Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎంత కష్టపడ్డా లాభం లేదు. ఎంత సంపాదించినా వృథానే. సంపాదించినదంతా ఖర్చయిపోతుంది. ఒక్క రూపాయి కూడా మిగలట్లేదు. జీతం అకౌంట్లో పడగానే మూడు రోజులు కూడా ఉండట్లేదు. మీరు తరచూ ఇలాగే బాధపడుతుంటారా? అయితే మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ సరిగ్గా లేనట్టే. డబ్బు సంపాదించడమే కాదు... సంపాదించిన డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయడం, పొదుపు చేయడం కూడా ఓ కళే. ఈ తరం కుర్రాళ్లైతే క్రెడిట్ కార్డులు విచ్చలవిడిగా వాడేస్తుంటారు. ఆన్లైన్ షాపింగ్‌ను వ్యసనంగా మార్చుకొని జేబులు ఖాళీ చేసుకుంటారు. ఇక పొదుపు చేయడానికి డబ్బులేం మిగుల్తాయి. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో డబ్బు ఎంత ఆదా చేస్తే అంత మంచిది. భవిష్యత్తులో ఏవైనా విపత్కర పరిస్థితులు వచ్చినా ఇప్పుడు ఆదా చేసిన డబ్బే ఆదుకుంటుంది అన్న విషయం మర్చిపోవద్దు. అందుకే డబ్బు ఆదా చేయడానికి ఈ టిప్స్ పాటించండి.
డబ్బు పొదుపు చేయడానికి రెండే మార్గాలు. ఒకటి ఎక్కువ సంపాదించడం. రెండు తక్కువ ఖర్చు చేయడం. ఇప్పుడు సంపాదిస్తున్నదానికన్నా ఇంకా ఎక్కువ సంపాదించడం అంత సులువైన విషయమేమీ కాదు. అందుకే ఖర్చులు తగ్గించుకునే మార్గాలు చూడాలి. గత ఆరు నెలల్లో మీ ఖర్చులను విశ్లేషించాలి.
విశ్లేషించుకోండి
క్రెడిట్, డెబిట్ కార్డులతో ఎక్కువగా ఖర్చులు చేసేవారికి ఈ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది. ఆరు నెలల స్టేట్మెంట్స్ తీసి విశ్లేషించొచ్చు. వృథాగా ఏమేం ఖర్చులు చేశారో ఓ లిస్ట్ రాసుకోవాలి. దాంతో ఇకపై మళ్లీ అలాంటి ఖర్చులు చేయాల్సి వచ్చినప్పుడు మీ అనాలిసిస్ ఉపయోగపడుతుంది. ఏవైనా ఖర్చులు అనవసరం అనిపిస్తే అది మళ్లీ చేయకపోవడం మంచిది.
ప్రతి రూపాయి ముఖ్యమే
మీరు ఓ రెండు కిలోమీటర్ల దూరం కోసం క్యాబ్ బుక్ చేసి ఉంటారు. ఇంకోసారి అదే పరిస్థితి వస్తే... ఆ రెండు కిలోమీటర్లు నడిచి డబ్బు ఆదా చేయొచ్చు. నడక ఆరోగ్యానికి మంచిదేగా. ఇలాంటి చిన్నచిన్న పొదుపు చిట్కాలే మీ డబ్బును ఆదా చేస్తాయి. ప్రతీ రూపాయి ముఖ్యమే. మీరు వంద రూపాయలు ఖర్చు చేయకుండా పొదుపు చేశారంటే ఆ డబ్బు సంపాదనతో సమానం.
పర్సనల్ టాక్స్
మీ జీతంపై మీరే 'పర్సనల్ ట్యాక్స్' ఫిక్స్ చేయండి. డబ్బు పొదుపు చేయడానికి ఇది కూడా ఓ మార్గం. 5 లేదా 10 శాతం ట్యాక్స్ ఫిక్స్ చేయండి. ఉదాహరణకు మీ జీతం రూ.25,000 అయితే అందులో 10 శాతం అంటే రూ.2,500. ఆ డబ్బును రికరింగ్ డిపాజిట్ లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. మీకు కనీసం 6-8 శాతం రిటర్న్స్ ఖాయం. డబ్బును అకౌంట్లో భద్రపరిస్తే మీకేం రాదు. దాని కన్నా ఇన్వెస్ట్ చేయడమే మంచిది.
ఆటో డెబిట్ ఆప్షన్
డెబిట్ ఆప్షన్ ఉపయోగించండి. మీరు ఏదైనా లోన్ తీసుకున్నా, సిస్టమెటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేసినా ఆటో డెబిట్ ఆప్షన్ ఉంటుంది. అందుకే మీరు చేసే ఇన్వెస్ట్మెంట్లు ఈ ఆప్షన్ తప్పకుండా ఎంచుకోండి.
అదనపు ఆదాయం కోసం
మీరు ఉద్యోగం చేస్తారు. జీతం వస్తుంది. వ్యాపారం చేస్తే లాభం వస్తుంది. కానీ ఒకే ఆదాయంపై ఆధారపడటం మంచిది కాదు. ఎందుకంటే ఉద్యోగంలో ఇబ్బందులు రావొచ్చు. వ్యాపారంలో నష్టాలు రావొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఆదుకునేది మీ అదనపు ఆదాయమే. అందుకే మీరు ఎంత మంచి ఉద్యోగంలో, వ్యాపారంలో స్థిరపడ్డా సరే రెండో ఆదాయాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందే. తక్కువ ఆదాయం అయినా సరే రెండో ఇన్కమ్ ప్లాన్ చేయాలి. వారంలో కొన్ని గంటలు పనిచేస్తే ఎంతో కొంత పారితోషికం ఇచ్చే చిన్నచిన్న ఉద్యోగాలు చాలానే ఉంటాయి.
షేర్ చేయడం ద్వారా
ఉదాహరణకు మీ దగ్గర అమెజాన్ ప్రైమ్ అకౌంట్ ఉంటుంది. మీ కజిన్ దగ్గర నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ ఉంటుంది. మీరు నెట్‌ఫ్లిక్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ కజిన్‌కు అమెజాన్ ప్రైమ్ అవసరం లేదు. ఒకటి అకౌంట్ మరొకరు షేర్ చేసుకుంటే చాలు. మీరు ఇంట్లో ఎప్పుడో వాడే వస్తువులను కొనాల్సిన అవసరం లేదు. మీ స్నేహితులో, బంధువుల దగ్గరో ఉంటే తెచ్చుకోవచ్చు. మీ దగ్గర ఉన్న వస్తువులు వారికి అవసరమైనప్పుడు ఇవ్వొచ్చు. ఇక ఏదైనా సందర్భం వస్తే మీ కొలీగ్స్ లేదా స్నేహితులకు పార్టీ ఇవ్వాలా? హోటల్‌కు వెళ్తే వేలకు వేలు ఖర్చవుతుంది. స్నేహితులకైతే మీ ఇంట్లోనే పార్టీ అరేంజ్ చేయండి. ఇల్లంతా సెలబ్రేషన్ వాతావరణం కనిపిస్తుంది. కొలీగ్స్‌కు అయితే ఇంట్లోనే వంట చేసుకొని ఆఫీస్‌కు తీసుకెళ్లండి. ఇక క్యాబ్ బుక్ చేయాలనుకుంటే షేరింగ్ ఫీచర్ వాడుకోవచ్చు.
ఇవే కాదు... మీరు డబ్బు ఆదా చేయడానికి చాలా మార్గాలు ఉంటాయి. మీరు ఖర్చులు తగ్గించుకొని పొదుపు చేయాలన్న ఆలోచన మీలో ఉంటే చాలు. ప్రతీ చోటా పొదుపు చేయొచ్చు.