోపువేయాలి. ఇది అన్నంలోకి, చపాతీలోకి బావుంటుంది.
టమాటా పచ్చడి (రెండవ రకం)
కావాల్సిన పదార్ధాలు: టమాటాలు పెద్దవి - నాలుగు, ఎండు మిర్చి - ఎనిమిది, ఆవాలు, శనగ పప్పు, మినపప్పు, జీలకర్ర - ఒక్కో స్పూను చొప్పున, మెంతులు - కొంచం, ఇంగువ, కొత్తిమీర, ఉప్పు - తగినంత, నూనె - తాలింపుకు సరిపడా.
చేయు విధానం: ఒక బాండీలో నూనె పోసి వేడెక్కాక, అందులో ఎండు మిర్చి, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి అన్ని వేయించాలి. అవి వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలో మరి కొంచం నూనె పోసి టమాటా ముక్కలుగా కోసి మగ్గనివ్వాలి. అవి చల్లారాక మిక్సీలో ముందుగా వేయించిన పోపు దినుసులు ఉప్పు, ఇంగువ వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత మగ్గిన టమాటా ముక్కలు వేసి గ్రైండ్ చేయాలి. అందులోనే కొత్తిమీర కూడా వేసి మరొక్కసారి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇది అన్నం, చపాతీ, దోసెలు, ఇడ్లీల్లోకి బావుంటుంది.
టమాటా రైస్
కావల్సిన పదార్థాలు: బియ్యం - ఒక గ్లాసు (సుమారు పావు కిలో), టమాటాలు - నాలుగు, ఉల్లి గడ్డ - ఒకటి, పచ్చి మిర్చి - నాలుగు, లవంగాలు -ఐదు, ఏలకులు - ఐదు, దాల్చినచెక్క - చిన్నముక్క, ఉప్పు, నూనె, కారం, పసుపు - సరిపడా, అల్లంవెల్లుల్లి ముద్ద - రెండు చెంచాలు, పుదీనా - కొంచం.
తయారు చేయు విధానం: ముందుగా టమాటా ముక్కలుగా కోసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డ సన్నగా తరిగి పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని నిలువుగా చీల్చు కోవాలి. ఒక గిన్నెలో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి అది వేడెక్కాక అందులో ముందుగా ఉల్లిగడ్డ వేసి గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. ఆ తర్వాత అందులోనే టమాటా ముక్కలు, పచ్చిమిర్చి వేయాలి వాటితో పాటు దాల్చిన చెక్క, ఏలకులు, లవంగాలు, వెల్లుల్లి వేసి వేయించాలి. అవి వేగాక రెండు గ్లాసుల నీళ్లు పోసి అవి మరుగుతుండగా అందులో తగినంత కారం, ఉప్పు, పసుపు వేయాలి. బాగా ఎసరు వస్తున్నప్పుడు అందులో బియ్యం వేయాలి. ఇప్పుడు ఆ గిన్నెను కుక్కర్లో పెట్టి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత తక్కువ మంటపై మూడు నిమిషాలు ఉంచాలి. కుక్కర్ మూత తీసి అందులో పుదీనా వేసి ఒక సారి మొత్తం కలపాలి. ఇది ఇలానే తినేయవచ్చు. లేదా ఇందులోకి పెరుగు పచ్చడి బావుంటుంది.
టమాటా ఆవకాయ
కావల్సిన పదార్థాలు: మాటాలు - పావుకిలో, చింతపండు - నిమ్మకాయంత, ఉప్పు, కారం, నూనె, మెంతి పిండి, పోపుదినుసులు, కరివేపాకు, ఇంగువ - సరిపడా.
తయారు చేయు విధానం: ముందుగా ఓ మందపాటి బాండీలో ఐదు టేబుల్ స్పూన్ల నూనె వేసి బాగా వేడిఎక్కాక అందులో టమాటా ముక్కలుగా తరిగి వేయాలి. అందులోనే చింతపండు వేయాలి. ముక్కలు బాగా మగ్గకా అందులోని నీరు ఇంకిపోయాక స్టవ్ ఆపేసి దింపేయాలి. చల్లారాక అందులో తగినంత కారం, ఉప్పు, కొంచం పసుపు, మెంతి పిండి వేసి బాగా కలపాలి. ఇప్పుడు కొంచం నూనె బాండీలో వేసి పోపుదినుసులు, ఇంగువ, కరివేపాకు వేసి టమాటా మిశ్రమంలో వేయాలి. ఇది ఒక వారం పదిరోజులు నిల్వ ఉంటుంది.