Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వ్యాధులు వాటి ఉనికిని గుర్తు చేయడానికి జనం మధ్యన విహారం చేస్తున్నాయి. ఈ వైరస్లు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌తో బాధపడుతున్నాయి. ఎందుకంటే ప్రజలు వాటినెక్కడ మరిచి పోతారోనని మాటి మాటికీ గుర్తు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. వైరస్లు సాధారణ మానవుని కంటికి కనిపించలేవు. కేవలం మైక్రోస్కోపు సహాయంతో మాత్రమే చూడలం. అంటే అదృశ్యరూపంలో ఉన్న వాటిని మానవులు పట్టించుకోవటం లేదనే ఫీలింగ్‌తో మాటిమాటికీ విఘాతం కలిగిస్తున్నాయి. కరోనా వైరస్ అయినా, డెంగ్యూ వైరస్ అయినా ప్రజల మీద దాడి చేసే వైరస్‌లే. దేనికైనా శుభ్రత, పరిసరాల పరిశుభ్రత, వాటినడ్డుకోవడానికి ముక్కుకు అడ్డంగా మాస్క్‌లు, చేతులకున్న వైరస్‌లను పోగొట్టడానికి శానిటైజర్ ద్రావణాలు ఇవే కావలసింది. ఒక వైరస్ తర్వాత మరో వైరస్ ప్రజల మీదకు లంఘిస్తోంది. అయితే ఏంటి... జనం తీసుకోవల్సిన జాగ్రత్తలు, పాటించవల్సిన పరిశుభ్రతలు పాటిస్తే చాలు. అనవసరమైన షికార్లు, ఎక్కువ జన సమూహాల మధ్య తిరగటాలు మానుకుని కళాత్మకంగా గడుపుదాం.
ఇంజక్షన్ మూతలతో
ఇంజక్షన్ సీసాలకు సీల్‌గా ఇంతకుముందు అల్యూమినియం రేకులు ఉండేవి. అప్పుడు కూడా వాటిని సేకరించి బొమ్మలు చేశాను. ఇప్పుడు ప్లాస్టిక్ మూతలు ఇంజక్షన్ సీనల్లోని మందులకు రక్షణగా వస్తున్నాయి. ఈ మూతలతో ఈ రోజు గుర్రం బొమ్మను చేశాను. మనందరం చిన్నప్పుడు గాడిద, గుర్రం కథ చదువుకున్నాం. పూర్వం రాజులు ఎక్కడికైనా వెళ్ళాలంటే గుర్రాలనే ఉపయోగించేవారు. అప్పట్లో గుర్రాలే ప్రయాణ సాధనాలు. గుర్రపు స్వారీ రాని మహిళలు, పిల్లల కోసం గుర్రపు బగ్గీలు ఉండేవి. బగ్గీలు, బండ్లు అన్నీ కూడా చక్రం కనుక్కున్న తర్వాత తయారు చేయబడ్డాయి. రాజులు యుద్ధాలు చేయడం కోసం అశ్వదళంను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకునేవారు. అరేబియా గుర్రం వంటి జాతి గుర్రాలను పెంచుకునేవారు. వాటిని మచ్చిక చేసుకొని స్వారీ చేయడమనేది రాజులకు పెద్ద పరీక్షగా ఉండేది. వాయు వేగంతో పరుగులు తీసే జంతువు గుర్రం మాత్రమే. గుర్రం మూతికి జీను తగిలించడం, కాళ్ళకు నాడాలు కొట్టడం, వంటివి అశ్వికులు చేస్తూ వాటికి దెబ్బలు తగలకుండా చూసుకుంటారు. రాజులకు గుర్రాలు ప్రాణ మిత్రులు. గుర్రాలను ప్రాణప్రదంగా ప్రేమించే రాజులలో విశ్వవిజేత అలెగ్జాండరీ ముందుంటారు. అలెగ్జాండర్ చేసిన యుద్ధాలన్నింటిలో విజయాన్ని చేకూర్చి పెట్టిన ఆయన దగ్గరి నల్ల గుర్రం అంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఆ గుర్రం పేరు 'బ్లూసెఫాలస్''. అది మరణించాక దాని పేరుతో ఒక నగరాన్ని నిర్మించాడు అలెగ్జాండర్.
కొబ్బరి పీసుతో
కొబ్బరి కాయ చెట్టు మీద నుంచి కందపడితే పగిలిపోకుండా ఉండేందుకు గట్టి పీచు ఉండి టెంకాయగా ఉంటాయి. ఈ కాయ పీచు అంతా తీసేశాక కొబ్బరి కాయను కొట్టుకుంటాము. ఇలా మిగిలిపోయిన కొబ్బరి పీసుతో సోఫాలు, పరుపులు తయారు చేస్తారు. ఇంకా కుటీర పరిశ్రమగా కొబ్బరి చిప్పలతో ఎన్నో బొమ్మలు చేస్తుంటారు. నేను చిన్నప్పుడు కొబ్బరి చిప్పలపై పెయింటింగే వేయడం, వాటిని అతికి బొమ్మలు చేయడం చేశాను. కొబ్బరి చెట్లకు నెలవైన తీర ప్రాంతాలలో ఈ బొమ్మల షాపులు ఎక్కువగా కనిపిస్తాయి. చిన్నప్పుడు ముగ్గు పోసుకునేందుకు కొబ్బరి చిప్పల్నే వినియోగించేవారు. ఇంకా అంట్లు తోముకోవడానికి ప్రతి ఇంట్లో కొబ్బరి పీసే వాడేవారు. ''కొడుకు లేకున్నా పర్లేదు. కొబ్బరి చెట్టుంటే చాలు'' అనే సామెత నిజమే అనిపిస్తుంది. కొబ్బరి చెట్టులోని ప్రతి భాగమూ పనికొచ్చేదే. నేనీ రోజు కొబ్బరి పీసుతో గుర్రాన్ని తయారుచేశాను. మా ఇంట్లో మూడు కాబ్బరి చెట్లు ఉండేవి. వేసవి కాలంలో కొబ్బరి నీళ్ళ తాగడం, ఆతర్వాత రాలే కొబ్బరి పిందెలతో బొమ్మలు చేయడం చిన్నప్పటి నుండీ అలవాటు. కొబ్బరి ఆకులతో వాచీలు, ఉంగరాలు చేయడం, బూరలు చేసి ఊదుకోవడం, మువ్వలు ఎండి రాలితే పడవలు చేయడం మా ఇంట్లో అందరికీ అలవాటే.
పల్లీ గింజలతో
మన చిన్న తనంలో కొయ్యగుర్రంతో ఊగి ఆడుకోని వాళ్ళెవరూ లేరు. ఆకాశంలో ఎగిరే కీలు గుర్రం లాంటి వాటిని కథల్లో చదువుకొని కలల్లో తేలిపోని వారూ లేరు. కొయ్యగుర్రం, కీలు గుర్రాలు చూశారు. కానీ పల్లీల గుర్రం చూశారా. ఈ రోజు చూడండి. పొలంలో పండాయని ఒక పేషంటు మాకు పల్లీ తెచ్చిచ్చాడు. వాటితో గుర్రం బొమ్మ చేయాలనిపించింది. రంగురంగుల జూలుతో కార్టూన్ గుర్రం పిల్లను తయారు చేయాలనుకున్నాను. గుర్రం పిల్లను పల్లీ గింజలతో చేశాను. దానికి రంగులు వేశాను. ముగ్గులకు వాడే రంగులను పల్లీల గుర్రానికి వేళాను ఈ వేరు పల్లీ గింజల్లో నూనె శాతం ఎక్కువ. ఇవి బలవర్థకమైన ఆహారం. వీటిలో ఇప్పుడు ఎన్నో హైబ్రీడ్ రకాలను ఉత్పత్తి చేశారు. కాయలో ఎక్కువ భాగం గింజ ఉండేలా, ఎక్కువ నూనె వచ్చేలా, పంట దిగుబడి ఎక్కువ ఉండేలా సృష్టిస్తున్నారు. వేరుశనగ నూనెను వంటలలో వాడటమే కాక వీటితో సబ్బులు, సౌందర్య పోషకాలు తయారు చేస్తారు. నూనె తీసిన తర్వాత వచ్చే పొట్టును పశువులకు, కోళ్ళకు దాణాగానూ, మొక్కలకు ఎరువుగానూ ఉపయోగిస్తారు.
అవిశగింజలతో
నేను అవిశగింజలతో చేసిన గుర్రం అచ్చు నిజమైన గుర్రంలా తయారయింది. శునకాల ఆహారమైన పెడిగ్రీ గింజలతో గుర్రం రూపును తయారుచేశారు. దాని శరీరమంతా అవిశ గింజలతో నింపాను. ఒళ్ళంతా వెంట్రుకలతో ఉండే బాతి గుర్రంలా తయారయింది. గుర్రాల జీవితకాలం 25 సంవత్సరాలల నుంచి 30 సంవత్సరాల దాకా ఉంటుంది. క్రీ.పూ 3000 నుంచి 200 లోపలె గుర్రాలను మచ్చిక చేసుకోవటం మొదలుపెట్టారు. క్రీ.పూ. 4500 కల్లా పూర్తి స్థాయిలో మానవుడు వినియోగించుకోవడం మొదలు పెట్టాడు. ఈ గుర్రాలు ''ఈక్విజ్'' కుటుంబానికి, ''ఈక్వస్'' ప్రజాతికి చెందినటువంటివి. వీటి శాస్త్రీయనామం ''ఈక్వన్ కాబలస్'' అని లిన్నేయస్ 1758 వ సంవత్సరంలో నామకరణం చేశారు. గుర్రాలను వాటి సామర్థ్యాలను పట్టి వాటిని మూడు రకాలుగా విభజించారు. మొదటి రకపు గుర్రాలు చాలా వేగంగా పరిగెత్తగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. రెండవ రకపు గుర్రాలు బలంగా ఉండి బరువులు మోయడానికి అనువుగా ఉంటాయి. మూడవ రకపు గుర్రాలు ఎక్కువగా యూరపులో కనిపిస్తుంటాయి. ఇవి మొదటి రెండవ రకాల సంకరజాతి గుర్రాలు. అవిశగింజల్ని ఆరోగ్యరీత్యా ఈ మధ్య కాలంలో ఎక్కువగా వాడుతున్నారు. వీటి ద్వారా ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కావ్వు లభిస్తాయి. వేల సంవత్సరాల నుండి ఆయుర్వేదంలో అవిశలు వైద్యంలో మంచి పాత్రను పోషిస్తున్నాయి. ఇవి మెరిసే చిన్న చిన్న గింజలు.
పేపరపై చిత్రలేఖనం
నాకు బొమ్మలు వేయడమన్నా, బొమ్మలు చేయడమన్నా చాలా ఇష్టం. నేను మా పిల్లల కోసం ఒక గుర్రం బొమ్మను వెసిచ్చాను. ఆ గుర్రమే ఇది ఈరోజు మన అశ్వశాలకు వచ్చింది. మానవుడు గుర్రాన్ని మచ్చిక చేసుకున్నాక వీటిని గేమ్స్‌లో కూడా వాడటం మొదలు పెట్టారు. అలా 'గుర్రప్పందేలు' మొదలయ్యాయి. ఇప్పటికీ మన పోలీస్ వ్యవస్థలో గుర్రాలను వాడుతూనే ఉన్నారు. మానవులకు ఎన్నో విధాలుగా ఉపయోగపడే గుర్రాల గర్భధారణ కాలం 10 నుంచి 12 నెలలు ఉంటుంది. పురాణాలలో వినత, కద్రువల మధ్య గొడవ ఒక ధవళాశ్యంకు మచ్చ ఉందా లేదా అని మొదలవుతుంది. రాజుల కాలంలో చేసే అశ్వమేధ యాగాలు చేయటం మనం తెలుసుకున్నాం, చదువుకున్నాం. అదీ గుర్రాల చరిత్ర.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్