Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన అవసరాలకు.. మారుతున్న అభిరుచులకు తగ్గట్టు ఎప్పటికప్పుడూ కొత్త ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ రోజుల్లో నాన్ స్టిక్ వంట పాత్రలు లేని వంటగదులు చాలా తక్కువగా ఉంటున్నాయి. అలాగే కొన్ని రకాల వంటసామగ్రికి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంటోంది. కాస్ట్ ఐరన్, కాపర్, ఎనామిల్, స్టెయిన్ లెస్ స్టీల్, కార్బన్ స్టీల్ వంటి ముడి పదార్థాలతో కొత్త రకం వంట పాత్రలను కంపెనీలు తయారు చేస్తున్నాయి. ప్రస్తుతం కార్బన్ స్టీల్ పాత్రల హవా నడుస్తోంది. రెండు, అంతకంటే ఎక్కువ లోహాలు కలిపి వీటిని తయారు చేస్తారు. స్టెయిన్ లెస్ స్టీల్, కాస్ట్ ఐరన్లను కలిపి కార్బన్ స్టీల్ వంట సామగ్రి తయారు చేస్తున్నారు. ఇవి ఆన్లైన్లో చాలా తక్కువ ధరల్లోనే లభిస్తున్నాయి. వీటి వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.
మన్నికలో మేటి: కార్బన్ స్టీల్ పాత్రలు కాస్ట్ ఐరన్ కంటే తొందరగా వేడెక్కుతాయి. కాస్ట్ ఐరన్ వంట పాత్రలను సైజ్ బట్టి కనీసం 10 నుంచి 30 నిమిషాలు వేడి చేయాలి. కానీ కార్బన్ స్టీల్ కేవలం మూడు నుంచి ఐదు నిమిషాల్లోనే పూర్తిగా వేడి అవుతుంది. దీనివల్ల గ్యాస్, వంట సమయం కూడా ఆదా అవుతుంది. అల్యూమినియం, స్టీలు పాత్రలతో పోలిస్తే కార్బన్ స్టీల్ వేడిని ఎక్కువగా నిలుపుకుంటుంది. అందుకే దీన్ని ఇండక్షన్, గ్రిల్స్, క్యాంప్ ఫైర్ వంటకాల కోసం కూడా వాడవచ్చు. మన్నిక విషయంలో కూడా ఇతర లోహాలకంటే ఇది మెరుగైనది.
నాన్ స్టిక్ లేయర్: కార్బన్ స్టీల్ వంట పాత్రల లోపలి భాగం నాన్ స్టిక్ ప్యానెల్‌తో వస్తుంది. ఎలాంటి రిస్క్ లేకుండా సులభంగా వీటిల్లో వంటలు చేసుకోవచ్చు. ఈ లేయర్ వంట పాత్రలు తుప్పు పట్టకుండా కాపాడుతుంది. మనకు అందుబాటులో ఉండే నాన్ స్టిక్ పాత్రలను జాగ్రత్తగా వాడకపోతే గీతలు పడతాయి. ఫలితంగా నాన్ స్టిక్ లేయర్ ఊడిపోతుంది. ఆ తర్వాత ఇలాంటి పాత్రల్లో వంటలు చేయడం కష్టంగా ఉంటుంది. కానీ కార్బన్ స్టీల్‌తో ఇలాంటి సమస్యలు ఉండవు. వీటిపై గీతలు పడకుండా ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్నారు. అందువల్ల ఈ పాత్రలకు ఉండే నాన్ స్టిక్ లేయర్‌కు ఎలాంటి ప్రమాదం ఉండదు.
ధర తక్కువ: కాస్ట్ ఐరన్, స్టెయిన్ లెస్ స్టీల్ ఎక్కువ బరువు ఉంటాయి. కానీ కార్బన్ స్టీల్ సన్నగా, తేలికగా, దృఢంగా ఉంటుంది. ఇవి కాస్ట్ ఐరన్‌తో పోలిస్తే సగం బరువు మాత్రమే ఉండటం విశేషం. అలాగే స్టెయిన్ లెస్ స్టీల్‌తో పోలిస్తే కార్బన్ స్టీల్ ధర చాలా తక్కువగా ఉంటుంది. వీటితో ప్రయోజనాలు సైతం ఎక్కువగా ఉండటం వల్ల, వీటిని ఎంచుకునేవారి సంఖ్య పెరుగుతోంది.