Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బంగారు పుట్టలో వేలెడితే కుట్టనా..?కరోనా వైరస్ గురించి ఇంత ఉదృతంగా ప్రచారం చేస్తున్నా ఇంకా ఎంతోమంది వాక్సిన్లు తీసుకోవడం అవసరం గురించి చాలా ప్రచారం చేస్తున్నారు. అయినా ముందుకు రాకపోవడంతో రేషన్, కరెంట్ కట్ చేస్తామని చెప్పారు. వెంటనే చాలామంది వేయించుకుంటున్నారు. ఆరోగ్య కార్యకర్తలు, వైద్యసిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్ళి వాక్సిన్లు ఇస్తున్నారు. వ్యాధులతో బాధపడే వారికి, వృద్ధులకు ఇంటికి వచ్చి మరీ వాక్సిన్లు వేస్తున్నారు. ఇలా వేయడం వల్ల అందరూ వేయించుకోగలుగుతారు. వాక్సిన్ల మీద ఉన్న అపోహల్ని, అనుమానాల్ని ఆరోగ్య సిబ్బంది తొలగించాలి. ప్రజలకు వాక్సిన్లపై ఉన్న భయాన్ని అవగాహన ద్వారా తొలగిస్తే ప్రజలు ధైర్యంగా వాక్సిన్లు తీసుకోగలుగుతారు. మూడో వేవ్ గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఎలా ఉన్నా మనం మాస్క్‌లతో రక్షణ చేసుకోవాలి. అనవసరంగా బయట తిరక్కుండా కరోనా వైరస్ నుంచి రక్షించుకోవాలి. ఇంట్లో ఉండి కళాత్మకంగా గడుపుదాం! చీమల పుట్టలు, వాటి కుటుంబాల గురించి తెలుసుకుంటూ బొమ్మలు చేసేద్దాం.
చింతగింజలతో...
చింతకాయల సీజన్లో చాలా చింతపండు కొని దాచుకున్నాము. ఆ చింతపండులో వచ్చిన చింత గింజలన్నీ దాచుకుని బొమ్మల్ని చేస్తున్నాను. ఈరోజు చీమల గురించి తెలుసు కుందాం! కాబట్టి చీమల బొమ్మల్ని తయారు చేసుకుందా. శ్రమశక్తికి ఉదాహరణైన చీమను చింతగింజలతో తయారు చేయటం బాగుంది. చీమ కష్టపడి ఆహారం సేకరించుకుంటుంటే, ఎలాంటి శ్రమ లేకుండా తిరిగిన మిడత వర్షాకాలంలో ఎలా తిప్పలు పడిందో, చీమ ముందు చూపును చదువుకున్నాం. అలాగే పావురం-చీమల మధ్య పరస్పర సహాయాలు చేసుకున్న కథ, చీమ, చిలుక కథలు మన చిన్నతనాన విన్నాము. ఇప్పుడు పిల్లలకు కథల పట్ల అవగాహన ఉండటం లేదు. అంత తీరిక పిల్లలకు, తల్లులకు ఉండటం లేదు. బలవంతమైన సర్పం గర్వంతో విర్రవీగగా చలిచీమల చేత చిక్కి చచ్చినదని వేమన పద్యంలో చదివాము. ఇది ఒక చిన్న కీటకము. చీమ తన బరువుకన్నా రెట్టింపు బరువును మోయగలుగుతుంది. అనగనగా ఒక రాజుకు ఏడుగురు కొడుకులు అనే కథలో 'చీమా, చీమా! ఎందుకు కుట్టావు అని అడిగితే సమాధానంగా నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా'' అంటుంది. ఈ బొమ్మలో రబ్బరు బ్యాండ్లు, ఆకుల ఈనెలు కూడా ఉపయోగించాను. చింతగింజల చీమ అందంగా తయారయింది.
వెంటిలేటర్ వేస్టుతో...
వెంటిలేటర్లు అనబడే కృత్రిమ శ్వాసను అందించే మెషీన్లలో వాడే పి.ఎవమ్ లైన్లలోని ప్లాస్టిక్ బటన్లతో నేను చీమను చేస్తున్నాను. ఈ ప్లాస్టిక్ బటన్లు తెల్లని తెలుపు రంగులో ఉంటాయి. మామూలుగా చీమలు నల్లగా, ఎర్రగా ఉంటాయి కదా! అందుకే నల్ల చీమలు, ఎర్రచీమలు అంటాము. రెక్కలతో ఎగరగలిగే చీమలను రెక్కల చీమలు అంటారు. అలాగే అడవిలో గడిపే చీమలను కొండ చీమలనీ, చిన్న నల్ల చీమల్ని చలి చీమలనీ, పెద్దగా ఉండే నల్ల చీమల్ని గండు చీమలనీ అంటారు. చీమల్లో రాణి చీమలు, శ్రామిక చీమలు, సైనిక చీమలు అని మూడు రకాల చీమలు ఉంటాయి. హైస్కూలులో ఉన్నప్పుడే చీమల, దోమల జీవిత చరిత్రల్ని చదువుతాము గానీ ఈరోజు మరల గుర్తు చేసుకుందాం. రాణి చీమలు గుడ్లు పెట్టడం తప్ప మరే పనీ చేయవు. రాణికి సేవలు చేయటానికి పనికి వచ్చేవి శ్రామిక చీమలు. పుట్టను కాపాడే పని సైనిక చీమలది. చీమలు నేలను తవ్వి పుట్టల్ని పెట్టుకుంటాయి. పుట్టపై శత్రువులు దండెత్తారని తెలియగానే కాపలా చీమలు ఒక రసాయనాన్ని విడుదల చేస్తాయి. ఆ వాసనను పసిగట్టి మిగతా చీమలన్నీ ఒక్కసారిగా దాడికి దిగుతాయి. ఈ చామలు శరీరానికి ఉండే సన్నని రంధ్రాల ద్వారా శ్వాసను తీసుకుంటాయి. నేనీరోజు నల్లచీమల, ఎర్రచీమ కాకుండా తెల్ల చీమను తయారు చేశాను. చూడండి ఎలా ఉందో?
కారప్పూసతో...
మనం తినే పదార్థాలకు చీమలు పట్టడం తెలుసుగానీఈ తినే పదార్థాలతో చీమను తయారు చేయడం చూశారా? ఇంట్లో కారప్పూస వండాను. రోజూ దాన్ని తింటున్నపుడు బొమ్మ చేయాలనే ఆలోచన వచ్చింది. ఇదే కొత్తదేమీ కాదు. ''ఫుడ్ ఆర్ట్'' అని పేరు పెట్టి ఒక ఎగ్జిబిషన్ కూడా పెట్టాను. సరే కారప్పూసతో తయారైన చీమను చూడండి. ఇది పసుపు రంగులో బంగారంలా మెరుస్తుంది. చీమల మధ్యలో ఒక రసాయనిక భాష ఉన్నది. ఇవి తమ శరీరం నుండి వెలువడే 'పెరోమోన్స్' ద్వారా తాము చెప్పాలనుకున్న సమాచారాన్ని చేరవేస్తాయి. ఉదాహరణకు ఒక చీమకు ఎక్కడైనా ఆహారం కనిపిస్తే ఆ విషయాన్ని మిగతా చీమలకు తెలియజేయడానికి అవి వెళ్ళే దారి పొడుగూతా 'పెరోమోన్'ను విడుదల చేస్తుంది. ఆ విధంగా మిగతా చీమలు ఆహారం ఉన్న విషయాన్ని తెలుసుకుంటాయి. చీమలు దారిని గుర్తు పెట్టుకోవటం, వెళ్ళిన దారిలో తిరిగి పుట్టను చేరటం కూడా సమాచార విప్లవం కిందికి వస్తుంది.
ఆకులతో...
మనం తెల్ల చీమను, పసుపు చీమను, చేశాం కదా! ఇప్పుడు ఆకుపచ్చ చీమను చేద్దాం. ప్రకృతిలో కలిసిపోయే హరిత చీమను చేయాలంటే ఆకులు కావాలి కదా! దీనికి మూడు ఆకులు కావాలి. తల, మొండెం, ఉదరం అనే మూడు శరీర భాగాలు ఉంటాయి చీమలో. అందుకే మూడింటికి మూడు ఆకులు చాలు. చీమలు కీటకాల జాతికి చెందినవని చెప్పుకున్నాం కదా! వీటికి మూడు జతల కాళ్ళుంటాయి. అవీ అతుకులు కలిగిన కాళ్ళు. చీమలు కందిరీగల నుంచే పుట్టాయి. 10 కోట్ల సంవత్సరాల కిందట చీమలు కందిరీగల నుంచి విడిపోయి ప్రతేయక జీవులుగా రూపాంతరం చెందాయి. ప్రపంచంలో ఉన్న చీమల్ని కలిపితే వచ్చే బరువు మనుషులు బరువు కన్నా ఎక్కువగా ఉంటుందట.
ఇంజక్షన్ సీసాల మూతలతో...
ఇప్పుడు ఇంజక్షన్ సీసాల మూతలతో ఎర్ర చీమను తయారుచేశాను. పిల్లలకు వేసే ఇంజక్షన్ల సీసాలపై ప్లాస్టిక్ మూతలుంటాయి. నేనా మూతలతో చాలా బొమ్మలు చేశానని తెలుసుకదా! ఈ ప్లాస్టిక్ మూతలు చాలా రంగుల్లో ఉంటాయి. నేను ఎక్కువగా ఎరుపు రంగు ప్లాస్టిక్ మూతలు వాడాను. దాని వల్ల ఎర్ర చీమ తయారయ్యింది. చీమల గురించి ఎన్నో కథలు, సామెతలు ఉన్నాయి. ''చీమలు దూరని చిట్టడవి, కాకులు దూరని కారడవి'' అని దట్టమైన అడవిని గురించి చెప్పే సామెత. ఐకమత్యానికి, క్రమశిక్షణకు చీమల కుటుంబమే ఉదాహరణగా చెప్పుకుంటాం. అలాగే ''పైన తిరిగే పక్షి, కింద పారే చీమ'' అనే సామెతను కూడా చెప్పుకుంటారు. ఆకాశం, భూమిలలో ఎక్కడా చోటు లేదు అనే విషయాన్ని ఈ సామెత తెలుపుతుంది.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్