Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంటిని అతను ఓ నరకం అనుకుంటున్నాడు. భార్యంటే లెక్కలేదు. కనీసం కడుపున పుట్టిన పిల్లల్ని కూడా పట్టించుకోడు. వేరే మహిళలతో సంబంధాలు పెట్టుకొని అసలు ఇంటికే రాడు. భార్య ఏమైనా అంటే బూతులు తిడతాడు. విపరీతంగా కొడతాడు. అలాంటి భర్తను ఎలాగైనా మార్చుకోవాలని ఐద్వా లీగల్సెల్కి వచ్చింది. ఇంతకీ అతను మారాడా? లేదా? ఈవారం ఐద్వా అదాలత్‌లో చదువుదాం...
కీర్తికి పెండ్లయి పన్నెండు సంవత్సరాలు. భర్త పేరు రాజేష్. కరెంటు ఆఫీసులో లైన్మెన్గా చేస్తున్నాడు. వీరికి ఓ పాప, బాబు. మొదటి నుండి అతనికి భార్యంటే గౌరవం లేదు. ఆడవాళ్ళంటే చులకన. కీర్తికి ఎప్పుడైనా ఆరోగ్యం బాగోకపోయినా ఆస్పత్రికి తీసుకుపోడు. కనీసం పిల్లలు జ్వరంతో బాధపడుతున్నా చూసీ చూడనట్టు వదిలేస్తాడు. అత్త కొంత వరకు కోడలికి సహకరిస్తుంది. కీర్తి తమ్ముడు, అక్కనే ఆమె విషయాలన్నీ చూసుకుంటున్నారు.
రాజేష్ సరిగ్గా ఇంటికి రాడు. వచ్చినా ఎప్పుడూ ఫోన్లు మాట్లాడుకుంటూనో, చాటింగ్ చేసుకుంటూనే ఉంటాడు. భర్త వేరే మహిళలతో సంబంధాలు పెట్టుకున్నాడని తెలుసుకున్న కీర్తి అతన్ని నిలదీసింది. అప్పటి నుండి ఇంకా మొండిగా తయారయ్యాడు. అదేంటని అడిగిన తల్లిని, అక్కను కూడా బూతులు తిడతాడు. పాపకు ఇప్పుడు పదేండ్లు. పక్కింటి పిల్లలు ఆమెను ఆడుకోవడానికి రానీయడంలేదు. ''మీ నాన్న తాగొచ్చి అందరినీ తిడుతుంటాడు... అందుకే నువ్వు మా పిల్లలతో ఆడుకోవద్దు'' అంటారు పక్కింటి వాళ్ళు. అది ఆ చిన్ని మనసును ఎంతో కుంగదీసింది.
ఈ మధ్య రాజేష్ విపరీతంగా డబ్బులు కూడా ఖర్చు పెడుతున్నాడు. ఇంటి అవసరాలు మాత్రం పట్టించుకోడు. 25 వేలు సంపాదిస్తూ ఇంట్లో ఎనిమిది వేలు మాత్రమే ఇస్తాడు. పిల్లలకి, భార్యకు ఓ జత బట్టలు కూడా కొనివ్వడు. అలాంటి వ్యక్తి బయట వాళ్ళకు మాత్రం విపరీతంగా ఖర్చుపెడుతుంటే కీర్తి భరించలేకపోయింది. పైగా కీర్తిని ''నువ్వు లావుగా ఉన్నావు. నీ బాడీ నాకు నచ్చలేదు, అసలు నిన్ను చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది'' అంటూ బాధపెడతాడు. పెద్దమనుషుల్లో కూర్చోబెడితే ఇకపై మారతాను అంటాడు. కానీ అతనిలో ఎలాంటి మార్పు రావడం లేదు. దాంతో భరించలేక కీర్తి పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. తెలిసిన వారు చెబితే తమ్ముడిని, అక్కను తీసుకుని ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చింది.
కీర్తి సమస్యలన్నీ విన్న ఐద్వా లీగల్‌సెల్ సభ్యులు తర్వాతి వారం రాజేష్‌ను అతని తల్లిని అక్కను వెంటబెట్టుకుని రమ్మని లెటర్ పంపారు.
చెప్పిన ప్రకారమే రాజేష్ తన తల్లిని, అక్కను వెంటబెట్టుకుని వచ్చాడు. వచ్చీ రాగానే అతని తల్లి బాధపడుతూ ''వీడు మా కుటుంబాన్ని రోడ్డుకు ఈడుస్తున్నాడు. భార్యనే కాదు తల్లి, అక్కను కూడా నానా మాటలు అంటాడు. అసలు ఆడవాళ్ళంటే గౌరవం లేదు. ఎంత చెప్పినా మా మాట వినడు. ఎవరితోనే సంబంధం పెట్టుకొని ఎప్పుడూ ఆమెతోనే ఉంటాడు. ఇంటికి వస్తే తాగి వస్తాడు. వీడి వల్ల ఎవరికీ సుఖం లేదు'' అంటూ ఏడ్చేసింది. రాజేష్ అక్క కూడా అదే చెప్పి బాధపడింది.
అతనితో మాట్లాడితే ''ఇకపై మారతాను మేడమ్, ఎవ్వరితో సంబంధాలు పెట్టుకోను. ఆమెతో అస్సలు మాట్లాడను'' అన్నాడు.
''ఈ విషయం ఇప్పటికి ఎన్నో సార్లు చెప్పాడు మేడమ్. ఆయన మాటలు నమ్మొద్దు. అన్నీ అబద్ధాలే. అతను మారడు. అందుకే ఇకపై నేను అతనితో ఉండలేను. ఆమె కూడా ఈయన్ని వదిలి ఉండలేదంట. ఎన్ని రోజులైనా ఈన కోసం ఎదురు చూస్తూనే ఉంటుందంట. ఇలాంటి వ్యక్తి మారతాడని నాకు నమ్మకం లేదు'' అంటూ కీర్తి ఏడ్చేసింది. కీర్తిని కాసేపు బయట కూర్చోబెట్టి రాజేష్‌తో మాట్లాడితే...
''ఓసారి వాళ్ళ ఇంట్లో కరెంటు పోతే ఎవరి దగ్గరో నా నెంబర్ తీసుకుని ఫోన్ చేసింది. అలా ఆమె పరిచయం అయ్యింది. అప్పటి నుండి రోజూ ఫోన్ చేస్తుంటుంది. మెసేజ్‌లు పెడుతుంది. పది రోజుల తర్వాత 'కాఫీ తాగుదాం రా' అని పిలిచింది. మొదట్లో నేను వెళ్ళలేదు. వెళ్ళే వరకు బతిమలాడింది. సరే కదా అని వెళ్లాను. ఇక అప్పటి నుండి ఇక ఫోన్లు చేస్తూనే ఉంటుంది. ఇంట్లో తెలిసిన తర్వాత వద్దనా నా మాట వినడం లేదు. ఫోన్లు చేస్తూనే ఉంది. ఏం చేయాలో తెలియడం లేదు'' అన్నాడు.
''నీకు భార్యా పిల్లలు ఉన్నారు. వాళ్ళను కాదని ఎక్కడో ఆనందం కోసం వెదుక్కుంటున్నావు. ఇలాంటి సంబంధాల వల్ల అనవసరంగా నీ కుటుంబమే కాదు నీ జీవితం కూడా నాశనమైపోతుంది. నీ కూతురు ఎంత బాధపడుతుందో నీకు అర్థమవుతుందా? నీ భార్య నీకోసం రోజూ ఏడుస్తూనే ఉంది. నువ్వేమో ఇల్లు పట్టించుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు. ఆమెకు పెండ్లయి పిల్లలు ఉన్నారు. కాబట్టి నిన్ను ఆమె ఏమీ చేయలేదు. కానీ నీ భార్య నిన్ను ఏమైనా చేయగలదు. నీ భార్యా పిల్లలతో సంతోషంగా ఉండాలని ఉంటే ఆమెను దూరం పెట్టు. లేదంటే పరిస్థితి మరోలా ఉంటుంది. కీర్తికి లీగల్‌గా నీపై పూర్తి హక్కు వుంది. ఆమెకు అండగా మేమున్నాము. నిన్ను జైల్లో పెట్టించగలదు. ఆలోచించి నిర్ణయం తీసుకో'' అన్నాడు లీగల్ సెల్ సభ్యులు.
''ఇకపై నేను ఆమెతో మాట్లాడను మేడమ్. దూరంగా ఉంటాను. మీరు చెప్పినట్టే వింటాను. నా భార్యా పిల్లల్ని మంచిగా చూసుకుంటాను'' అన్నాడు. ''ఇకపై మారకపోతే నీకే కష్టం'' అని చెప్పి అతన్ని బటయకు పంపి కీర్తిని లోపలికి పిలిచారు. కీర్తి మానసికంగా బాగా నలిగిపోయింది. అందుకే అతను ఇక మారడు అని గట్టిగా చెబుతుంది.
''చూడు కీర్తి ఇప్పటి వరకు మీరు మీరే మాట్లాడుకున్నారు. ఇప్పుడు రాజేష్ మా దగ్గరకు వచ్చాడు. మారతానంటున్నాడు. మేమూ గట్టిగానే చెప్పాము. మారకపోతే అతనికే ఇబ్బంది. కాబట్టి ఈ ఒక్కసారికి అవకాశం ఇచ్చి చూద్దాం. అప్పటికీ మారకపోతే నీ ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకో. మార్పు ఒకేసారి రాదు. అతనితో నువ్వు కూడా మంచిగా ఉండు. మనందరం కలిసి అతన్ని మార్చుకుందాం. పాత విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ బాధపడకు. గొడవలు పెట్టుకోకు. పెద్ద పెద్దగా అరవడం, గొడవపెట్టుకోవడం మానుకో. దాని వల్ల ఉపయోగం లేకపోగా మరిన్ని సమస్యలు వస్తాయి. ఖాళీ సమయంలో మంచి మంచి పుస్తకాలు చదువుకో. లేదంటే ఏదైనా ఉద్యోగం చూసుకో. నీకూ కాస్త బాగుంటుంది. అతను మారడానికి నీవైపు నుండి కూడా ప్రయత్నం జరగాలి. అప్పటికీ మారకపోతే నీ ఇష్టం'' అన్నారు లీగల్ సెల్ సభ్యులు.
సభ్యులు అంతగా చెప్పిన తర్వాత కీర్తి కూడా అంగీకరించింది. అతని తమ్ముడు, అక్క కూడా సభ్యులు చెప్పిన దానికి అంగీకరించారు. రాజేష్‌ని లోపలికి పిలిచి మీరిద్దరూ రెండు నెలల పాటు ప్రతి వారం మా లీగల్‌సెల్‌కు వచ్చి ఎలా ఉన్నారో చెప్పి రిజిస్టర్లో సంతకాలు పెట్టి పోవాలి అని చెప్పారు. దానికి ఇరువైపుల వారు అంగీకరించారు. కీర్తి పిల్లల్ని తీసుకుని భర్తతో వెళ్ళడానికి అంగీకరించింది.
తర్వాత వరుసగా ప్రతి శనివారం ఇద్దరూ లీగల్సెల్కి వచ్చి వచ్చిపోతున్నారు. ప్రస్తుతం అతనిలో కొంత మార్పు వచ్చింది. కీర్తి కూడా అతనిపై కొంత నమ్మకం ఏర్పడింది. దాంతో లీగల్‌సెల్ సభ్యులు ''చూడు రాజేష్ నీలో వచ్చిన కాస్త మార్పు మీ ఇద్దరిలో ఎంత ఆనందాన్ని తెచ్చిపెట్టిందో. కాబట్టి అనవసరంగా సమస్యలు తెచ్చిపెట్టుకోకు. ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండండి. కీర్తినీ, పిల్లల్ని బాగా చూసుకో'' అన్నారు.
7దానికి అతను ''నిజమే మేడమ్... కీర్తి కూడా గతంలోలా నాపై అరవడం లేదు. నన్ను అనుమానించడం లేదు. ఇద్దరం సంతోషంగా ఉంటున్నాం. ఎప్పటికీ ఇలాగే ఉంటాం'' అని చెప్పి భార్యను తీసుకొని వెళ్ళిపోయాడు.
- సలీమ