Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాలనుగుణంగా అందే పండులో ఒక్కోక్క గుణం ఉంటుంది. అందుకే ఏ సీజనలో వచ్చిన పండ్లను ఆ సీజన్లో కచ్ఛితంగా తినాల్సిందే. సీతాఫలంలో కూడా అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఇమ్యూనిటీ బూస్టర్‌గా.. వ్యాధుల నివారిణిగా ఇది పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ పండ్లు విరివిగా వచ్చేస్తున్నాయి. అసలే చలేస్తుంది. ఈ పండు తింటే.. మరింత జలుబు చేస్తుందని అనుకుంటారు. కానీ ఈ పండుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
రోగనిరోధక శక్తికి: ఇందులో ఉండే విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్లు శరీరానికి రోగనిరోధక శక్తిని అందిస్తాయి. ఈ పండు ఎన్నో రకాల జబ్బులను నివారిస్తుంది. కేన్సర్ రాకుండా కాపాడుతుందని కొన్ని నివేదికలు తెలిపాయి. సీతాఫలంలో పొటాషియంలో ఎక్కువ మోతాదులో ఉంటుంది. అందుకే హైపర్‌టెన్షన్ ఉన్నవారు ఈ ఫలం తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్తహీనత ఉన్నవారికి సీతాఫలం చాలా మంచిది.
మలబద్ధక సమస్యకు: ఇందులో ఐరన్, కాపర్ పుష్కలంగా ఉంటుంది. ఎనిమియాను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ఈ పండు తినడం వల్ల జుట్టు బాగా మెరుస్తుంది కూడా. ఇందులో పీచు కూడా చాలా ఎక్కువ. పీచుతోపాటు కాపర్ ఉండటంలో ఇది మలబద్ధకం సమస్యను అరికడుతుంది. ఈ పండ్లలోని పీచు పదార్థాలు జీర్ణవ్యవస్థకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇందులో ఉండే మెగ్నిషియం రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. సీతాఫలం కీళ్లవాతాన్ని, అర్థరైటీస్ వంటి ఎముకల వ్యాధులను నివారిస్తుంది.
ఇన్ఫెక్షన్లు దూరం: ఈ పండు కండరాల బలహీనతను తగ్గించే గుణం ఉంటుంది. అంతేకాదు ఈ మధుర ఫలంతో ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండవచ్చట. తిన్నవెంటనే శక్తినిచ్చే పండు. లివర్ కేన్సర్, మెదడులో ట్యూమర్స్, బ్రెస్ట్ కేన్సర్ రాకుండా ఉపయోగపడుతుంది. కండ్ల ఆరోగ్యానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. డయాబెటీస్‌ను దరిచేరనివ్వదు. సీతాఫలం కండ్లు, జుట్టు, స్కిన్‌కు చాలా ఉపయోగపడుతుంది.
ఒత్తిడి లేకుండా చేస్తుంది: బీ6 విటమిన్ ఎక్కువగా ఉండటం వల్ల అస్తమా రాకుండా ఉంటుంది. ఏ, బీ విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటుంది. ఈ సీజన్లో రోజుకు ఒక ఫ్రూట్ తినడం మంచిది. బలహీనత, ఒత్తిడితో బాధపడుతున్నవారికి, డిప్రెషన్‌కు కూడా మందులా పనిచేస్తుంది. బ్లడ్ షుగర్ లెవల్స్‌ను కొలమానంగా పనిచేస్తుంది. కేలరీ కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో పీచు కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి క్రమం తప్పకుండా తీసుకోవడం మేలు. రోజుకి 900 మైక్రో గ్రాముల కాపర్ కావాల్సింది కాబట్టి.. ఈ పండు తినాలి. ఇక ఈ పండుతో చిగుళ్ల నుంచి రక్తం కారడం కూడా తగ్గుతుంది.