Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బతుకమ్మ అంటే ముందుగా గుర్తుకొచ్చేది పూలు. ఆ తర్వాత రకరకాల వంటకాలు. అందుకే దీన్ని సద్దుల బతుకమ్మ అని పేరు వచ్చింది. ఈ సందర్భంగా పెరుగన్నం, చింతపండు, పులిహౌర, నిమ్మకాయ, కొబ్బరి పులిహౌర... నువ్వుల పొడి, సత్తుపిండి, కొబ్బరి పొడి, మలీద ముద్దులు, సజ్జ ముద్దలు ఇలా రకరకాల సద్దులు చేసి బతుకమ్మకు సమర్పిస్తారు. ఆ సద్దులు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం...
చింతపండు పులిహౌర
చింతపండు నానబెట్టి పొయ్యిపై కొంచెం దగ్గరకు అయ్యే వరకు వేడి చేయాలి. దానికి మిర్యాల పొడి, కరివేపాకు, మెంతిపిండి, ఎండు మిర్చి, పసుపు, నూనె, తగినంత ఉప్పు, పోపుగింజలు వేసి వేడి చేయాలి. ఆ తర్వాత పొడి పొడిగా ఉన్న అన్నానికి కలిపితే పులిహౌర సిద్ధం.
పెరుగన్నం
అన్నానికి పెరుగు కలిపి పెట్టుకోవాలి. కొద్దిగా నూనె తీసుకుని మరిగించి దానికి పోపు గింజలు, కొన్ని పల్లీలు, కందిపప్పు గింజలు కలిపి అన్నంలో కలిపితే పెరుగన్నం సిద్ధం. పోపుకు కాస్త నెయ్యి కలిపితే రుచికరంగా ఉంటుంది.
నిమ్మకాయ పులిహౌర
వేడి అన్నానికి నిమ్మరసం, తగినంత ఉప్పు కలిపి పెట్టుకోవాలి. మూకుడులో నూనె పోసి దానికి పోపు గింజలు, పల్లీలు, కందిపప్పు కలిపి కాస్త పసుపు కలుపుకొని పోపు పెట్టుకోవాలి. దానిని నేరుగా లేదా చల్లారిన తర్వాత నిమ్మరసంతో కలిపి అన్నానికి కలపాలి.
కొబ్బరి తురుము సద్ది
ఎండు కొబ్బరి తీసుకొని సన్నగా తురిమి దానికి వెల్లుల్లి, ఉప్పు, కారం కలిపి మిక్సీలో మెత్తగా చేసి అలా వచ్చిన పొడిని అన్నానికి కలుపుకోవాలి. చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది.
పల్లీ, నువ్వుల పొడులు
పల్లీలు, నువ్వులను దోరగా వేయించి వాటిని మిక్సీలో మెత్తగా చేసి వచ్చిన పిండికి బెల్లం కలుపుకోవాలి. ఇది పిల్లల ఎదుగుదలకు దోహదం చేస్తుంది. కొబ్బరిని సన్నగా తురిమి దానికి చక్కెరను కలిపి సద్దిగా చేస్తారు. వీటితో పాటు సీతాఫలం, దానిమ్మ, జామ లాంటి పండ్లు నైవేద్యంగా పెడతారు. ఈ ప్రసాదాలు, పండ్లలో పరిపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది.
నువ్వులపొడి సద్ది
నువ్వులను కాస్త వేడి చేసి వాటికి జీలకర్ర, ఉప్పు, కారం కలిపి మిక్సీలో మెత్తగా చేయాలి. దీనిని అన్నానికి కలిపితే నువ్వుల పొడి సద్ది రెడీ అవుతుంది. ఇలా అన్నంతో తయారు చేసే ప్రసాదాన్ని సద్ది అని పిలుస్తారు. చాలా చోట్ల వివిధ రకాల గింజలతో పొడులు, ముద్దలు తయారు చేసుకుంటారు.
సజ్జ ముద్దలు
నాణ్యమైన సజ్జలను తీసుకొని వాటిని వేయించి పొడి చేసుకోవాలి. తర్వాత బెల్లం, నెయ్యి కొద్దిగా పాలు తీసుకొని ఈ మూడింటిని కలుపుకోవాలి. కొందరు బెల్లాన్ని తాగపాకం తీసి ముద్దలు తయారు చేస్తారు. సజ్జల్లో ఇనుము, కాల్షియం అధికం.
మలీద ముద్దలు
సద్దుల బతుకమ్మలో మలీద ముద్దలు ప్రాధాన్యమైనవి. గోధుమ పిండి తీసుకొని రొట్టెలు చేసి దానికి కాసింత నెయ్యి కలిపి వేడిగా ఉన్నప్పుడే చిన్నగా తుంచాలి. చేసుకోవాలి. ఇది సాధ్యం కాని వారు మిక్సిలో వేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవచ్చు. వేడిగా ఉన్న సమయంలోనే బెల్లం, యాలకుల పొడి కలిపి ముద్దలుగా చేసుకోవాలి.
సత్తుపిండి
జొన్నలను వేయించి వాటిని పిండిగా చేస్తారు. దీనికి బెల్లం లేదా చక్కెర కలుపుకొని తింటారు. కొందరు సత్తు పిండికి పాలు కలిపి ముద్దలు చేసుకుని కూడా తింటారు. ఇది మలబద్ధకాన్ని దూరం చేస్తుంది.